చెల్లింపు వార్తల్ని నేరంగా చూడాలి
న్యాయశాఖను కోరాం: సీఈసీ సంపత్
ఎన్నికల సంస్కరణలకు చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్య
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నందున చెల్లింపు వార్తల(పెయిడ్ న్యూస్)ను నేరంగా పరిగణించాలని కేంద్ర న్యాయశాఖను కోరినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. పెయిడ్ న్యూస్ ప్రభావం.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, మీడియా, ప్రజలపైన తీవ్రంగా ఉంటోందని చెప్పారు. శనివారమిక్కడ ‘ఎన్నికల్లో సంస్కరణలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘సంస్కరణల దిశగా చేయాల్సింది చాలా ఉంది. నేరమయ రాజకీయాలు లేకుండా చూడడం, రాజకీయ పార్టీల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం, పార్టీ నిధుల ఆడిటింగ్ తదిత రాలపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మార్పు తీసుకురావడానికి ఉద్దేశించిన చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. నేర చరితులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడానికి చట్టప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కసారిగా మార్పులు జరిగిపోవాలని ఆశించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
రాజకీయ పార్టీలకు నియమావళిపై మాట్లాడుతూ... ఎన్నికల తేదీలు ప్రకటించడానికి కొద్దిరోజుల ముందు ప్రభుత్వాలు తమ హయాంలో సాధించిన విజయాలపై ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలన్నారు. అయితే ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, వినియోగదారుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ప్రకటనలకు మినహాయింపు ఉంటుందన్నారు. ఓటు వేయడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేసే అవకాశాలను సంపత్ తోసిపుచ్చారు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 30 కోట్ల మంది ఓటు వేయలేదని, ఒకవేళ ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తే వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికలపై ప్రశ్నించగా.. ప్రస్తుత లోక్సభ కాలపరిమితి మే 31 నాటికి ముగుస్తుందని, ఆలోపు ఎన్నికలను నిర్వహిస్తామని వివరించారు.