ఈ విషయం తెలుసా? ఈ సాలీడు కుడితే.. ఇక అంతే!
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజు గూడు అల్లుకునే మామూలు సాలెపురుగే అనుకుంటే పొరపాటే! ఇది కుట్టిందంటే, ఇక అంతే సంగతులు! ‘సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్’ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లల్లోకి కూడా చేరుతుంటాయి.ఈ సాలెపురుగు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదొక అరుదైన విశేషం.ఒళ్లంతా ముళ్లున్న స్టార్ఫిష్..సముద్రంలో స్టార్ఫిష్లు అరుదుగా కనిపిస్తాయి. స్టార్ఫిష్లలో మరీ అరుదైనది ఈ ముళ్ల స్టార్ఫిష్. ఇది సముద్రం లోలోతుల్లో ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల దీనిని ‘క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్ఫిష్’ అని అంటారు.ఈ ముళ్ల స్టార్ఫిష్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు, గోధుమ రంగు, బూడిద రంగుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతుకుతాయి. పర్యావరణ మార్పుల వల్ల పగడపు దిబ్బలు రంగు వెలిసిపోతుండటం, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో ఈ ముళ్ల స్టార్ఫిష్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగడపు దిబ్బలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే, ఈ ముళ్ల స్టార్ఫిష్ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.అత్యంత పురాతన గుహాచిత్రాలు..ప్రపంచంలో పురాతన మానవులు సంచరించిన ప్రదేశాల్లో పలుచోట్ల ఆనాటి మానవులు చిత్రించిన గుహాచిత్రాలు బయటపడ్డాయి. సహస్రాబ్దాల నాటి గుహాచిత్రాలు పురాతన మానవుల ఆదిమ కళా నైపుణ్యానికి అద్దంపడతాయి. ఇటీవల ఇండోనేసియాలోని సూలవేసీ దీవిలో అత్యంత పురాతన గుహాచిత్రాలు బయటపడ్డాయి. ఈ దీవిలోని మారోస్ పాంగ్కెప్ ప్రాంతానికి చెందిన లీంగ్ కరాంపాంగ్ సున్నపురాతి గుహల్లో ఈ పురాతన చిత్రాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వీటిలో ఎర్రరంగుతో చిత్రించిన మూడడుగుల పంది బొమ్మ, చిన్న పరిమాణంలో నిలబడి ఉన్న భంగిమలో మూడు వేటగాళ్ల బొమ్మలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ గుహాచిత్రాలపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. గుహ లోపలి భాగంలో ఒకే రాతిపై వరుసగా చిత్రించిన ఈ బొమ్మలను కార్బన్ డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షించి, ఇవి కనీసం 51,200 ఏళ్ల కిందటివని అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన గుహా చిత్రాలలో ఇవే అత్యంత పురాతనమైన గుహా చిత్రాలని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాక్సిమ్ ఆబర్ట్ వెల్లడించారు.