వైట్హౌస్ టైట్ ఫైట్ -మార్కెట్లు కుదేలు
వైట్ హౌస్ పగ్గాలకోసం అమెరికాలో హోరా హోరీ పోరు నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోరులో క్షణానికోసారి అంచనాలు తారుమారవుతున్నాయి. ఇప్పటివరకూ డొమెక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ ఆధిక్యంలో ఉండగా, తాజా సర్వేలో అనూహ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందుకు దూసుకు వచ్చారు. దాదాపు 1-2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల అమ్మకాలతో అమెరికా సహా ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి. వాల్ స్ట్రీట్ 4 నెలల కనిష్టం వద్దముగిసింది.
చైనా షాంఘై o.6శాతం ఆసియా పసిఫిక్ 0. 4 శాతం, జపాన్ నిక్కి 1.1 శాతం నష్టపోయింది. అలాగే ఆరంభంలోనే భారీ నష్టాలను నమోదు చేసిన దేశీయ స్టాక్మార్కెట్లలో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లు పైగా పతనమయ్యాయి. ముఖ్యంగా పీఎస్ యూ, ఆయిల్ అండ్ గ్యాస్,రియల్టీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ప్రభుత్వ బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఓన్ జీసీ, ఎస్ బీఐ, సన్ ఫార్మా, ఎం అడ్ ఎం లాంటి దిగ్గజాలు నేల చూపులు చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్ లో పీఎన్‌బీ, ఓబీసీ, బీవోఐ, కెనరా, ఐడీబీఐ, బీవోబీ, సిండికేట్, స్టేట్‌బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, యూనియన్, అలహాబాద్ బ్యాంక్ 4-3 శాతం మధ్య క్షీణించాయి.
మరోవైపు ప్రయివేట్ బ్యాంకు షేర్లలోనూ ఫెడరల్, యస్ బ్యాంక్, కరూర్ వైశ్యా, ఐసీఐసీఐ, ఐడిఎఫ్‌సీ, యాక్సిస్ తదితర షేర్లలోనూ ఇదే ధోరణి నెలకొంది. అటు ఫెడ్ అంచనాలతోడాలర్ బలహీనత కొనసాగుతుండగా, ఇటు దేశీయ కరెన్సీ 7 పైస లనష్టంతో 66.79 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు మాత్రం ఒక నెల గరిష్టాన్నినమోదు చేశాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 200 రూపాయల లాభంతో రూ. 30485 వద్ద బలంగా ఉంది.