కమ్మర్‌పల్లిలో కలెక్టర్ హల్చల్
కమ్మర్పల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంతో పాటు చౌట్పల్లి గ్రామాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హల్చల్ చేశారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ నీటి బిందు సేద్యం యంత్రాల పరిశీలన, ప్రయోజనాలు, స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమ్మర్పల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వరినాటు యంత్రాన్ని పరిశీలించి, పొందుతున్న ప్రయోజనాలను సంబంధిత రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్ని వరినాటు యంత్రాలు అందించారని జేడీఏ మధుసూదన్‌ను అడుగగా, 14 వరికోత యంత్రాలు అందించామన్నారు.
అనంతరం గ్రామంలో పసుపు ఉడకబెట్టే యంత్రాన్ని పరిశీలించి, సంబంధిత రైతులతో మాట్లాడారు. పసుపు పంట పరిశీలించి, పండిస్తున్న రకాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. చౌట్పల్లిలో వ్యవసాయ క్షేత్రాల్లో సూక్ష్మ బిందునీటి సేద్యం (డ్రిప్ ఇరిగేషన్)ను పరిశీలించారు. సబ్సిడీ, ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సమయం, నీటి వినియోగం విద్యుత్ ఆదాలపై రైతులతో చర్చించారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో నిర్మించిన మురికి కాలువను పరిశీలించారు. దానికి సంబంధించిన వ్యయం, అంచనా విలువలను పీఆర్ఏఈ ఇసాక్ అలీని అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజనం తనిఖీ...
చౌట్పల్లి భాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్నం భోజనం పథకాన్ని తనిఖీ చేశారు. మెనూను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి భోజన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూలో సూ చించిన విధంగా ఆకు కూరలు, కూరగాయలను వండక పోవడంపై ప్రధానోపాధ్యాయుడు అంజాత్ సుల్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటకాలను పరిశీలించి, అన్నం తిని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి ఆర్డీఓ శివలింగయ్య, తహశీల్దార్ పుష్ప, ఎం పీడీఓ రాజేశ్వర్, ఏపీఓ సురేష్‌కుమార్, ఐకేపీ ఏపీఎం గంగాధర్ ఉన్నారు.