సెన్సెక్స్ @22,000
మరో కొత్త రికార్డు
వెలుగులో బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ చరిత్రలో సోమవారం తొలిసారిగా 22,000 స్థాయిని ఛేదించింది. అయితే ముగింపులో లాభాల స్వీకరణ కారణంగా ఆ స్థాయికి దిగువన 21,935 వద్ద ముగిసింది. ఇంత గరిష్టస్థాయిలో ముగియడం కూడా ఇదే ప్రథమం. ఈ సూచీ గత ఐదురోజుల్లో 988 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి కొత్త రికార్డుస్థాయి 6,537 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఆర్థిక గణాంకాలు బలహీనంగా వుండటం, ఉక్రెయిన్-రష్యా యుద్ధభయాలు కొనసాగడంతో ఆసియా మార్కెట్లు పతనమైనప్పటికీ, భారత్ సూచీలు రికార్డుస్థాయి వద్ద స్థిరపడటం విశేషం. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, రిఫైనరీ షేర్లు ర్యాలీ జరపగా, ఐటీ, ఫార్మా, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాల పట్ల ఇన్వెస్టర్లలో అనుకూల అంచనాలు ఏర్పడటంతో ఇతర ఆసియా మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్ పెరుగుతున్నదని విశ్లేషకులు చెపుతున్నారు.
రిలయన్స్ కౌంటర్లో షార్ట్ కవరింగ్...
స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో స్థిరపడటానికి కారణమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో భారీగా షార్ట్ కవరింగ్ జరిగింది. దాంతో హఠాత్తుగా స్పాట్ ధరతో పోలిస్తే ప్రీమియం పెరిగిపోయింది. క్రితం రోజు రెండు ధరలూ సమానంగా వుండగా, సోమవారం ఫ్యూచర్ రూ. 5 ప్రీమియంతో ముగిసింది. ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 4.58 లక్షల షేర్లు కట్కావడంతో మొత్తం ఓఐ 1.13 కోట్ల షేర్లకు దిగింది. రూ. 900 స్ట్రయిక్ వద్ద కాల్ బిల్డప్ జరగ్గా, రూ. 920 స్ట్రయిక్ వద్ద కాల్స్ కవర్ అయ్యాయి. రూ. 900 కాల్ ఆప్షన్లో బిల్డప్ 7.85 లక్షల షేర్లకు పెరగ్గా, రూ. 920 కాల్లో బిల్డప్ 3.31 లక్షల షేర్లకు తగ్గింది. రూ. 880, రూ. 860 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ ఫలితంగా ఈ రెండు ఆప్షన్లలోనూ బిల్డప్ వరుసగా 3.22 లక్షలు, 3.97 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో రిలయన్స్ షేరుకు రూ. 860-880 మధ్య మద్దతు లభించవచ్చని, రూ. 900 స్థాయిపైన ముగిస్తే మరింత ర్యాలీ జరపవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది.