C -3
-
నా మనసుకు అనిపించిందే చేస్తా!
నా మనసుకు ఏది అనిపిస్తే అదే చేస్తాను అంటున్నారు నటి శ్రుతీహాసన్.ప్రస్తుతం టాప్ మోస్ట్ కథానాయకిగా వెలుగొందుతున్న ఈ బోల్డ్ బ్యూటీ మొదట్లో గాయనిగా, ఆ తరువాత సంగీతదర్శకురాలిగా పరిచయం అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాతే కథానాయకిగా తెరపైకి వచ్చారు. ప్రముఖ నటుడు కమలహాసన్ కూతురు అనే ముద్రతో రంగప్రవేశం చేసిన శ్రుతీ ఇప్పుడు ఆమె తండ్రి కమల్ అనేంతగా ఎదిగిపోయారు. తమిళ అమ్మాయి అయినా ఆదిలో బాలీవుడ్లో నటిగా పరిచయం అయ్యి, ఆ తరువాత టాలీవుడ్లోకి రంగప్రవేశం చేసి, ఆపైనే కోలీవుడ్‌కు విచ్చేశారు.ఈ మూడు భాషల్లోనూ తొలి చిత్రాలు నిరాశపరచినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవల సూర్యకు జంటగా నటించిన సీ–3 చిత్ర విజయంతో తన సక్సెస్ పయనాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న శ్రుతీహాసన్ మాట్లాడుతూ తనను శక్తిమంతురాలిగా తయారు చేసింది సినిమానేనని పేర్కొన్నారు. నటిగా తానీ స్థాయికి చేరుకున్నా.. ఇప్పటికీ కమలహసన్, సారికల కూతురు అనే గుర్తింపునే కోరుకుంటున్నానన్నారు. కాగా ఇటీవల ఈ ముద్దుగుమ్మ గురించి చాలానే గాసిప్స్ ప్రచారం అవుతున్నాయి. హాలీవుడ్ నటుడితో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం జోరందుకుంది. అలాంటి వాటి గురించి స్పందిస్తూ తన గురించి ఎవరేమనుకున్నా, నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తాననీ చెప్పారీ అమ్మడు. నటిగా తన వయసు ఎనిమిదేళ్లు అనీ, ఈ కాలంలో తనకు సినిమా చాలానే నేర్పిందనీ చెప్పుకొచ్చారు. ఒక పరిణితి చెందిన నటిగా మంచి పాత్రలను ఎంచుకుని మరింత మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశ అని శ్రుతి పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రుతి తెలుగులో పవన్ కల్యాణ్ సరసన కాటమరాయుడు, తన తండ్రి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం శబాష్ నాయుడు చిత్రంతో పాటు మరో హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
మరోసారి వాయిదా?
నటుడు సూర్య చిత్ర విడుదల మరోసారి వాయిదా పడిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీ–3. అనుష్క, శ్రుతీహాసన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సూపర్‌హిట్ చిత్రం సింగంకు సిరీస్‌గా తెరకెక్కిన మూడో చిత్రం అన్నది తెలిసిందే. కమర్షియల్ దర్శకుడు హరీ తాజా చిత్రం ఇది. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం సీ–3. ఇప్పటికే రెండు సార్లు పేర్లను, రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. సూర్య మరోసారి పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటించిన ఈ సీ–3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్ర ట్రైలర్ థియేటర్లలో దుమ్మురేపుతోంది. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గతేడాది డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేశారు. కరెక్ట్‌గా అలాంటి సమయంలో ప్రధాని పెద్ద నోట్ల రద్దు ప్రకటన సీ–3 చిత్ర విడుదలకు ఆటంకంగా మారింది. దీంతో జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఇప్పుడు జల్లికట్టు వివాదం మరోసారి సీ–3 చిత్ర విడుదలకు అడ్డపడిందని తెలుస్తోంది. జల్లికట్టు పోరాటం తమిళనాడులో తీవ్రరూపం దాల్చడంతో ఈ సమస్య సద్దుమణిగిన తరువాత సీ–3 చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా కాస్త లేటుగా అయినా సీ–3 లేటెస్ట్గా ఉంటుందని చిత్ర దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉన్నారని చెప్పవచ్చు. చిత్ర తదుపరి విడుదల తేదీని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదన్నది గమనార్హం.