రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని జెడ్ స్పీడ్‌లో పరుగులు పెట్టిస్తున్నారు. మరో వైపు కీలకమైన కుల, యువజన సంఘాలపై నేతలు దృష్టి సారించారు. వారిని తమ వైపు తిప్పుకుంటే తమ గెలుపుకు తిరుగుండదని భావిస్తున్నారు. అవసరాలు తెలుసుకుని హామీలు గుప్పిస్తున్నారు. కొన్నింటిని అప్పటికప్పుడే నెరవేరుస్తున్నారు. అదే సమయంలో పక్క పార్టీలో అసంతృప్తులను తమ వైపునకు ఆకర్షించేలా మంతనాలు సాగిస్తున్నారు. జిల్లాలో హోరా హోరీగా సాగుతున్న ప్రచారం.. అభ్యర్థులు వ్యూహాలపై ప్రత్యేక కథనం..
జోగిపేట(అందోల్): ఎన్నికల వేళ ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థుల ప్రయత్నాలుఅన్నీ ఇన్నీ కావు. ఎన్నో ప్రయత్నాలతో టిక్కెట్లు సాధించుకున్నవారు వివిధ వర్గాల మద్దతుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. తెరాస అభ్యర్థులు ముందే ఖరారవడంతో వారు ఇప్పటికే వివిధ వర్గాల, సంఘాల మద్దతుకోసం చేయాల్సిన ప్రయత్నాలు చేశారు.. ఇప్పుడు విపక్ష పార్టీల అభ్యర్థుల వంతు వచ్చింది. ప్రజాకూటమి, భాజపా అభ్యర్థులను విడతలవారీగా ప్రకటించడంతో టిక్కెట్ ఖరారయిన మరుక్షణం నుంచి అభ్యర్థులు తమ విజయానికి అవసరమైన అన్ని వర్గాలు, మార్గాలపై దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని వర్గాలు.. సంఘాలతో సమావేశమైనవారు ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేసే ఎత్తులు వేయడంపై దృష్టి సారించారు. అభ్యర్థులు దృష్టిపెట్టిన వివిధ వర్గాలు.. మద్దతుకు చేస్తున్న ప్రయత్నాలు ఇవీ..
కుల సంఘాలుతో కలయికలు..
నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాలకు చెందిన సంఘాలతో అభ్యర్థులు సమావేశమవుతున్నారు. తనకు ఓటేస్తే వారి సంఘానికి చేసే లబ్ధిని వివరిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. కుల సంఘాల్లోని ‘కీ’లకమైన నేతల ఆర్థిక అవసరాలు తీరుస్తూ వారి సామాజికవర్గ ఓట్లు గంపగుత్తలా వచ్చేలా చూడాలని కోరుతున్నారు. కొందరు సంఘాల నాయకులను పార్టీల్లోకి ఆహ్వానిస్తూ మద్దతు కోరుతుండగా.. మరికొందరిని పార్టీలోకి రాకున్నా అంతర్గతంగా సహకారం అడుగుతున్నారు.
మహిళా సంఘాల మద్దతు కోసం ప్రయత్నాలు..
గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలది కీలకపాత్ర. గ్రామాల్లోనైతే దాదాపు ప్రతీ ఇంటి నుంచి మహిళలు సభ్యులుగా ఉంటున్నారు. అందుకే ఈ సంఘాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళా సంఘాలతో ఓ వైపు అభ్యర్థులు.. మరోవైపు ఆ పార్టీల నాయకులు సమావేశమవుతూ మద్దతు కోరుతున్నారు. గెలిస్తే సమావేశ భవనాలు నిర్మించడానికి నిధులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. అందులో కీలకంగా వ్యవహరించేవారికి ప్రాధాన్యం ఇస్తూ వారికి ప్రత్యేక హామీలు ఇస్తున్నారు.
యువజన సంఘాలకు సహాయాలు..
గ్రామాల్లో యువకుల మద్దతు ఉంటే ఆ సందడే వేరు. అందుకే అభ్యర్థులు యువజన సంఘాలపై దృష్టి పెట్టారు. వారి మద్దతు కోరుతూ వారికి క్రికెట్ కిట్లు తదితర ఆట పరికరాలు ఇస్తామని, మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో కొత్తగా యువజన సంఘాలు పుట్టుకొస్తున్నాయి. వీరైతే తాము వెంబడి తిరగాలంటే రోజుకింత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు, నాయకుల వెంట తిరుగుతున్నారు. తమ సంఘంలో ఇంతమంది ఉన్నారు, తమ మద్దతు కావాలంటే ఏమిస్తారో చెప్పాలని డబ్బు వసూలు చేసుకుంటున్నారు. ప్రచారంలో యువత ఉంటే సందడి ఉంటుందని భావిస్తున్న నాయకులు వీరి డిమాండ్లకు తలొగ్గుతున్నారు.
విద్యార్థి సంఘాలు..
ఈ ఎన్నికల్లో విద్యార్థి సంఘాలకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. సంఘాలను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. తెరాసకు వ్యతిరేకంగా ఉన్న సంఘాలను మచ్చిక చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వారిని పర్యటించే విధంగా చేయడంతో పాటు పత్రిక సమావేశాలు, యాత్రలు నిర్వహించేందుకు కూడా సహకారం అందిస్తున్నారు. కొన్ని విద్యార్థి సంఘాలు సైతం ఈ పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.
చేరికలపై దృష్టి
ఈసారి ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరడం ఎక్కువైంది. ఉదయం ఒక పార్టీలో ఉండి మధ్యాహ్నానికి మరో పార్టీలో చేరుతున్నవారూ ఉంటున్నారు. ఈ ఎన్నికల సందడి ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు వేలాది కొత్త కండువాలు మార్కెట్‌లోకి వచ్చి చేరాయి. గ్రామ స్థాయిలో పట్టు ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగా లేక సైలెంట్‌గా ఉన్న నాయకుల ఆర్థిక అవసరాలు తెలుసుకుని వారికి సాయం చేసి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయా గ్రామాలు, ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ముందు తమకు మద్దతీయమని కోరుతున్నారు.
మధ్యవర్తుల మచ్చిక..
ఈ ఎన్నికల్లో మధ్యవర్తుల హడావుడి ఎక్కువయింది. అభ్యర్థుల చుట్టూ వారే ఉండి ఓట్లను రాబట్టేందుకు ఉన్న మార్గాలను వారికి సూచిస్తున్నారు. అలాంటి వారిని అభ్యర్థులు ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అభిమానులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఎలా ఆలోచిస్తున్నారనే విషయాలను సేకరిస్తున్నారు. సంప్రదాయ ఓటర్లలో ఎంత శాతం ఇతర పార్టీ, ప్రత్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారనేది అంచనా వేస్తున్నారు. తటస్థ ఓటర్లు ఎక్కడ ఉన్నారు? వారి మనోభావాలు చివరి వరకు ఎలా ఉంటాయనే విషయాలు చెబుతున్నారు. వీరికి అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ తమకు అవసరమైన సమాచార సేకరణకు ప్రోత్సహిస్తున్నారు.
కాలనీ సంఘాలతో సమావేశాలు..
పట్టణాల్లో కాలనీ సంఘాలపై అభ్యర్థులు దృషి పెట్టారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు, అనుచరులు రాత్రి సమయాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారి మద్దతు కోరుతున్నారు. సంఘాల్లో కీలకంగా వ్యవహరించేవారికి రోజూ పారీ ్టలు ఏర్పాటు చేస్తూ కాలనీల్లో ప్రచారం చేయాలని కోరుతున్నా రు. పట్టణాల్లో చాలా కాలనీల్లో సంఘాల బాధ్యులకు ప్రతీ ఒక్కరూ తెలిసి ఉంటారని భావిస్తున్న నేతలు వారి మద్దతు దొరికితే ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని భావిస్తున్నారు.
వ్యాపార వర్గాలతో మమేకం..
వ్యాపార సంఘాలపైనా అభ్యర్థులు దృష్టి పెట్టారు. అభివృద్ధి కోణాలు వివరిస్తూ మద్దతు కోరుతున్నారు. ఆర్థిక అంశాలు ఈ సంఘాల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతో వారికి గతంలో చేసిన మేలు, ఈసారి ఎన్నికైతే చేసే లాభాన్ని వివరిస్తున్నారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామాని భరోసానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment