బై బై అమెరికా.. ప్రసారాలు ఇంతటితో సమాప్తం
అమెరికా బై బై..టా టా.. ఇన్ని రోజులు తమను ఆదరించిన ప్రేక్షకులందరకు కృతజ్ఞతలంటూ ఆల్ జజీరా చానల్ ప్రకటించింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేని ఆ చానల్ మంగళవారం రాత్రితో యూఎస్ లో తన ప్రసారాలు నిలిపివేస్తోంది. ఇవాళ ఆరుగంటలకు(స్థానిక కాలెండర్ ప్రకారం) మొదలయ్యే ఫేర్ వెల్ పార్టీ లైవ్ ప్రొగ్రామ్ అనంతరం ఈ ఛానల్ ప్రసారాలు మూతపడనున్నాయి. ఆ చానల్ లో విజయవంతమైన కార్యక్రమాలను చివరిసారి చూపనున్నారు. కాగా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోలేకపోవడంతో, మార్కెట్లో ఛానల్ ను నిర్వహించడానికి కష్టంగా మారిన క్రమంలో దీనిని మూసివేయనున్నామని జనవరిలోనే ఆల్-జజీరా ప్రకటించింది.
'మేము అమెరికా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వార్తల కవరేజ్ విషయంలో మేము చాలా గర్వంగా ఫీలవుతున్నాం. ఇంతటి సహకారం అందించినందుకు థ్యాంక్స్' అని ఆల్-జజీరా అమెరికన్ ప్రెసిడెంట్ కేట్ ఓ బ్రెయిన్ తెలిపారు. ఖతర్ కు చెందిన ఈ ఛానల్ 2013 లో అమెరికాలో తన ప్రసారాలు మొదలుపెట్టింది. ఉన్నతమైన ఆశయాలతో అమెరికాలో న్యూస్ నెట్ వర్క్ లో ప్రవేశించిన ఆల్-జజీరా, ఎన్నో ఆలోచించపరిచే వార్తలను అందించింది.
మెరుగైన పనితనం వల్ల అవార్డులను కూడా దక్కించుకుంది. బీబీసీతో కలిసి నాలుగు భాగాల డాక్యుమెంటరీని కూడా ఆల్-జజీరా నిర్మించి ప్రసారం చేసింది. అయితే ప్రేక్షకుల నాడిని పట్టుకోవటంలో విఫలం కావటంతో ఆ చానల్ తన ప్రసారాలను నిలిపివేస్తోంది. దీంతో మార్కెట్లో ఈ ఛానల్ ను భర్తీ చేయగలది ఏముందో స్థానిక కేబుల్, శాటిలైట్ ఆపరేటర్స్ నిర్ణయిస్తున్నారు.