ఫోన్ కాల్ తో తల్లి ప్రాణం కాపాడిన చిన్నారి!
వాషింగ్టన్: నాలుగేళ్ల చిన్నారి సమయ స్ఫూర్తితో వ్యవహరించి తన తల్లి ప్రాణాలు కాపాడింది. అమెరికాలోని మిచిగాన్ కలమజూ ప్రాంతానికి చెందిన కలైజ్ మానింగ్ అనే నాలుగేళ్ల చిన్నారి ఒక్క ఫోన్ కాల్ తో తన తల్లి ప్రాణాలు నిలిపింది. పురిటి నొప్పులతో బాధ పడుతున్న తన తల్లి సెంటిరీయా గురించి ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసి ఆమెను కాపాడింది.
9 నెలల నిండు గర్భిణి అయిన సెంటిరీయా పురిటి నొప్పులతో కింద పడిపోయి విలవిల్లాడుతుండాన్ని గమనించిన కలైజ్ వెంటనే అత్యవసర సర్వీసు నంబర్ 911కు ఫోన్ చేసింది. 'మా అమ్మ కింద పడిపోయి విలవిల్లాడుతోంది. ఆమె పిల్లాడిని ప్రసవించనుంది. ఆమెకు వెంటనే సహాయం కావాలి' అని ఫోన్లో చెప్పింది.
కలైజ్ ఫోన్ కాల్ కు వెంటనే స్పందించి రంగంలోకి అత్యవసర సిబ్బంది సెంటిరీయాను ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు నిలిపిన కూతురిని చూసి సెంటిరీయా ఎంతో మురిసిపోతోంది. విపత్కర పరిస్థితిలో తెలివిడిగా వ్యవహరించిన కలైజ్ కు అవార్డు కూడా ఇవ్వాలని ప్రతిపాదించారు. తనకు బుల్లి తమ్ముడు రావడంతో 'ఐ యామ్ ది బిగ్ సిస్టర్' అని మురిసిపోతోంది కలైజ్ మానింగ్.