మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును చాలా సీరియస్ గా పరిగణించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ నమోదైన రెండోరోజునే సీబీఐ ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది.
మహిళలపై అమానుష వైఖరిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈ కేసును సీబీఐకు అప్పగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసు సీబీఐకి అప్పగించి నిర్ణీత గడువులో విచారణ పూర్తయ్యేలా చూడాలని కోరింది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.
శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సిన ఉండగా ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా ట్రయల్ సాధ్యపడలేదు. అంతకుముందు జులై 20న జస్టిస్ చంద్ర చూడ్, పీఎస్ నారసింహ, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సంఘటన విచారణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు పురోగతి సాధించాయన్న దానిపై వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రోద్బలంతో సిబిఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం కేసు విచారణలో ప్రాధాన్యత సంతరించుకుంది.
Central Bureau of Investigation registers FIR in Manipur viral video case: CBI official pic.twitter.com/a1WdwYydyF
— ANI (@ANI) July 29, 2023
మణిపూర్ అల్లర్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తాలూకు వీడియో క్షణాల వ్యవధిలో అంతర్జాల మాధ్యమంలో దావానలంలా వ్యాపించి దేశమంతా కార్చిచ్చు రగిలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి ఉక్కిరిబిక్కిరి కావడంతో ఈ కేసును సీబిఐకి బదలాయించడం హర్షణీయం. ఈ కేసులో ఇప్పటికే మణిపూర్ పోలీస్ శాఖ ఏడుగురిని అరెస్టు చేసి రేప్, మర్డర్ అభియోగాయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..