అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
ముంబై: సోమవారం నాటి దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దాదాపు వంద పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే నాటికి 89.84 పాయింట్ల నష్టంతో, 27,746 వద్ద, నిఫ్టీ 32.70 పాయింట్ల నష్టంతో 8,508గా నమోదైంది. పార్లమెంటు సమావేశాలు, మాన్ సూన్ అంచనాల నేపథ్యంలో పాజిటివ్ నోట్ తో మొదలైన మార్కెట్లు.. ఆయిల్, గ్యాస్ స్టాక్స్ లో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. మెటల్, రియాల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ లు 0.6-1.3 శాతం మేర పతనమయ్యాయి.
ప్రాఫిట్ బుకింగ్స్ తో స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదుచేసినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బలహీనమైన క్యూ1 వాల్యుమ్ వృద్ధితో హెచ్ యుఎల్ షేర్లు 3శాతం పడిపోయాయి. అయితే హిందూస్తాన్ యునిలివర్ క్యూ1 లాభాలను రూ.1,174 కోట్లగా నమోదుచేసింది.
పసిడి పతనం
మరోవైపు పసిడి క్షీణత కొనసాగుతూ రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.30,550గా నమోదైంది. అదేవిధంగా సిల్వర్ ధర కూడా రూ.240 నష్టపోయి, కేజీ వెండి ధర రూ.46,260గా నమోదైంది. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ మార్కెట్ల నుంచి వెండికి డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 67.16గా ఉంది.