'నా ఎదుటే మా అమ్మాయిపై దాడికి దిగాడు'
* నోట్స్ విషయంలో..
* విద్యార్థినికి ఫిట్స్.. ఆస్పత్రికి తరలింపు
ఆత్మకూరు/ఎంజీఎం: వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఒగ్లాపూర్‌లోని కేర్ ఫార్మసీ కళాశాల లో సోమవారం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కళాశాలలో ఖమ్మం జిల్లాకు చెందిన కాసర్ల వేదశ్రీ హన్మకొండలో తల్లితో ఉంటూ ఫార్మాడీ మూడో సంవత్సరం చదువుతోంది. మనీషా, దొంతి వంశీకృష్ణ కూడా నగరంలో ఉంటూ ఇదే కళాశాలలో చదువుతున్నారు. మూడురోజుల క్రితం వేదశ్రీ, మనీషాకు నోట్స్ విషయంలో గొడవ జరిగింది.
ఈ విషయంలో మనీషాకు వంశీకృష్ణ మద్దతు పలికి వేదశ్రీతో గొడవపడ్డాడు. ఈ విషయం పెద్దల వరకు చేరడంతో ఇరువర్గాల తల్లిదండ్రులు సోమవారం కళాశాలకు వచ్చారు. వేదశ్రీ తల్లి, వంశీకృష్ణ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వేదశ్రీపై వంశీకృష్ణ చేయి చేసుకోవడంతో ఆమెకు ఫిట్స్ వచ్చి పడిపోయింది. దీంతో ఆమెను కళాశాల వాహనంలో ఎంజీఎంకు తరలించారు. నోట్స్ విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన విషయం వాస్తవమేనని కళాశాల ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. ఏసీపీ జనార్దన్‌రెడ్డి, సీఐ మదన్‌లాల్ వేదశ్రీ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అయితే, ఈ ఘటనపై వేదశ్రీ కుటుంబసభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
గొంతు నులిమి దాడికి పాల్పడ్డాడు...
‘మా అమ్మాయి వేదశ్రీని.. వంశీ అనే అబ్బాయి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కళాశాలకు వచ్చాం. వంశీకి మరో అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇందులో మా అమ్మాయిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా ఎదుటే మా అమ్మాయిపై వంశీ దాడికి దిగాడు. గొంతునులిమి తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగాడు. వెంటనే మా అమ్మాయిని ఎంజీఎంకు తీసుకువచ్చాం.’ అని వేదశ్రీ తల్లి విలేకరులకు తెలిపారు.