పొట్టనింపని కులవృత్తి
కనుమరుగవుతున్న కంసాలీలు
ప్రత్యామ్నాయ వృత్తులపై దృష్టి
రామచంద్రాపురం: మండలంలో కులవృత్తులు నమ్ముకుని జీవించే కంసాలి కులస్తుల పరిస్థితి దుర్భరంగా మారి కనుమరుగయ్యే ప్రమాదంలోకి వచ్చింది. మండలంలో అనుప్పల్లి, నెత్తకుప్పం, సీకేపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలలో కంసాలి(విశ్వబ్రాహ్మణ) కులస్తులు కుల వృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. గతంలో వ్యవసాయం మెండుగా రైతులు సాగిస్తూ వ్యవసాయ పనిముట్లను తాయు చేస్తే అందుకు ప్రతిఫలంగా పంట దిగుబడి సమయంలో కంసాలీలకు వేరుగా వరిధాన్యం ఇచ్చేవారు. దీంతో ఆ కుటుంబం జీవనం సాగిస్తూ వుండేది. రాను రాను కులవృత్తుల ఆదరణ తగ్గడం, సంప్రదాయ వ్యవసాయ పనిముట్లకు గిరాకీ తగ్గడంతో వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గడ్డపారలు, పారలు, తొలికలు, మడకలు (మరక), చెక్క, వలంత, గొర్ర, బెల్లం పెనుములు వంటివి తయారు చేసేవారు. కానీ నేడు ఇవన్నీ పరిశ్రమల నుంచే రెడీమేడ్‌గా మార్కెల్లో లభిస్తుండడం వల్ల కంసాలి వృత్తులు కనుమరుగవుతున్నాయి. దీంతో కంసాలులు ప్రత్యామ్నాయ వృత్తులపై దృష్టిసారిస్తున్నారు. కులవృత్తే కూడుపెడుతాయనుకున్న వృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం కులవృత్తులవారిని ఆదరించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కంసాలి కులస్తులు కోరుతున్నారు.
కులవృత్తులకు ఆదరణ కరువు
గతంలో కులవృత్తులకు మంచి ఆదరణ ఉండేది. కులవృత్తులే కూడు పెట్టేవి. అలాంటి కులవృత్తులకు ఆదరణ లేక కనుమరుగువుతున్నాయి. కుల వృత్తులకు పనులు లేక తినడానికి తిండి కూడా కరువుగా వుంది. ప్రభుత్వం కులవృత్తులనుఆదుకోవాలి. -దొరస్వామి ఆచారి, సీకేపల్లి
ప్రత్యామ్నాయ పనులు చేస్తున్నాం
కులవృత్తులకు చేతినిండా పనులు లేక కుటుంబాన్ని పోషించ లేక ప్రత్యామ్నాయం పనులు చేసుకుంటున్నారు. కులవృత్తులను నమ్ముకుంటే కడుపు నిండదు. ఆక లితో అలమటించాల్సి వస్తోంది. ప్రభుత్వాలు ఆదుకోవాలి.
- వెంకటశివాచారి, సీకేపల్లి