రెబల్స్ రగడ
కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థుల జాబితాపై నిరసనలు భగ్గుమన్నాయి. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. పలుచోట్ల స్వతంత్రంగా బరిలోకి దిగుతామని సవాల్ విసిరారు.
కంటోన్మెంట్ టికెట్ దక్కని డాక్టర్ శంకర్రావు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించారు
ఎల్బీనగర్ స్థానంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి హైదరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముద్దగోని రాంమోహన్గౌడ్ ఏర్పాట్లు చేసుకున్నారు
ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం నగరంలో భారీ సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు
ముషీరాబాద్ స్థానానికి తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి అంజయ్య సతీమణి, ఎమ్మెల్యే మణెమ్మ ఆక్షేపించారు. ఇందిరాగాంధీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆమె వెంట నడిచి అనేక కష్టాలు అనుభవించిన తమ కుటుంబానికి పార్టీ తీరని అన్యాయం చేసిందని వాపోయారు. కుటుంబంలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే యత్నాలు చేస్తున్నారు.
ఉప్పల్ సీటు దక్కని మాజీ మునిసిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాగిడి లక్ష్మారెడ్డి సైతం పోటీకి దిగి సవాల్ విసిరే యోచనలో ఉన్నారు. తమను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో అమీతుమీ తేల్చుకుంటామని ఇరువురు నేతలు ప్రకటించారు.