చాలా ఎంజాయ్ చేశాం..
బాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది ఆదివారం రక్షాబంధన్‌ను ఆనందంగా జరుపుకున్నారు. తమ సోదరులు ఇంటివద్ద అందుబాటులోనే ఉండటంతో రాఖీ పండుగను ఆనందంగా గడపగలిగామని బిపాసాబసు, రిచా చద్దా వంటి హీరోయిన్లు చెప్పారు. రాఖీ పండుగను ఇంకా కొంద రు హీరోయిన్లు ఎలా జరుపుకున్నారో.. వారి మాటల్లోనే..
తాప్సీ పన్నూ: నాకు సొంత అన్నదమ్ములు లేకపోవడంతో చిన్నప్పటినుంచీ మా పెదనాన్న కొడుకులు తాజిందర్, తన్వీర్,ఉదయ్వీర్లకే రాఖీ కడుతున్నా. ఒకప్పుడు రాఖీ పండుగనాడు వారికి దూరంగా ఉంటే రాఖీతోపాటు చాక్లెట్ పంపించేదాన్ని.. ఇప్పుడు మాత్రం బహుమతి వసూలు చేస్తున్నా..
మందిరాబేడీ: నా దురదృష్టం ఏంటంటే చిన్నప్పటినుంచీ నేను, నా సోదరుడు రాఖీ బంధన్‌నాడు ఎప్పుడూ ఒకే దేశంలో ఉండలేదు. అందుకే కొరియర్ చేస్తా.. దాంతోపాటు మా అన్నకు ఇష్టమైన స్వీట్లు చేసిపెట్టమని ఒదినకు లేఖ కూడా రాస్తా.
కృతి సనూన్: నాకు సొంత అన్నదమ్ములు లేరు. అందుకే నా చెల్లికే ప్రతి యేటా రాఖీ కడతాను. ఈ ఏడాది మేము వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాం. ఆమె నాకు రాఖీ పంపించింది.. నేను కూడా పంపించా.. ఫోన్లోనే శుభాకాంక్షలు చెప్పుకున్నాం.
అహనా కుమ్రా: ఈ ఏడాది నా బ్రదర్ ఫిలడెల్ఫియాలో ఉన్నాడు. అందుకే నేను, నా చెల్లి వాడికి రాఖీ పంపించాం. నాకు ముంబైలో కజిన్ ఉన్నాడు. అతడికి రాఖీ కట్టా. అలాగే ‘యుద్ధ్’ సినిమాలో నాకు అన్నగా నటిస్తున్న పవైల్ గులాటికి ఒక సన్నివేశంలో రాఖీ కట్టా. అయితే ఇప్పుడు పండుగ నాడు నిజంగా రాఖీ కడదామనుకుంటే ఢిల్లీ వెళ్లిపోయాడు. అతడు రాగానే రాఖీ కట్టి బహుమతి తీసుకోవడం ఖాయం.
స్వరభాస్కర్: ఎన్నో యేళ్లుగా విదేశాల్లో ఉన్న మా అన్నయ్య ఈ పండుగ రోజు ఇంటి దగ్గర ఉంటే నేను షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉండాల్సి వచ్చింది.. రాఖీ పంపించా.. అతడు కొత్తగా ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెందాలని దేవుడికి ప్రార్థించా.
రిచా చద్దా: ముంబైలోనే మా కజిన్‌కు రాఖీ కట్టి నేను సొంతంగా తయారుచేసిన డాల్ కిచిడీ పెట్టా. బిపాసాబసు: నేను నా ‘మూ-బోలా’ భాయ్ సోహమ్ షా కు రాఖీ కట్టా.. తర్వాత కలిసి స్వీట్ తిన్నాం..