పద్మ, స్వప్న, నిత్య అభిరాం (ఫైల్)
హైదరాబాద్: అతివేగం మూడు ప్రాణాలను బలితీసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట బతుకమ్మకుంట ప్రాంతానికి చెందిన పసుమాముల హరికృష్ణ.. తండ్రి శంకర్, తల్లి పద్మ(48), చిన్నమ్మ స్వప్న(35), ఆమె కుమారుడు నిత్య అభిరాం(8), కూతురు రిత్వికలతో కలసి కారులో కొత్తగూడెంలో బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు.
ఆదివారం రాత్రి వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి బయలుదేరారు. సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కొత్తగూడెం కూడలి వద్ద రోడ్డు మలుపు తిరుగుతుండగా చౌటుప్పల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న పద్మ, స్వప్న, నిత్య అభిరాం అక్కడికక్కడే మృతిచెందారు. హరికృష్ణ, శంకర్, రిత్వికకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చాలాసేపు ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు సీఐ ముని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment