వెస్టిండీస్ ‘ఎ’కు ఆధిక్యం
షిమోగా: భారత్ ‘ఎ’తో టెస్టు సిరీస్లో తన ఆధిపత్యాన్ని వెస్టిండీస్ ‘ఎ’ మరోసారి నిరూపించుకుంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన కరీబియన్ జట్టు... రెండో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. తొలుత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 406 పరుగులు చేయగా... భారత్ ‘ఎ’ 131.1 ఓవర్లలో 359 పరుగులకు ఆలౌటయింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ జగదీశ్ (86), నాయర్ (89) ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయారు.
భారత్ జట్టు 245 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో... వికెట్ కీపర్ ఉదయ్ కౌల్ (172 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) చివరి వరుస ఆటగాళ్లతో కలిసి పోరాడి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. విండీస్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో పర్యాటక జట్టుకు 47 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టుకు మొత్తం 75 పరుగుల ఆధిక్యం ఉంది. శనివారం ఆటకు చివరి రోజు కాబట్టి అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయం.