సీబీఎస్ఈ పాఠశాలల్లో సీసీఈ విధానం రద్దు
న్యూఢిల్లీ: అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలో 6–9 తరగతులకు సమగ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సీబీఎస్ఈ బుధవారం తెలిపింది. బోధన, ముల్యాంకనాలను ప్రామాణీకరించడం కోసం చేపట్టనున్న ఈ మార్పులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సీబీఎస్ఈ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. పదో తరగతి పరీక్షలను పునరుద్ధరించడంతో ఈ మార్పులు అత్యవసరమయ్యాయని సీబీఎస్ఈ తెలిపింది. సీసీఈ విద్యా విధానంలోని లోపాల కారణంగా ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే 6–9 తరగతుల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీబీఎస్ఈ అధికారి ఒకరు అన్నారు. నూతన విద్యావిధానంలో రాత పరీక్షకు 90 శాతం మార్కులు ఉండగా, 10 శాతం మార్కుల్ని ఉపాధ్యాయులు ఇతర కార్యక్రమాలకు కేటాయించనున్నారు.