
నిప్పల కుంపటి
- తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న జనం
- జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- జనసంచారంలేక బోసిపోయిన రోడ్లు
- భవననిర్మాణ కార్మికులు, చిన్నవ్యాపారుల అవస్థలు
ఎండలు మండుతున్నాయి. నిప్పులు చెరిగినట్టు సెగలు కక్కుతున్నాయి. భానుడి భగభగలతో జనం మల మలా మాడుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్య కిరణాలు చురుక్కుమనిపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నెలలో రెండు వారాలుగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదుకాలేదు.
సాక్షి,చిత్తూరు : జిల్లాలో ఎండలు తీవ్రమ య్యాయి. మే 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏరోజూ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదుకాలేదు. చిత్తూరు, తిరుపతి నగరాల్లో ఈ క్రమంలో ఎండలు కాస్తున్నాయి. పశ్చిమాన మదనపల్లెలాంటి ఎత్తై ప్రాంతాల్లో కూడా 39 -40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది జిల్లాలో ఈ సమయం లో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ ఏడాది మరొక డిగ్రీ అదనంగా 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదు కావటంతో ప్రజలు ఎండలకు అల్లాడుతున్నారు.
రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్, మంచిర్యాల, పిడుగురాళ్లతో సమానంగా శుక్రవారం 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం. చల్లని ప్రదేశమైన తిరుమలలో సైతం భక్తులకు అరికాళ్లు మంటలుపుట్టేలా ఎండల తీ వ్రత ఉంటోంది. ఇదే పరిస్థితి మరో వారం రోజుల వరకు ఉండవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉం టుందని జనం ఆందోళన చెందుతున్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు
తిరుపతి, చిత్తూరు నగరాలు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి తదితర పట్టణాల్లో ఎండల సెగ తాళలేక జనం ఉదయం 11 గంటలలోపే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు జనం రోడ్లపైన తిరగటం లేదు. రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అత్యవసరమైన పని ఉంటే తప్ప జనం రోడ్లపైకి రావటం లేదు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటే టోపీలు, గొడుగులు ధరిస్తున్నారు. మహిళలు, విద్యార్థినులు ముఖాలకు ముసుగులేసుకుని వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు.
చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బంది
చిన్నపిల్లలు, వృద్ధులు ఎండవేడిమికి తాళలేకపోతున్నారు. ఉక్కపోతతో చెమటలు కార్చుకుంటూ నీరసించిపోతున్నారు. ఎండలకు వెళ్లకుండా వృద్ధులు ఇంటిపట్టునే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, శీతలపానీయాలు సేవిస్తూ వేసవి తీవ్రత నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.
భవన నిర్మాణ కార్మికులు, ఇటుకరాళ్లు తయారు చేసేవారు, తోపుడు బండ్ల పై వ్యాపారాలు చేసేవారు ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా బతుకుతెరువు కోసం శ్రమించకతప్పని పరిస్థితి. మండుతున్న ఎండలతో వారు అవస్థలుపడుతున్నారు. బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు పడతాయనే వార్తలు వస్తున్నా, ఆ ప్రభావం జిల్లా వాతావరణంపై ఇంతవరకు కనిపించలేదు.