ccs officers
-
ఉంగరాలూ మింగేశారు!
► ఓ హోటల్ వద్ద న్యాయవాది కారు చోరీ ► నెల తరువాత దొరికిన వాహనం ► ఆభరణాలు మాయం ► పోలీసుల మాయాజాలం సాక్షి, సిటీబ్యూరో : నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారుల అక్రమాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సీజ్ చేసిన కార్లను పంచుకోవడం... కోర్టు అనుమతి లేకుండానే అమ్ముకోవడం... చీటింగ్ కేసులో 16 మంది నిందితుల పేర్లు గోల్మాల్ చేయడం లాంటి ఉదంతాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అక్రమ వ్యవహారం బయట పడింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని దసపల్లా హోటల్లో చోరీకి గురైన బీఎండబ్ల్యూ కారులో ఉన్న న్యాయవాదికి చెందిన మూడు వజ్రపుటుంగరాలను సీసీఎస్ ఆటోమొబైల్ టీం పోలీసులు మింగేసినట్టు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలుగా తెలుస్తోంది. ఆ న్యాయవాది నెల రోజుల పాటు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవల సీసీఎస్ పోలీసుల బాగోతాలు వరుసగా తెరపైకి వస్తుండడంతో ఉంగరాలు కాజేసిన ఉదంతంపై కూడా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివీ... గత ఏడాది నవంబర్ 29న బాగ్ అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది దిండకుర్తి నారాయణ కిషోర్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లారు. తన బీఎండబ్ల్యూ కారు (ఏపీ 10 టీజే టీఆర్ 6384)ను వాలెట్ పార్కింగ్‌లో అప్పగించి వెళ్లగా... తిరిగి వచ్చేసరికి అపహరణకు గురైంది. ఈ విషయమై అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో మూడు వజ్రాలు పొదిగిన ఉంగ రాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... బంజారాహిల్స్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతూ జల్సాలకు అలవాటు పడిన తిరువీధుల సుమన్ అనే యువకుడు కారును త స్కరించినట్లు గుర్తించారు. ఈ కేసును అప్పటికే సీసీఎస్‌లోని ఆటోమొబైల్ టీంకు అప్పగించారు. వారు సుమన్‌ను అదుపులోకి తీసుకొని వివరాలు రాబట్టారు. సీసీఎస్ ఆటో మొబైల్ విభాగం సీఐ ప్రసాద్ కారును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హోంగార్డుగా నమ్మించి ప్రైవేట్ డ్రైవర్‌తో వాహనాన్ని తరలించారు. కారులో ఉన్న మూడు ఉంగరాలను నొక్కేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దాంతో ప్రైవేట్ డ్రైవర్, బన్ను ప్రమోద్ మరుసటి రోజు నుంచి పరారైనట్టు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా అక్రమాలు బయట పడ డ ంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాయమైన ఉంగరాల వ్యవహారంపై సీసీఎస్ పోలీసులను విచారిస్తున్నారు. కనిపించడం లేదన్నారు... చోరీ కేసులో దొరికిన కారును ప్రైవేటు డ్రైవర్ ప్రమోద్‌తో ఎలా తెప్పించారని న్యాయవాది నారాయణ కిషోర్ ప్రశ్నించారు. తన కారు డిక్కీలో ఉన్న వజ్రాల ఉంగరాలను ప్రమోద్ తీశాడని... అతన్ని ఆ రోజే పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడని తెలిపారు. ఉంగరాలు ఇప్పించాలని సీఐ ప్రసాద్‌ను వేడుకుంటే... ఇప్పిస్తానని చెప్పారని... చివరకు అతను కనిపించడం లేదని సమాధానమిచ్చారని న్యాయవాది ‘సాక్షి’కి తెలిపారు. ప్రసాద్‌ను గానీ, ప్రమోద్ను గానీ అదుపులోకి తీసుకుని విచారిస్తే తన ఉంగరాలు దొరకుతాయని భావిస్తున్నారు. విమానాల్లో చక్కర్లు... స్టార్ హోటళ్లలో విందు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బన్ను ప్రమోద్ను సీఐ ప్రసాద్ తన కారుకు ప్రయివేటు డ్రైవర్‌గా పెట్టుకున్నారు. సీసీఎస్‌లో మాత్రం అందరూ అతనిని హోంగార్డుగా పరిగణించారు. విమానాల్లో ప్రయాణాలు... స్టార్ హోటళ్లలో విందులు...ఇదీ ప్రమోద్ వ్యవహార శైలి. అతనికి నెలకు రూ.10 వేలు మాత్రమే జీతంగా వచ్చేది. ఈ వేతనంతో విమాన ప్రయాణాలు... స్టార్ హోటళ్లలో భోజనాలు సాధ్యం కాదనేది తెలిసిందే. మరి విలాసాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. పరారీలో ఉన్న ప్రమోద్ను పట్టుకుంటే సీసీఎస్ అధికారుల అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. -
‘వేధింపుల కేసుల్లో’వేరే కోణం!
వేరు కుంపటి కోసం వేధింపుల పేరు... వరకట్న వేధింపుల కేసు పేరు చెప్తే చాలు పెళ్లైన మగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. భార్య ఫిర్యాదు చేస్తే చాలు... తనతో పాటు తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు కూడా కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని పలువురు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది నలిగిపోతున్నారని పోలీసులే అంటున్నారు.ఎగువ మధ్య తరగతి కుటుం బాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అనేకం బోగస్‌వి ఉంటున్నాయంటున్నారు. అత్తమామలతో కలి సి ఉండటం ఇష్టం లేక, వేరే కాపురం కావాలం టూ పలువురు తమను ఆశ్రయిస్తున్నారని సీసీఎస్ అధికారులు చెప్తున్నారు. ఫిర్యాదులో మాత్రం వరకట్న వేధింపులని పేర్కొంటున్న వివాహితలు కౌన్సిలింగ్ వద్దకు వచ్చేసరికి భర్త వేరు కాపురం వస్తే చాలంటున్నారని తెలిపారు. ‘అమ్మతో పోల్చిచూడటంతో’ అనేక అపార్థాలు... ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం అనివార్యంగా మారింది. ఉద్యోగానికి వెళ్తుండంతో భార్యకు కొన్ని దైనందిన కార్యక్రమాలు నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఇక్కడే సదరు భర్తల అహం దెబ్బ తింటోందని అధికారులంటున్నారు. తన తల్లి తమ విషయం లో కనబరిచిన శ్రద్ధను భార్య తనతో పాటు పిల్లలపైనా చూపడంలేదన్న భావన భర్తల్లో కలిగి స్పర్థలకు కారణమవుతోందంటున్నారు. నాటి-నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందే ఉండదని.. అయితే ఆ కోణంలో ఆలోచించే భర్త లు తక్కువగా ఉంటున్నారంటున్నారు. ఈ అపార్థంతో మొదలయ్యే స్పర్థలు వేధింపుల కేసుల వర కు వెళ్తున్నాయి. ఓ మహిళకు రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ‘498-ఏ’ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం వల్ల అత్త, ఆడపడుచు, మరిది ... ఇలా మరికొందరు మహిళలు సామాజికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలోనే అనేక మంది భర్తతో పాటు ఆయన కుటుంబీకులపైనా... ఒక్కోసారి భర్తను వదిలేసి కుటుంబీకులపై కట్న వేధింపుల ఫిర్యాదులు చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. స నగరానికి చెందిన ఓ వివాహిత తన ఆడపడుచు కుమార్తె (రెండు నెలలు) తరచు ఏడుస్తుండటంతో తనకు మానసిక వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. స కెనడాలో ఉండే ఆడపడుచు తరచూ తన భర్తకు ఫోన్ చేస్తోందని, ఫోన్లో మాట్లాడిన తర్వాత భర్త తనపై చేయి చేసుకుంటున్నాడని మరో గృహిణి ఫిర్యాదు చేసింది. విదేశంలో ఉంటున్న ఆడపడుచుతో పాటు భర్త నిందితులుగా పేర్కొంది. స ఉద్యోగస్తులైన ఓ జంట మనస్పర్థల కారణంగా విడిపోవాలనుకుంది. కొన్నాళ్ల క్రితం పరస్పరం ‘ఎస్సెమ్మెస్‌లు’ ఇచ్చుకొని విడిపోయి.. ఎవరికి వారు జీవిస్తున్నారు. తనకు చెందిన ఓ నగ ‘మాజీ భర్త’ వద్ద ఉందని భావించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. స ఈ ముగ్గురు మహిళలను మించి మరో వివాహిత ఇంకో చిత్రమైన ఫిర్యాదు చేసిం ది. తనను ఇంట్లో వారితో పాటు పక్కింట్లో ఉండే వృద్ధుడూ వేధిస్తున్నాడని ఆరోపిం చింది. అతడిపై కేసు ఎలా నమోదు చేస్తామని పోలీసులు అడగ్గా.. ‘చనిపోయిన మా మామగారు దెయ్యమై పక్కింటాయన్ని ఆవహించి వేధిస్తున్నాడు’.. అని అంది. స నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని మహిళా ఠాణా అధికారులకు ఇటీవల అందిన ఈ ఫిర్యాదులు వారి దిమ్మ తిరి గేలా చేశాయి. 498-ఏగా పిలిచే వరకట్న వేధింపుల కేసుల్లో వేరే కోణాన్ని ఆవిష్కరించడానికి ఈ ఉదాహరణలు చాలు.