
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. ఈ మేరకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం పంపిణీ శనివారం (ఈ నెల 15వ తేదీ) నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
తొలివిడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 300 మందికి సాయాన్ని అందిస్తామని, ఈ ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. మంత్రి గురువారం తన చాంబర్ నుంచి జిల్లా కలెక్టర్లతో బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్హులైన బీసీ కులవృత్తిదారులకు సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సంబంధిత ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆర్థిక సాయం పంపిణీ చేపట్టాలని.. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులంతా హాజరయ్యేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. లబ్ధిదారులు ఆర్థిక సాయం అందుకున్న వెంటనే కులవృత్తులకు సంబంధించిన యూనిట్‌ను గ్రౌండింగ్ చేయాలని, ఇందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కాగా.. బీసీ కులవృత్తుల వారికి ఆర్థికసాయం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28లక్షల దరఖాస్తులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వాటి పరిశీలన పూర్తయిన వెంటనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని.. ఈ సొమ్ముతో కులవృత్తికి సంబంధించిన ముడిసరుకులు, పనిముట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment