ఆ వాడలో ఎదురుచూపులు...
జీవిత చిత్రం
‘వారం రోజులైంది. ఒక్క మగాడు రావడం లేదు’ అంది ఢిల్లీ జి.బి.రోడ్‌లోని ఒక సెక్స్ వర్కర్. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నిజమే కాని ఆ చర్య ఫలితంగా ఊహించని శిబిరాలు పడుతున్న ఇక్కట్లు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు వల్ల ‘క్యాష్ అండ్ క్యారీ’ పద్ధతిలో నడిచే సెక్స్‌వర్కర్ల లావాదేవీలు గత వారం రోజులుగా పూర్తిగా కుదేలయ్యాయని తెలుస్తోంది.
‘అప్పటికీ మేం పాత నోట్లు తీసుకుంటాం అనే అంటున్నాం. కాని మగాళ్లు రావడం లేదు. వాళ్లు అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుక్కునే పనిలో ఉన్నారు. లేదంటే క్యూలలో ఉన్నారు. డబ్బు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరు’ అని మరొక సెక్స్ వర్కర్ అంది. పెద్ద నోట్లు రద్దయిన వెంటనే అందరు వ్యాపారులకు మల్లే ఢిల్లీలోని సెక్స్ వర్కర్లు కూడా పాత నోట్లను తీసుకోము అని ప్రకటించారు. అయితే ఒకటి రెండు రోజుల్లోనే ఇది జరిగే పని కాదని గ్రహించారు. కొత్త నోట్లు ఎవరి దగ్గరా లేవు కనుక పాత నోట్లు తీసుకొని తర్వాత ఏదో విధంగా చెల్లుబాటు చేసుకుందామని భావించారు. కాని ఢిల్లీ పురుషులు మాత్రం ఎంతమాత్రమూ ఈ కాలక్షేపం కోసం తమ సమయాన్ని డబ్బును వెచ్చించే స్థితిలో లేరు.
‘ఢిల్లీలోని కోఠాల్లో దాదాపు 5000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరంతా బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారు. ఎవరికీ ఆధార్ కార్డులు కాని, బ్యాంక్ అకౌంట్లు కాని లేవు. వచ్చిన డబ్బు పెట్టెల్లో దాచుకోవడమే తెలుసు. మా దగ్గర ఉన్న పాత నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియదు. ఆ నష్టం ఒకటైతే వారం రోజులుగా ఎదుర్కొంటున్న నష్టం మా జీవితాన్ని దెబ్బ తీసింది’ అని మరో సెక్స్ వర్కర్ అంది.
ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాలో ఒక్కో సెక్స్‌వర్కర్ సగటున వెయ్యి రెండు వేలు సంపాదిస్తుందని అంచనా. ఆ ఆదాయం ఇప్పుడు పూర్తిగా పోయింది. కాగా ఢిల్లో జోరుగా నడిచే ఎస్కార్ట్ గర్ల్స్ రంగం కూడా అరవై నుంచి 80 శాతం పతనం అయ్యింది. ‘అప్పటికీ మేం రేట్లు తగ్గించాం. ఎవరూ మా మొహం చూడటం లేదు’ అని ఒక ఏజెంట్ అన్నాడు. 5000 రూపాయలకు ఏ సర్వీసులు ఇచ్చేవారమో ఇప్పుడు 3500 రూపాయలకు ఆ సర్వీసులే ఇస్తున్నాము. కాని లాభం లేదు’ అని అతడు అన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆన్లైన్ ద్వారా వీరికి చెల్లింపు జరిపే వీలున్నా ఎవరూ ప్రస్తుతం ఈ ‘ఆహ్లాదసేవల’ను పొందే మూడ్‌లో లేరు. పెద్దనోట్ల రద్దు వల్ల ఈ వృత్తికి దెబ్బ ఏర్పడి అంతరించిపోతే అంతకు మించి కావల్సిందేముంది? అయితే వీరికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించే పనులు చేయాలి... వీరిని ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఊబి నుంచి బయట పడేయాలి.