జోనల్ వ్యవస్థ రద్దు!
371 (డి) తొలగింపునకు కసరత్తు
రాష్ట్రమంతటినీ ఒకే ఫ్రీ జోన్‌గా చేసే యోచన జోనల్ వ్యవస్థ రద్దుతో సమ న్యాయానికి తూట్లు
వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల వారికి ఉద్యోగ, విద్యా రంగాల్లో తీరని అన్యాయం
విద్యారంగ నిపుణులు, అధికార వర్గాల్లో ఆందోళన
హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జోనల్ విధానం రద్దు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోనల్ విధానంతో పాటు 371 (డి) నిబంధనను కూడా ఎత్తివేయాలన్న ఆలోచన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకాగా విభజన అనంతరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జోన్లు ఉన్నాయి. ఈ పద్ధతిని రద్దు చేసి రాష్ట్రమంతటినీ కలిపి ఒకే ఫ్రీ జోన్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం తనను కలిసిన విలేకరులకు సూచన ప్రాయంగా దీన్ని వెల్లడించారు.
జోనల్ వ్యవస్థ రద్దు, 371 డి నిబంధన తొలగింపు యోచనపై విద్యారంగ నిపుణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల వారికి ఉద్యోగ, విద్యా రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ జోన్ల వ్యవస్థను, 371 డి నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆలోచన చేయడంపై విస్మయం వ్యకమవుతోంది.
నాలుగు జోన్లూ కలిపి ఒకే ఫ్రీ జోన్!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నాలుగు జోన్ల వ్యవస్థ కొనసాగుతోంది. జోన్-1 కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు, జోన్-2 కింద తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్-3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలుండగా.. జోన్-4 కింద చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలున్నాయి.జోనల్ వ్యవస్థ అమల్లో ఉంటే ఉద్యోగ నియామకాలు రాష్ట్ర, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా జరుగుతాయి. ఆయా జోన్ల పరిధిలోని జిల్లాల వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒకే ఫ్రీ జోన్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటి పరిస్థితుల్లో 371 (డి) తీసుకువచ్చారని, దీన్ని ఇప్పుడు రద్దు చేసి జోనల్ విధానాన్ని తొలగించాల్సి ఉందని మంత్రి యనమల అభిప్రాయపడ్డారు.
ఫ్రీ జోన్ వల్ల నష్టమేంటి..?
ప్రస్తుతం ఏపీలో ఉన్న 4 జోన్ల విధానాన్ని రద్దు చేసి, రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా చేస్తే జోనల్, జిల్లా స్థాయి పోస్టుల్లో స్థానిక జిల్లాలు, జోన్ల వారికి అన్యాయం జరగక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక స్థితిగతులు, పరిస్థితులు ఇతర కారణాల వల్ల సహజంగానే అన్ని జిల్లాల వారు సమాన తెలివితేటలు, సామర్థ్యాలు కలిగి ఉండరన్నది వాస్తవమే. ఇలాంటి పరిస్థితుల్లో జోనల్ విధానాన్ని ఎత్తివేస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల వారికి అన్యాయం జరుగుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. స్థానిక కోటాలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల్లో ఆయా జిల్లాల విద్యార్థులు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని, విద్య, ఉద్యోగ అవకాశాలు దాదాపు పూర్తిగా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సామాజికంగా ఉన్నతస్థానంలో ఉన్న జిల్లాల వారికే ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణ తరహాలోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమం తలెత్తే అవకాశం ఉందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
రద్దు సాధ్యమేనా..?: జోనల్ వ్యవస్థ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీని రద్దు సాధ్యమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. తిరిగి రాష్ట్రపత్తి ఉత్తర్వుల ద్వారానే జోనల్ వ్యవస్థను రద్దు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇది సమన్యాయాన్ని దెబ్బతీస్తుందని, వెనుకబడిన జిల్లాలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. అన్ని జిల్లాలకు, జోన్లకు సమ న్యాయం జరగాలంటే జోనల్ వ్యవస్థ, 371 (డి) కొనసాగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన కీలకమైన అంశం కాబట్టే కేంద్రం రాష్ట్ర పునర్విభజన చట్టంలో సైతం దీనిని పొందుపరిచిందని గుర్తు చేస్తున్నారు.
371 (డి) ఏం చెబుతోంది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని ప్రాంతాల వారికి స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ల కల్పనకుగాను 1973లో రాజ్యాంగ సవరణతో 371 (డి) నిబంధనను తీసుకువచ్చారు. 1974లో ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రాతిపదికన 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీటి ద్వారా జోనల్, మల్టీ జోనల్, జిల్లా యూనిట్‌తో కూడిన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. వీటి ప్రకారం..
►జిల్లా స్థాయి ఉద్యోగ నియామకాల్లో 80 శాతం స్థానికులకే కేటాయించాలి. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ టు ఆల్ కింద మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.
►జోనల్ పోస్టుల్లో... 70 శాతం పోస్టులను సంబంధిత జోన్‌కు చెందిన వారికే కేటాయించాలి. మిగితా 30 శాతం పోస్టులను ఆ జోన్‌లోని వారితో సహా రాష్ట్రంలోని అన్ని జోన్లకు చెందిన వారికి ఓపెన్ టు ఆల్ కింద మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టాలి.
►మల్టీ జోనల్ పోస్టుల్లో (రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు) స్థానికులకు 60 శాతం పోస్టులు కేటాయిస్తారు. మిగతా జిల్లాల వారు ఓపెన్ టు ఆల్ కింద 40 శాతంలో ఎంపిక కావొచ్చు.