Candidates campaign
-
‘రాజకీయ’ మాధ్యమం...
సాక్షి, అమరావతి బ్యూరో : కాలంతో పాటే అడుగులేస్తూ రాజకీయ నాయకులు ఆధునిక సాంకేతికత వినియోగానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకుంటున్నారు. ప్రధాన పార్టీల తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరందరి ప్రధాన లక్ష్యం రానున్న ఎన్నికలే కావడం విశేషం. గత ఎన్నికల తరువాత నాలుగేళ్లుగా అంటీముట్టనట్లున్న నాయకులు హఠాత్తుగా ‘విస్తృత’ పర్యటనలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ‘అమ్మా బాగున్నావా.. అక్కా ఎలా ఉన్నావు... అన్నా నన్ను మరిచిపోకండి’ అంటూ, మంచి, చెడు కార్యక్రమాలకు హాజరవుతూ ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇక్కడివరకు సాధారణమే అయినా, వీటన్నింటిని సోషల్ మీడియాకు ఎక్కిస్తూ తమకు కావాల్సిన మైలేజీ పొందుతున్నారు. వీటికి వచ్చే లైక్‌లు, కామెంట్లు నాయకులకు కొత్త ఉత్సాహం ఇస్తున్నాయి. నాయకులు ఏ పల్లెలో కార్యక్రమాలు చేసినా వెనువెంటనే అనుచరగణం వాటిని సోషల్ మీడియాకు ఎక్కిస్తోంది. అంతేకాక, ఓటింగ్‌కు పెడుతూ మద్దతంతా తమకే అని నమ్మించే యత్నం చేస్తోంది. అభ్యర్థులైతే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ ఖాతాలు తెరిచి పోస్టింగ్‌లతో వేడి పెంచుతున్నారు. తమ నియోజకవర్గంలోని పాత్రికేయ మిత్రులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయించి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అటు సమాచారం చేరవేత, ఇటు ప్రచారం రెండూ ఒకేసారి పొందుతున్నారు. మండలానికి కొందరి చొప్పున ఎంపిక చేసుకుని వారి ద్వారా గ్రామాల్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగానే సమాచారం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెట్వర్క్ కంపెనీలు డాటా చార్జీలను తగ్గించడంతో అందరికీ అందుబాటులోకి వచ్చిన సదుపాయాన్ని సామాజిక మాధ్యమాల వినియోగంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. కామెంట్లు.. కౌంటర్లు.. ‘ప్రస్తుతం మన నియోజకవర్గంలో గెలిచేవారు ఎవరు?’ అంటూ... కింద ఉంచుతున్న వివిధ పార్టీల అభ్యర్థుల వారి ఫొటోలకు అనుచరులు తక్షణమే స్పందిస్తున్నారు. కామెంట్లు, కౌంటర్లు పెడుతూ తమకిష్టమైన వారి గుణగణాలు, ఎదుటివారి లోపాలను ఎత్తిచూపుతున్నారు. ‘ఐదేళ్ల కిందట ఇలా ఉండేది... ఇప్పుడు ఇలా మార్చాం. ఈ ఘనత మా అభ్యర్థిదే. ఇలాంటివి ఎన్నో చేశాం. ఇకపై మరెన్నో చేస్తాం. ఇప్పటికైనా అభివృద్ధికి చేయూతనివ్వండి’ అని ఊదరగొడుతున్నారు. ఇలాంటివాటిపై అనుచరులు జయహో అంటుంటే, ప్రత్యర్థులు మాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కొన్నిచోట్ల శ్రుతి మించి ప్రత్యక్షంగా గొడవలకు దిగే వరకు వెళ్తోంది. గతి తప్పుతోందా? ప్రయోజనం మాట అటుంచితే అవాస్తవాల ప్రచారానికీ సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. లేనివాటిని ఉన్నట్లు చిత్రీకరిస్తూ వార్తలు పోస్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు నకిలీ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ నాయకుల కుటుంబాలపై అవాస్తవాలతో బురదజల్లడం, టికెట్లు ఇవ్వకముందే ఇచ్చేశారంటూ ప్రచారం, పార్టీ ఫిరాయింపులు... ఇలా పలు విధాల దుష్ప్రచారాలకు సోషల్ మీడియా వేదికవుతోంది. పార్టీ వీరాభిమానులు తమ నాయకుడిని పొగిడేందుకు ఇతర పార్టీల వారిని తక్కువ చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎందరినో కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఘటనలు చూస్తున్నాం. సోషల్ మీడియా ప్రచారాలపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై దృష్టిపెడితే మిగతా పనులు చేసుకునే పరిస్థితి ఉండదని పోలీసు వర్గాలు వాపోతున్నాయి. ఇదో పెద్ద తలనొప్పిగా మారిందని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం సోషల్ మీడియాపై నిఘా పెట్టామని చెబుతున్నప్పటికీ, నేరుగా నియంత్రించగలిగే పరిస్థితి కనిపించటం లేదు. పార్టీల ప్రోత్సాహం స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ఎన్నికల ప్రచార సరళి చాలా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ... సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుని లాభపడటం ఇప్పుడు అన్ని పార్టీలు, నాయకులకు ఓ ఉదాహరణగా మారింది. ఈ అస్త్రాన్ని వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ‘సోషల్ మీడియా వార్ రూం’ల ఏర్పాటు ఇందులో భాగమే. పార్టీలోని నాయకులూ తమ వంతుగా వీటికి సాయపడుతుంటారు. విమర్శలకు వేదికగా ప్రచారంతో పాటు విమర్శలు– ప్రతి విమర్శలకూ సోషల్ మీడియా వేదికవుతోంది. నాయకులు నెరవేర్చని హామీలు, గతంలో వాటి గురించి మాట్లాడిన మాటలు, ఫొటోలు, అదనంగా క్యారికేచర్లు, వీడియోలను షేర్ చేస్తున్నారు. దీంతో సహజంగానే అనుకూల, ప్రతికూల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కిందిస్థాయి నాయకులు తమకు పార్టీలో ప్రాధాన్యం లేదన్న అసంతృప్తినీ సోషల్ మీడియాలోనే వెళ్లగక్కుతుండటం గమనార్హం. – ఆర్. లవకుమార్ రెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో -
వరంగల్ : మొదటిసారైతే నేమి... గెలుస్తాం
రాజకీయాల్లో రాణించాలంటే అనుభవంతో పాటు వ్యూహ రచన, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరిచయాలు, జనాల్లో పలుకుబడి ఉండాలి. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం అలాంటి సంప్రదాయం నెమ్మదిగా రూపుమారుతోంది. ఇప్పటి వరకు జనాలకు అంతగా పరిచయం లేని వారు తెరపైకి వచ్చి హేమాహేమీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్నవారిలా ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. వారు వన్‌సైడే అనుకున్న చోట ఉత్కంఠ ఫలితాలకు తెరతీస్తున్నారు. సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయని వారు రాష్ట్ర అసెంబ్లీ–2018 ఎన్నికల బరిలో నిలిచారు. కొందరు కొత్తగా రాజకీయాల్లోకి వస్తే మరికొందరు రాజకీయాల్లో ఉంటు పోటీ చేయడం ఇదే తొలిసారి. వారసత్వం, వ్యాపార రంగాల నుంచి రాజకీయాల్లో వచ్చి ప్రచార జోరు పెంచుతున్నారు. దీంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులగా బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీనియర్ల సలహాలు.. రాజకీయ ఉద్ధండులకు తీసిపోకుండా వ్యూహాలు పన్ని ప్రచారంలో దూసుకెళ్తూ వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. పార్టీ సీనియర్లను గౌరదవిస్తూనే వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడ అసంతృప్తి సెగ రాజుకోకుండా తమదైన శైలిలో ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 172 మంది బరిలో ఉండగా కొందరికీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. కాగా ఎలాంటి బెణుకు లేకుండా ప్రాంతాన్ని బట్టి అక్కడి సమస్యలను కళ్లకు కట్టే విధంగా వివరించడంతో పాటు వాటి పరిష్కార మార్గాలను పూసగుచ్చినట్లు తెలుపుతున్నారు. వారిలో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన వారి వవరాలు ఇలా ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇందిర.. సింగపురం ఇందిర తండ్రి దేవదానం కాంగ్రెస్ పార్టీ అభిమాని. వరంగల్‌కు ఇందిరాగాంధీ వచ్చిన సమయంలో ఇందిర పుట్టంది. దీంతో ఇందిరమ్మ పేరును తన బిడ్డకు నామకరణం చేశాడు దేవదానం. ఇందిర రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పదవులను నిర్వర్తిస్తున్నారు. కాగా ప్రస్తుతం పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు గట్టి పోటీ ఇస్తున్నారు. డోర్నకల్‌లో లక్ష్మణ్ నాయక్.. డోర్నకల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా లక్ష్మణ్ నాయక్ పోటీ చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలంటే మక్కువతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. బీజేపీలో వివిధ పదవులు చేపట్టారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురానికి చెందిన లక్ష్మణ్ నాయక్‌కు బీజేపీ డోర్నకల్‌లో ఆవకాశం ఇవ్వడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుం టున్నారు. వారసత్వంగా కీర్తిరెడ్డి మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు డాక్టర్ కీర్తిరెడ్డి బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2009 నుంచి పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గండ్ర సత్యనారాయణ బరిలో ఉన్నారు. కీర్తిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త అయినప్పటికీ ప్రచారంలో తన పోటీదారులతో సమానంగా రాణిస్తున్నారు. ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కడిగిపారేస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా మాట్లాడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటోంది. మానుకోటలో హుస్సేన్ నాయక్.. మహబూబాబాద్ నియోజవర్గం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త హుస్సేన్ నాయక్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన బీజేపీ టికెట్‌ను దక్కించుకున్నారు. కొంత కాలంగా మహబూ బాబాద్ ప్రజలతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా మానుకోటలో టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ బరిలో ఉన్నారు. హుస్సేన్ నాయక్ తనను గెలిపించాలని .. మానుకోటను అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను వేడుకుంటున్నారు. వ్యాపార రంగం నుంచి వద్దిరాజు రవిచంద్ర వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర బరిలో ఉన్నారు. గ్రానైట్ వ్యాపారంలో ఒదిగిపోయారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. కాగా తూర్పులో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు గట్టి పోటీదారుడిగా రవిచంద్ర ప్రచారం కొనసాగిస్తున్నారు. ముందుగా ఒకింత తడబడిన ప్రస్తుతం తన వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేస్తే పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
సమయం లేదు మిత్రమా...
రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని జెడ్ స్పీడ్‌లో పరుగులు పెట్టిస్తున్నారు. మరో వైపు కీలకమైన కుల, యువజన సంఘాలపై నేతలు దృష్టి సారించారు. వారిని తమ వైపు తిప్పుకుంటే తమ గెలుపుకు తిరుగుండదని భావిస్తున్నారు. అవసరాలు తెలుసుకుని హామీలు గుప్పిస్తున్నారు. కొన్నింటిని అప్పటికప్పుడే నెరవేరుస్తున్నారు. అదే సమయంలో పక్క పార్టీలో అసంతృప్తులను తమ వైపునకు ఆకర్షించేలా మంతనాలు సాగిస్తున్నారు. జిల్లాలో హోరా హోరీగా సాగుతున్న ప్రచారం.. అభ్యర్థులు వ్యూహాలపై ప్రత్యేక కథనం.. జోగిపేట(అందోల్): ఎన్నికల వేళ ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థుల ప్రయత్నాలుఅన్నీ ఇన్నీ కావు. ఎన్నో ప్రయత్నాలతో టిక్కెట్లు సాధించుకున్నవారు వివిధ వర్గాల మద్దతుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. తెరాస అభ్యర్థులు ముందే ఖరారవడంతో వారు ఇప్పటికే వివిధ వర్గాల, సంఘాల మద్దతుకోసం చేయాల్సిన ప్రయత్నాలు చేశారు.. ఇప్పుడు విపక్ష పార్టీల అభ్యర్థుల వంతు వచ్చింది. ప్రజాకూటమి, భాజపా అభ్యర్థులను విడతలవారీగా ప్రకటించడంతో టిక్కెట్ ఖరారయిన మరుక్షణం నుంచి అభ్యర్థులు తమ విజయానికి అవసరమైన అన్ని వర్గాలు, మార్గాలపై దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని వర్గాలు.. సంఘాలతో సమావేశమైనవారు ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేసే ఎత్తులు వేయడంపై దృష్టి సారించారు. అభ్యర్థులు దృష్టిపెట్టిన వివిధ వర్గాలు.. మద్దతుకు చేస్తున్న ప్రయత్నాలు ఇవీ.. కుల సంఘాలుతో కలయికలు.. నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాలకు చెందిన సంఘాలతో అభ్యర్థులు సమావేశమవుతున్నారు. తనకు ఓటేస్తే వారి సంఘానికి చేసే లబ్ధిని వివరిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. కుల సంఘాల్లోని ‘కీ’లకమైన నేతల ఆర్థిక అవసరాలు తీరుస్తూ వారి సామాజికవర్గ ఓట్లు గంపగుత్తలా వచ్చేలా చూడాలని కోరుతున్నారు. కొందరు సంఘాల నాయకులను పార్టీల్లోకి ఆహ్వానిస్తూ మద్దతు కోరుతుండగా.. మరికొందరిని పార్టీలోకి రాకున్నా అంతర్గతంగా సహకారం అడుగుతున్నారు. మహిళా సంఘాల మద్దతు కోసం ప్రయత్నాలు.. గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలది కీలకపాత్ర. గ్రామాల్లోనైతే దాదాపు ప్రతీ ఇంటి నుంచి మహిళలు సభ్యులుగా ఉంటున్నారు. అందుకే ఈ సంఘాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళా సంఘాలతో ఓ వైపు అభ్యర్థులు.. మరోవైపు ఆ పార్టీల నాయకులు సమావేశమవుతూ మద్దతు కోరుతున్నారు. గెలిస్తే సమావేశ భవనాలు నిర్మించడానికి నిధులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. అందులో కీలకంగా వ్యవహరించేవారికి ప్రాధాన్యం ఇస్తూ వారికి ప్రత్యేక హామీలు ఇస్తున్నారు. యువజన సంఘాలకు సహాయాలు.. గ్రామాల్లో యువకుల మద్దతు ఉంటే ఆ సందడే వేరు. అందుకే అభ్యర్థులు యువజన సంఘాలపై దృష్టి పెట్టారు. వారి మద్దతు కోరుతూ వారికి క్రికెట్ కిట్లు తదితర ఆట పరికరాలు ఇస్తామని, మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో కొత్తగా యువజన సంఘాలు పుట్టుకొస్తున్నాయి. వీరైతే తాము వెంబడి తిరగాలంటే రోజుకింత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు, నాయకుల వెంట తిరుగుతున్నారు. తమ సంఘంలో ఇంతమంది ఉన్నారు, తమ మద్దతు కావాలంటే ఏమిస్తారో చెప్పాలని డబ్బు వసూలు చేసుకుంటున్నారు. ప్రచారంలో యువత ఉంటే సందడి ఉంటుందని భావిస్తున్న నాయకులు వీరి డిమాండ్లకు తలొగ్గుతున్నారు. విద్యార్థి సంఘాలు.. ఈ ఎన్నికల్లో విద్యార్థి సంఘాలకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. సంఘాలను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. తెరాసకు వ్యతిరేకంగా ఉన్న సంఘాలను మచ్చిక చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వారిని పర్యటించే విధంగా చేయడంతో పాటు పత్రిక సమావేశాలు, యాత్రలు నిర్వహించేందుకు కూడా సహకారం అందిస్తున్నారు. కొన్ని విద్యార్థి సంఘాలు సైతం ఈ పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. చేరికలపై దృష్టి ఈసారి ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరడం ఎక్కువైంది. ఉదయం ఒక పార్టీలో ఉండి మధ్యాహ్నానికి మరో పార్టీలో చేరుతున్నవారూ ఉంటున్నారు. ఈ ఎన్నికల సందడి ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు వేలాది కొత్త కండువాలు మార్కెట్లోకి వచ్చి చేరాయి. గ్రామ స్థాయిలో పట్టు ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగా లేక సైలెంట్‌గా ఉన్న నాయకుల ఆర్థిక అవసరాలు తెలుసుకుని వారికి సాయం చేసి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయా గ్రామాలు, ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ముందు తమకు మద్దతీయమని కోరుతున్నారు. మధ్యవర్తుల మచ్చిక.. ఈ ఎన్నికల్లో మధ్యవర్తుల హడావుడి ఎక్కువయింది. అభ్యర్థుల చుట్టూ వారే ఉండి ఓట్లను రాబట్టేందుకు ఉన్న మార్గాలను వారికి సూచిస్తున్నారు. అలాంటి వారిని అభ్యర్థులు ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అభిమానులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఎలా ఆలోచిస్తున్నారనే విషయాలను సేకరిస్తున్నారు. సంప్రదాయ ఓటర్లలో ఎంత శాతం ఇతర పార్టీ, ప్రత్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారనేది అంచనా వేస్తున్నారు. తటస్థ ఓటర్లు ఎక్కడ ఉన్నారు? వారి మనోభావాలు చివరి వరకు ఎలా ఉంటాయనే విషయాలు చెబుతున్నారు. వీరికి అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ తమకు అవసరమైన సమాచార సేకరణకు ప్రోత్సహిస్తున్నారు. కాలనీ సంఘాలతో సమావేశాలు.. పట్టణాల్లో కాలనీ సంఘాలపై అభ్యర్థులు దృషి పెట్టారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు, అనుచరులు రాత్రి సమయాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారి మద్దతు కోరుతున్నారు. సంఘాల్లో కీలకంగా వ్యవహరించేవారికి రోజూ పారీ ్టలు ఏర్పాటు చేస్తూ కాలనీల్లో ప్రచారం చేయాలని కోరుతున్నా రు. పట్టణాల్లో చాలా కాలనీల్లో సంఘాల బాధ్యులకు ప్రతీ ఒక్కరూ తెలిసి ఉంటారని భావిస్తున్న నేతలు వారి మద్దతు దొరికితే ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని భావిస్తున్నారు. వ్యాపార వర్గాలతో మమేకం.. వ్యాపార సంఘాలపైనా అభ్యర్థులు దృష్టి పెట్టారు. అభివృద్ధి కోణాలు వివరిస్తూ మద్దతు కోరుతున్నారు. ఆర్థిక అంశాలు ఈ సంఘాల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతో వారికి గతంలో చేసిన మేలు, ఈసారి ఎన్నికైతే చేసే లాభాన్ని వివరిస్తున్నారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామాని భరోసానిస్తున్నారు. -
మండలి వేడి
మరో పదిరోజుల్లో శాసనమండలి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రచార పర్వంలో ముందుండగా.. తొలిసారి అభ్యర్థిని నిలిపిన కాంగ్రెస్‌లో సమన్వయ లోపం కనిపిస్తోంది. 32మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నా ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌ను పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపిన టీఆర్ఎస్ బహుముఖ ప్రచారంపై దృష్టి సారించింది. ఓటర్ల నమోదులో టీఆర్ఎస్ క్రియాశీలంగా వ్యవహరించకపోవడంతో ప్రస్తుతం విస్తృత ప్రచారం ద్వారా గట్టెక్కాలనే ప్రయత్నంలో ఉంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. ఇప్పటికే మూడు విడతలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవీప్రసాద్ తిరిగి 13, 14, 16 తేదీల్లో జిల్లాకు రానున్నారు. గతంలో వాయిదాపడిన జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు పార్టీ యంత్రాంగంపై ఆధారపడుతూనే వివిధవర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సీపీఐ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, జేఏసీ భాగస్వామ్య సంఘాలు బృందాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఫ్లెక్సీలు, పోస్టర్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో హాల్ మీటింగ్స్ ద్వారా మద్దతు కూడగట్టే దిశగా టీఆర్ఎస్ వ్యూహం సాగుతోంది. చాపకింద నీరులా బీజేపీ రెండుసార్లు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాంచందర్‌రావు పోటీ చేశారు. వరుసగా మూడో పర్యాయం ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నుంచే చురుగ్గా వ్యవహరిస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రచారం చాపకింద నీరులా కనిపిస్తోంది. పార్టీ, అనుబంధ సంఘాల నేతలు ప్రచార బాధ్యతను భుజాలపై వేసుకుని పనిచేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మూడు పర్యాయాలు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ప్రైవేటు కాలేజీలు, బార్ అసోసియేషన్లు, రిటైర్డు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు లక్ష్యంగా ప్రచారం సాగుతోంది. హాల్ మీటింగ్స్‌ను విస్తృతంగా జరిపేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒంటరి పోరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల బరిలో తొలిసారిగా అభ్యర్థిని నిలిపిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మాత్రం సమన్వయ లోపం కనిపిస్తోంది. పార్టీ ముఖ్యనేతలు కొందరు.. తమను సంప్రదించకుండా పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ నుంచి సమన్వయకర్తలను నియమించినా ఇప్పటివరకు సమష్టిగా ప్రచారం జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే అభ్యర్థి రవికుమార్ గుప్తా మాత్రం కలిసి వచ్చే పార్టీ నేతలతో పాటు విద్యాసంస్థలు, బార్ అసోసియేషన్లు లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. వీలైనచోట హాల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో ఉన్నా ప్రచారంలో కనిపిం చడం లేదు. స్వతంత్ర అభ్యర్థి రాకొండ సుభాష్‌రెడ్డి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల మద్దతుతో ప్రచారం నిర్వ హిస్తున్నారు. -
ప్రచారానికి పదును
పురపాలక సంఘాలు, నగరపంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఓ క్రతువు ముగిసింది. నామినేషన్ల పరిశీలన ఘట్టం ఇప్పటికే పూర్తయింది. మరో వైపు అభ్యర్థులు ప్రచారానికి పదును పెట్టారు. ఓటరు మహాశయుని కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఐదు రోజులపాటు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం 3,083 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన ఆదివారం కొలిక్కి వచ్చింది. మొ త్తం 323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 2,758 నామినేషన్లు అర్హత సా ధించాయి. దేవరకొండలో దాఖలైన నామినేషన్లలో సగానికిపైగా తిరస్కరణకు గురికావడం గమనార్హం. మొత్తం 340 నామినేషన్లకుగాను 190 నామినేషన్లను అధికారులు తి రస్కరించారు. భువనగిరిలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. అయితే కొన్ని స్థానాలకు ఒక్కో అభ్యర్థి రెండు నామినేషన్లు కూడా సమర్పించారు. ఒకటి కాకపోయినా ఒక టైనా అర్హత సాధిస్తాయన్న ఉద్దేశంతో ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు అందజేశారు. ఈ క్ర మంలో చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లు 18వ తేదీన ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తద్వారా అంతి మంగా బరిలో నిలి చే అభ్యర్థుల సంఖ్య ఎంతన్నది తేలనుంది. ప్రచారబాట పట్టిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అప్పుడే ప్రచారబాట పట్టా రు. వాడల్లో తిరుగుతూ తమకే ఓటేయాలని అర్థిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవద్దన్న కృత నిశ్చయంతో ఉన్న అభ్యర్థులు ముందు నుంచే ప్రచారం సాగిస్తున్నారు. పరిశీలన లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మున్సిపాలిటీల్లో ప్రచారానికి దిగుతున్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారంలో తలమునకల య్యా రు. చైర్పర్సన్ అభ్యర్థులదీ ఇదేబాట. ప్రచార ఖర్చు కు ఎన్నికల నిబంధనలు అడ్డు వస్తుండటంతో అభ్యర్థులు కొంత జంకుతున్నారు. ఎలాగైనా గెలవాలనే తపనతో మరికొం దరు ఖర్చుకు వెనకాడటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం, ఇతర ఖర్చులు పెట్టేస్తున్నారు. -
పుర నామినేషన్లకు తెర
సాక్షి, ఖమ్మం: పురపాలక నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లోని మొత్తం 97 వార్డులకు 925 నామినేషన్లు వేశారు. చివరి రోజు శుక్రవారం అన్ని పార్టీలు పోటాపోటీగా తమ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించాయి. అభ్యర్థులు పార్టీల తరఫున నామినేషన్ వేసి నా.. వారికి మాత్రం రెబెల్స్ బెడద తప్పలేదు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా తొలి రెండు రోజులు ఊపందుకోలేదు. పార్టీల మధ్య పొత్తులు కుదరకపోవడం, పలు పార్టీలకు అభ్యర్థులు దొరకక ఈ పరిస్థితి ఏర్పడింది. ఆతర్వాత పొత్తులు, ఒంటరి పోరు విషయంలో పార్టీలు అవగాహనకు రావడంతో చివరి మూడు రోజులు నామినేషన్లు జోరుగా పడ్డాయి. ఇక చివరి రోజు అన్ని పార్టీల నుంచి నామినేషన్లు హోరాహోరీగా దాఖలయ్యాయి. మొత్తంగా... సత్తుపల్లి 20 వార్డులకు 109 నామినేషన్లు, మధిరలో 20 వార్డులకు 115, కొత్తగూడెం మున్సిపాలిటీలో 33 వార్డులకు 307, ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు 394 నామినేషన్లు వేశారు. ఇల్లెందు మున్సిపాలిటీ వార్డులకు అత్యధికంగా నామినేషన్లు వచ్చాయి. మధిర నగర పంచాయ తీ చైర్మన్పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయిం ది. అన్ని పార్టీలు చైర్మన్ పీఠం దక్కించుకోవడ మే ధ్యేయంగా ఇక్కడ అభ్యర్థులను బరిలోకి దిం పాయి. పంచాయతీలోని 18వ (ఎస్సీ మహిళ) వార్డుకు అత్యధికంగా 13 నామినేషన్లు దాఖల య్యాయి. కొత్తగూడెంలో 4 వవార్డు (బీసీ జనర ల్)కు 18 నామినేషన్లు వేశారు. సత్తుపల్లిలో 20 వ (జనరల్) వార్డుకు 10 నామినేషన్లు వచ్చాయి. ఇల్లెందులో వైరివర్గాలు.. సత్తుపల్లి, కొత్తగూడెం, మధిర, ఇల్లెందులో వైఎస్సార్సీపీ.. సీపీఎం పొత్తుతో అభ్యర్థులను బరిలో నిలిపాయి. సత్తుపల్లి, మధిరలో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీలో ఉన్నాయి. కొత్తగూడెం, ఇల్లెందులో కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగానే బరిలో తమ అభ్యర్థులను నిలిపాయి. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటి వరకు టీడీపీకి ఒంటరి పోరు తప్పలేదు. ఇల్లెందులో మాత్రం 20 వార్డులకు కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 103 నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గాలు వేర్వేరుగా నామినేషన్లు వేయడంతో ఈ సంఖ్య పెరిగింది. ఒక పార్టీ అభ్యర్థులే వేర్వేరుగా నామినేషన్లు వేసి నువ్వానేనా.. అన్నట్లుగా తలపడుతున్నారు. అలాగే సీపీఎం (ఎంల్) న్యూడెమోక్రసీ చంద్రన్న, రాయలవర్గాలు వేర్వేరుగా నామినేషన్లు వేశాయి. అభ్యర్థులకు రె‘బెల్స్’.. బరిలో నిలవడానికి ఉత్సాహంగా నామినేషన్ వేసినా.. పార్టీ అభ్యర్థులకు మాత్రం రెబెల్స్ బెడద పట్టుకుంది. సుమారు 200మందికి పైగా స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. వీరిలో చాలా మంది పార్టీ తరఫున నిలబడే అవకాశం లేకపోవడంతో స్వతంత్రంగా బరిలో నిలవడానికి నామినేషన్ వేశారు. వీరితో విత్‌డ్రా చేసుకునేలా బుజ్జగించకుంటే తమకు ఓటమి తప్పదని.. నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ నేతల వద్ద మొర పెట్టుకుంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ పోటీతో పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పొందిన సంఘటనలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీల తరఫున బరిలో దిగిన అభ్యర్థులు రెబెల్స్‌ను బుజ్జగించే దారులు వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి అప్పుడే రాయ‘బేరాలు’కూడా మొదలయ్యాయి.