'బకాయిలను విడుదల చేయండి'
జైట్లీని కోరిన ఈటల రాజేందర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కేంద్ర ప్రీ బడ్జెట్ సమాలోచనలో భాగంగా బుధవారం ఆయన జైట్లీతో భేటీ అయ్యారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకి 2012–13 నుంచి రావాల్సిన సీఎస్టీ బకాయిలు రూ.10,400 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి మూడో విడత కింద విడుదల చేయాల్సిన రూ.450 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన రూ. 19 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని కోరినట్లు వివరించారు.