ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..
సాక్షి, నిడమనూరు(నాగార్జునసాగర్)/సదాశివనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో నిడమనూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. నిడమనూరు మాజీ సర్పంచ్ విరిగినేని అంజయ్య చెల్లెలు నంబూరి రమాదేవి(రమణ) కూతురు, అల్లుడు దగ్గర హైదరాబాద్‌లో ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున తమ కూతురు సునీత, కుమారుడు రఘురామ్, అల్లుడు రాకేష్‌లతో కలిసి మనవడు అభిషేక్‌కు అక్షరాభ్యాసం కోసం బాసరకు కారులో వెళ్తున్నారు.
కామారెడ్డి సమీపంలో కారు అదుపు తప్పి నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో రమాదేవి(50), ఆమె కూతురు సునీత(30), కుమారుడు రఘురామ్(28) అక్కడిక్కడే మృతి చెందాడు. ఆమె అల్లుడు రాకేష్, మనుమడు అభిరామ్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ అభిరామ్ మృతి చెందాడు. రమాదేవిని గుంటూరు జిల్లా కనిగిరికి చెందిన నంబూరి మణికి ఇచ్చి వివాహం జరిపించారు. తర్వాత వారు అక్కడ ఇల్లు అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో రవాణా రంగంలో వివిధ వ్యాపారాలు నిర్వహించేవారు. మణి మూడేళ్ల క్రితం మృతి చెందాడు.
భర్త మృతితో రమాదేవి కూతురు, అల్లుడు వద్ద హైదరాబాద్‌లో ఉంటున్నారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన వారి మృతదేహాలను విరిగినేని అంజయ్య, ఆయన సోదరుడు ఆదినారాయణలు తమ స్వగ్రామమైన నిడమనూరుకు తరలించారు. ఇటీవలనే వారి చిన్న సోదరుడు నర్సింహారావు ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం ఇంతలోనే ఇలా సోదరి కుటుంబం దూరం కావడం పట్ల వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మృతదేహాలను బుధవారం సాయంత్రం 7గంటలకు నిడమనూరుకు చేర్చారు. బాలుడు అభిరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం కోసం ఉంచారని, రాత్రి వరకు చేరుకోవచ్చని వారు తెలిపారు.
మిన్నంటిన రోదనలు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో బంధువుల రోదనలతో ప్రదేశం మిన్నంటింది. వారి రోదనలు చూసిన గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తుంటే అందరినీ తీసుకెళ్లావా సరస్వతమ్మ అంటూ బంధువులు రోదించారు. అక్కడ వరుసగా ఉన్న మృతదేహాలను చూసినవారు కన్నీటిని ఆపుకోలేకపోయారు.
మండల కేంద్రంలో మూడో కుటుంబం..ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ కారణాల వల్ల మృ త్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. నంబూరి రమాదేవి కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. మండల కేంద్రానికి చెందిన పాల్వాయి నారాయణ లలిత దంపతులు 15 సంవత్సరాల క్రితం ఇంటిలో నిద్రిస్తుండగా మిదె కూలి మృతి చెందారు. వారి ఇద్దరికీ ఒకే సారి అంత్యక్రియలు నిర్వహించారు. అది అప్పట్లో సంచలనంగా మారింది.
ఐదు సంవత్సరాల క్రితం వ్యవసాయశాఖలో పని చేసి రిటైర్ అయిన గుండెమెడ సంగీత రావు సతీ మణి స్వరాజ్యం వారి కుమారుడు, హోంగార్డుగా పని చేస్తున్న గుండెమెడ బా బ్జీలు ఒక్క రోజు తేడాతో అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతదేహా లను పక్కపక్కనే పెట్టి తర్వాత ఒకే సారి అంత్యక్రియలు చేశారు. రమాదేవి కటుంబం మాదిరిగానే ఒకే కుటుంబానికి చెందిన వారు గతంలో మృతి చెందిన సంఘటనలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.
సాక్షి, సదాశివనగర్: హైదరాబాద్‌లోని వనస్థలిపురం హైకోర్టు కాలనీకి చెందిన నాగాల సునీత(31), రాకేష్‌లకు రెండున్నరేళ్ల కుమారుడు నాగాల అభిరాం ఉన్నాడు. రాకేశ్ స్వస్థలం గుంటూరు కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు.
సునీత రాకేష్ దంపతులు తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకుని, గురువారం తెల్లవారుజామున మిర్యాలగూడకు చెందిన అత్త నంబూరి రమాదేవి (50), బావమరిది నంబూరి రఘురాం (33)లతో రాకేష్ కుటుంబం కారులో నిర్మల్ జిల్లాలోని బాసరకు బయలుదేరింది. రఘురాం కారు నడిపిస్తున్నారు. వీరి వాహనం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామశివారు ప్రాంతానికి రాగానే డ్రైవింగ్ చేస్తున్న రఘురామ్‌కు నిద్ర ముంచుకువచ్చింది.
దీంతో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలివైపు రహదారిపైకి వెళ్లింది. అదే సమయంలో నిజామాబాద్ వైపునుంచి కామారెడ్డి వైపు ఎరువుల లోడ్‌తో వెళ్తున్న లారీ కిందకు వీరి కారు దూసుకెళ్లింది. కారు వేగానికి లారీ డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి.
మంటలతోనే 50 మీటర్ల దూరం వరకు వెళ్లి లారీ ఆగిపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. దీంతో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈప్రమాదంలో నంబూరి రమాదేవి కారులో నుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికి లారీ కింద ఇరుక్కుపోవడంతో నంబూరి రఘురాం, నాగాల సునీత తలలు పగిలి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
తీవ్రంగా గాయపడిన రాకేష్ ఆయన కుమారుడు అభిరాంలను గ్రేహౌండ్స్ పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌లో హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అభిరాం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై నరేశ్ తెలిపారు.
కొంపముంచిన నిద్రమత్తు!
ఈ ప్రమాదంలో వేగంతో ఉన్న కారు ముందు టైర్ రోడ్డు డివైడర్ ఎక్కగానే గమనించి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు. కారు డ్రైవర్ డివైడర్ ఎక్కిన విషయాన్ని గమనించకపోవడానికి నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు.