సంబరాలకుసర్వం సిద్ధం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెల్లారితే చాలు... 60 ఏళ్ల కల సాక్షాత్కారమవుతున్న తరుణం... అమరుల త్యాగాల పునాదులపై ఆవిర్భవిస్తున్న నవజాత శిశువు తెలంగాణ రాష్ట్రాన్ని గుండెలకు హత్తుకుని మనసు నిండా ఆనందం నింపుకునేందుకు ఖమ్మం మెట్టు ముస్తాబవుతోంది. తరతరాల ఆకాంక్ష నెరవేరుతున్న వేళ.. నవ తెలంగాణ రాష్ట్రానికి అఖండ రీతిలో స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజానీకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన ఉద్యోగులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలందరి చిరకాల స్వప్నం తీరబోతున్న తరుణంలో జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాయాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులు, రంగులతో కళకళలాడుతున్నాయి. ఆదివా రం అర్ధరాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎక్కడా ఏ విధమైన అడ్డంకులు రాకుండా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చర్యలు తీసుకుంటున్నారు.
మండల కేంద్రాల్లో కూడా వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ ఆయా మండలాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. జూన్ 2న ఉద్యోగులందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంబరాల్లో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి బాణాసంచా కాల్చు తూ ఆనందంగా గడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. వారం రోజులపాటు మండల, పంచాయతీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్కడ జిల్లా స్థాయి అధికారులు కూడా బాగస్వాములు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్సవాలకు ప్రత్యేక కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. మండలాల్లో వేడుకల నిర్వహణకు రూ.10 వేలు నిధులు సైతం విడుదల చేసినట్లు తెలిసింది. ఈ వేడుకలను పురస్కరించుకొని జూన్ 2న ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో జాతీయ పతాకం ఆవిష్కరించి పావురాలు ఎగరవేయనున్నారు.
భక్తరామదాసు కళాక్షేత్రం వద్ద బెలూన్లు ఎగురవేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడే రైతులకు, స్వశక్తి సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ పాఠశాలల ఉపాధ్యాయులకు, అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బాగా పనిచేసిన సిబ్బందిని సన్మానించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యుత్తమ సేవలందిస్తున్న డాక్టర్లను కూడా సన్మానించనున్నారు. అలాగే బతుకమ్మ, తదితర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2 తరువాత ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు సైతం తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో....
తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ జేఏసీ, ఉద్యోగ జేఏసీలు సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయా శాఖల నేతలు తమతమ కార్యాయాల్లో జెండాలను ఎగురవేసి, వినూత్న రితీలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. వినోదం పంచేలా పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కార్యాలయాలకు తెలంగాణ రాష్ట్రం పేరుతో ప్లెక్సీలు, బోర్డులు, ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ , బీజేపీ, న్యూడెమోక్రసీ పార్టీలు సైతం వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నాయి.