ఎస్ఎంసీ కమిషనర్ బదిలీ రద్దు
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రకాంత్ గూడేవార్ బదిలీని రద్దు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు చెప్పింది. చంద్రకాంత్‌కు వెంటనే పదవీ బాధ్యతలు అప్పగించాలని, తాత్కాలిక కమిషనర్, కలెక్టర్ ప్రవీణ్ గేడాంకు సూచించింది. తీర్పు వెలువడిన విషయం తెలిసిన వెంటనే పట్టణంలోని వివిధ సంఘాల ప్రతినిధులు ఎస్ఎంసి వద్దకు చేరుకుని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రకాంత్ పట్టణంలో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి పలు అభివృద్ధి పనులను చేపట్టారు.
అదే విధంగా ఆక్రమణలను కూలగొట్టడం, కార్యనిర్వాహక యం త్రాంగంలోని అవినీతి అధికారులపై వేటు వేయ డం, ఎల్బీటీని నిక్కచ్చి వసూలుకు పూనుకున్నా రు. దీంతో అత్యల్ప కాల వ్యవధిలోనే చంద్రకాంత్ పట్టణంలో ప్రజాదరణ పొందారు. కాగా, చంద్రకాంత్ చర్యలతో నష్టపోయిన అధికారపార్టీ నాయకులు ఆయన బదిలీ కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 23న చంద్రకాంత్‌ను గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ బదిలీకి నిరసనగా ప్రజలు పట్టణంలో బంద్ పాటించి పలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో కొంత మంది హైకోర్టులో బదిలీకి వ్యతి రేకంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖ లు పరిచారు. దీనిపై రవీంద్ర గుగే,నరేష్ పాటిల్ న్యాయమూర్తుల బెంచ్ స్పందిస్తూ చంద్రకాంత్ బదిలీని రద్దుచేస్తూ తీర్పు చెప్పింది. మాజీ శాసనసభ్యుడు నర్సయ్య అడం, కార్పొరేటర్ ఆనంద్ చందన్‌శివే, పద్మశాలి ప్రతిష్టాన్ కన్వీనర్ సురేష్ పలుమారి, కామూ సంఘటన అధ్యక్షుడు అశోక్ ఇందాపూరె, ఎస్ఎంసి సిబ్బంది తదితరులు హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే సిఫార్సు వల్లే చంద్రకాంత్ బదిలీ జరిగిందని నర్సయ్య ఆరోపించారు. చంద్రకాంత్ రాత్రి వరకు ఇక్కడకు వచ్చి పదవీ బాధ్యతలు చేపడతారని, రేపు జెండావందనం చేస్తారన్నారు.