Celsius
-
నిప్పల కుంపటి
తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న జనం జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జనసంచారంలేక బోసిపోయిన రోడ్లు భవననిర్మాణ కార్మికులు, చిన్నవ్యాపారుల అవస్థలు ఎండలు మండుతున్నాయి. నిప్పులు చెరిగినట్టు సెగలు కక్కుతున్నాయి. భానుడి భగభగలతో జనం మల మలా మాడుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్య కిరణాలు చురుక్కుమనిపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నెలలో రెండు వారాలుగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదుకాలేదు. సాక్షి,చిత్తూరు : జిల్లాలో ఎండలు తీవ్రమ య్యాయి. మే 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏరోజూ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదుకాలేదు. చిత్తూరు, తిరుపతి నగరాల్లో ఈ క్రమంలో ఎండలు కాస్తున్నాయి. పశ్చిమాన మదనపల్లెలాంటి ఎత్తై ప్రాంతాల్లో కూడా 39 -40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది జిల్లాలో ఈ సమయం లో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ ఏడాది మరొక డిగ్రీ అదనంగా 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదు కావటంతో ప్రజలు ఎండలకు అల్లాడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్, మంచిర్యాల, పిడుగురాళ్లతో సమానంగా శుక్రవారం 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం. చల్లని ప్రదేశమైన తిరుమలలో సైతం భక్తులకు అరికాళ్లు మంటలుపుట్టేలా ఎండల తీ వ్రత ఉంటోంది. ఇదే పరిస్థితి మరో వారం రోజుల వరకు ఉండవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉం టుందని జనం ఆందోళన చెందుతున్నారు. నిర్మానుష్యంగా రోడ్లు తిరుపతి, చిత్తూరు నగరాలు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి తదితర పట్టణాల్లో ఎండల సెగ తాళలేక జనం ఉదయం 11 గంటలలోపే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు జనం రోడ్లపైన తిరగటం లేదు. రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అత్యవసరమైన పని ఉంటే తప్ప జనం రోడ్లపైకి రావటం లేదు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటే టోపీలు, గొడుగులు ధరిస్తున్నారు. మహిళలు, విద్యార్థినులు ముఖాలకు ముసుగులేసుకుని వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బంది చిన్నపిల్లలు, వృద్ధులు ఎండవేడిమికి తాళలేకపోతున్నారు. ఉక్కపోతతో చెమటలు కార్చుకుంటూ నీరసించిపోతున్నారు. ఎండలకు వెళ్లకుండా వృద్ధులు ఇంటిపట్టునే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, శీతలపానీయాలు సేవిస్తూ వేసవి తీవ్రత నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఇటుకరాళ్లు తయారు చేసేవారు, తోపుడు బండ్ల పై వ్యాపారాలు చేసేవారు ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా బతుకుతెరువు కోసం శ్రమించకతప్పని పరిస్థితి. మండుతున్న ఎండలతో వారు అవస్థలుపడుతున్నారు. బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు పడతాయనే వార్తలు వస్తున్నా, ఆ ప్రభావం జిల్లా వాతావరణంపై ఇంతవరకు కనిపించలేదు. -
సిలికాన్ సిటీకి సన్ స్ట్రోక్
తల్లడిల్లుతున్న ఉద్యాన నగరి రెండు, మూడు రోజులుగా తీవ్ర ఎండలు, వేడి గాలులు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరే ప్రమాదం సాధారణం కంటే పెరిగిన ఉష్ణోగ్రత బళ్లారి, రాయచూరు, గుల్బర్గలలో అత్యధికం ఊపందుకున్న శీతల పానీయాల విక్రయాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : భానుడి ప్రతాపంతో నగర వాసులు అల్లాడి పోతున్నారు. ఎప్పుడూ ఇలాంటి ఎండలను చూడలేదనే మాట అందరి నోటా వినబడుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉక్కపోత. బస్సుల్లో వెళుతుంటే వేడి గాలులు. రెండు, మూడు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కొద్ది దూరం నడిచినా ఆయాసం ఆవరిస్తోంది. ఈ నెలలో సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతోంది. వేసవిలో బళ్లారి, రాయచూరు, గుల్బర్గలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ప్రస్తుతం బెంగళూరు కూడా వాటికి ఏ మాత్రం తీసిపోవడం లేదని నగర వాసులు వాపోతున్నారు. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. ఎండ వేడిమి నుంచి బయటపడడానికి నగర వాసులు శీతల పానీయాలు, కొబ్బరి నీరును ఆశ్రయిస్తుండడంతో వాటి అమ్మకాలు జోరందుకున్నాయి. ధర కూడా చుక్కలనంటుతోంది. సాధారణంగా మార్చిలో ఓ మోస్తరు వర్షాలు పడిన అనంతరం వేసవి ప్రారంభం కావడంతో గతంలో పెద్దగా ఎండలనిపించేవి కావు. ఈసారి అలాంటి వర్షాలు లేకపోవడం శాపంగా పరిణమించింది. సమీప భవిష్యత్తులో వానలు కురిసే అవకాశాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ చేరుతుందేమోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 22 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతోంది. మరో వైపు కోస్తాతో పాటు పలు జిల్లాల్లో పడుతున్న చెదురు మదురు వర్షాలతో స్థానికులు మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. -
గజగజ...
= గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు = గతంలో కనిష్ట ఉష్ణోగ్రత 8.4 డిగ్రీల సెల్సియస్ = ప్రస్తుతం ‘బెల్గాం’లో 5.9 డిగ్రీలుగా నమోదు 1970 నాటి రికార్డు బద్దలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో చలి విశ్వ రూపం దాల్చుతోంది. గత రికార్డులను బద్ధలు కొడుతూ కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. బెల్గాం జిల్లాలో ఈ నెల 11న కనిష్ట ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 1970లో నమోదైన 8.4 డిగ్రీలే ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతగా రికార్డుగా ఉంది. బీదర్‌లో ఈ నెల 13న ఆరు డిగ్రీల సెల్సియస్‌గా (1936లో 10) నమోదైంది. తుమకూరులో ఈ నెల 11న 8.7 (1981లో 10.4), చిత్రదుర్గలో 8.2 (1945లో 8.3), బళ్లారిలో 9.7 (1926లో 10.6), రాయచూరులో 9.7 (1945లో 10), గదగలో 8.7 (1925లో 10), శివమొగ్గలో 7.2 (1966లో 7.4), చిక్కమగళూరులో 9 (1975లో 11), దక్షిణ కన్నడలో 16.2 (1950లో 16.7), ఉత్తర కన్నడలో 9.5 (1966లో 15.6)గా నమోదయ్యాయి. బెంగళూరులో ఈ నెల 10న 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే 1883లో అతి తక్కువగా 8.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.