Cash-for-votes scandal
-
ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు సండ్ర
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరయ్య హాజరును నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది. మరోవైపు పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే న్యాయవాదులు విధులు బహిష్కరించిన నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు రేవంత్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతించింది. -
'స్టేలతో కాలం గడుపుతున్న చంద్రబాబు'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్కే శుక్రవారం నిప్పులు చెరిగారు. ఆయన స్టేలతో కాలం గడుపుతున్నారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో ఆయన స్టే తెచ్చున్నారని గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులోనూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే... 4 వారాల్లో తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చుకున్నారని చంద్రబాబును ఆర్కే సూటిగా ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్హాండెడ్గా దొరికిపోయారన్నారు. బ్లాక్మనీతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ఆడియో టేపుల్లోని వాయిస్ ముమ్మాటికీ చంద్రబాబుదే అని ఆర్కే స్పష్టం చేశారు. అది తన వాయిస్ కాదని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.