central excise duty
-
పెట్రోల్, డీజిల్‌పై ‘వ్యాట్’ తగ్గింపు
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు తమ వంతుగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించి, వినియోగదారులకు మరింత ఊరట కలిగించాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌లో కోత విధించింది. దీనివల్ల తమ ఖజానాపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. కేరళలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై 1.36 చొప్పున వ్యాట్ తగ్గించింది. తాము లీటర్ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 చొప్పున తగ్గిస్తామని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. పెట్రో పన్ను తగ్గింపును పరిశీలిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. పన్నులు పెంచినప్పుడు సంప్రదించారా?: తమిళనాడు ఆర్థిక మంత్రి పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు విషయంలో కేంద్రం పక్షపాతం ప్రదర్శించిందని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఆదివారం విమర్శించారు. రాష్ట్రాలు సైతం పన్ను తగ్గించాలని కేంద్రం కోరడం సమంజసం కాదని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచినప్పుడు కేంద్రం ఏనాడూ రాష్ట్రాలను సంప్రదించలేదని తప్పుపట్టారు. 2021 నవంబర్‌లో కేంద్రం ప్రకటించిన పన్ను కోత వల్ల తమిళనాడు ఇప్పటికే రూ.1,000 కోట్లకుపైగా నష్టపోయిందన్నారు. కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా పెట్రో ధరలు 2014 నాటి కంటే అధికంగానే ఉన్నాయని ఆక్షేపించారు. 72 గంటల్లోగా పెట్రోల్, డీజిల్‌పై తమిళనాడు సర్కారు పన్ను తగ్గించాలంటూ రాష్ట్ర బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రాలకు పన్ను నష్టం జరగదు: నిర్మల పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వల్ల కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాలో కోత పడుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో భాగమైన రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్సును మాత్రమే తగ్గించినట్లు తెలిపారు. ఈ సెస్సును రాష్ట్రాలతో కేంద్రం పంచుకోవడం లేదని ట్విట్టర్లో స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాలో ఎలాంటి కోత ఉండదని తేల్చిచెప్పారు. భారత్ భేష్: ఇమ్రాన్ ఖాన్ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో ప్రశంసించారు. దక్షిణాసియా ఇండెక్స్ రిపోర్టును ట్వీట్‌కు జతచేశారు. భారత ప్రభుత్వం రష్యా నుంచి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండడం, దేశీయంగా వినియోగదారుల కోసం ధర తగ్గించడం మంచి పరిణామం అని తెలిపారు. అమెరికా నుంచి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ రష్యా చమురు విషయంలో భారత్ వెనక్కి తగ్గడం లేదని పేర్కొన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో తమ హయాంలోనూ ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రయత్నించామని అన్నారు. -
భారీ పెట్రో ఉపశమనం
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల మంటతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ తగ్గింపు దోహదపడుతుందని అన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గిపోతే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.9.5, డీజిల్ ధర రూ.7 చొప్పున తగ్గుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.లక్ష కోట్ల భారం పడుతుందన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలని నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏడాదిలో 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. 9 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.6,100 కోట్ల భారం పడనుంది. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్æ డ్యూటీ తగ్గింపు ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ రూ.96.67 పలుకుతోంది. కేంద్ర పన్నుల తగ్గింపుతో ఆదివారం ఈ ధరలు వరుసగా రూ.95.92, రూ.89.67కు పడిపోనున్నాయి. పీఎం ఉజ్వల యోజన కింద ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1,003 ఉంది. రూ.200 రాయితీతో రూ.803కే పొందవచ్చు. పెట్రో, వంట గ్యాస్ ధరల భారంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్లాస్లిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కోసం మనం ఎక్కువగా విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే దిగుమతి చేసుకొనే ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల మన దేశంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయన్నారు. అంతేకాకుండా ఇనుము, ఉక్కు ధరలను సైతం తగ్గించడానికి వీలుగా ఆయా ముడి సరుకులపై కస్టమ్స్ పన్ను తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఉక్కుకు సంబంధించి కొన్ని ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించబోతున్నట్లు తెలిపారు. కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. దేశీయ అవసరాలకు సరిపడా సిమెంట్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు నిర్మల ప్రకటించారు. సిమెంట్ ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. కాగా, స్టేట్ ట్యాక్స్ లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 చొప్పున తగ్గిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని పాక్షికంగానే తగ్గించిందని విమర్శించింది We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman (File Pic) pic.twitter.com/13YJTpDGIf — ANI (@ANI) May 21, 2022 ప్రజలే మాకు ప్రథమం: ప్రధాని మోదీ తమ ప్రభుత్వానికి ప్రజలే ప్రథమం అని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజా ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో ఆయన శనివారం ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల వివిధ రంగాలపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు. ఎరువులపై అదనంగా రూ.1.10 లక్షల కోట్ల రాయితీ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ పునద్ఘాటించారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే తమ హయాంలో సగటు ద్రవ్యోల్బణం గత ప్రభుత్వాల కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించామన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయన్నారు. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మన దేశంలో సరుకుల ధరలను అదుపులో ఉంచామని గుర్తుచేశారు. ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయాయని, ఈ భారం మన రైతులపై పడకుండా ఎరువులపై సబ్సిడీకి రూ.105 లక్షల కోట్లకు అదనంగా రూ.1.10 లక్షల కోట్లు కేటాయించామన్నారు. -
నాలుగు నెలల్లో లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం వసూళ్లు
ఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం వసూళ్లు 48% పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఏప్రిల్-జూలై 2021 మధ్య ఎక్సైజ్ సుంకం వసూళ్లు లక్ష కోట్లకు పైగా వసూలు అయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల(ఏప్రిల్ - జూలై) కాలంలో వసూళ్లు రూ.32,492 కోట్లు పెరిగి సుమారు రూ.1,00,387 కోట్లకు చేరుకుంది. గత కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఎ ప్రభుత్వం ఇంధనానికి సబ్సిడీ ఇవ్వడానికి జారీ చేసిన చమురు బాండ్లను తిరిగి చెల్లించడానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.10,000 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కేవలం ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలలోనే రూ.32,492 కోట్లు వసూలు అయ్యాయి. అంటే.. ఈ చమురు బాండ్ల కింద చెల్లించాల్సిన డబ్బు కంటే మూడు రేట్లు అదనంగా ఎక్సైజ్ సుంకం వసూలు అయ్యింది. ఎక్సైజ్ సుంకం వసూలులో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్ నుంచే ఉంది. ఎకానమీ పుంజుకోవడంతో, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం వసూళ్లు గత సంవత్సరంతో పోలిస్తే లక్ష కోట్లకు పైగా పెరగవచ్చు అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.(చదవండి: ఈడీ నోటీసులను కోర్టులో సవాల్ చేసిన సచిన్ బన్సాల్) అయితే, పెట్రో ధరల పెరుగుదల విషయంలో కేంద్ర చెబుతున్న సమాధానాలు వేరేగా ఉన్నాయి. గత ప్రభుత్వం చమురు కంపెనీలకు రూ.1.34 లక్షల కోట్ల విలువైన బాండ్లను జారీ చేసింది. ఇప్పుడు దానికి వడ్డీ + అసలు చెల్లించాల్సి వస్తున్నట్లు తెలిపింది. మరోవైపు పెట్రో ఉత్పత్తులపై ఇప్పటికే కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2020-21 మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3.35 లక్షల కోట్లు సమకూరింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.1.78లక్షల కోట్లుగా ఉంది. అంటే 88 శాతం మేర పెరిగినట్లు ఇటీవల పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానంలో కేంద్రమే పేర్కొంది. ప్రజలను తప్పు దోవ పట్టించడానికి కేంద్రం అబద్దం చెబుతున్నట్లు ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని గత ఏడాది లీటరుకు రూ.19.98 నుండి రూ.32.9కు పెంచారు. -
పెట్రో ఆదాయం 3.35 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రానికి రూ.3,35,746 కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ లోక్‌సభకు తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ లీటరుపై రూ.19.98 నుంచి రూ.32.90, డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.80కి పెంచడంతో ఒక్క ఏడాదిలోనే 88 శాతం ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఈమేరకుసమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2019 ఏప్రిల్ 1వ తేదీన పెట్రోల్ రూ.77.26, డీజిల్ రూ.71.81, ఎల్పీజీ రూ.762 ఉండగా, ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.97.20, ఎల్పీజీ రూ.887కు చేరుకున్నాయని తెలిపారు. -
స్వర్ణకారుల దుకాణాల బంద్
బంగారం వృత్తి వ్యాపారంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం విధించినందుకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా జోగిపేటలో స్వర్ణకారుల దుకాణాలు మూసివేశారు. బంగారంపై సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ కిష్టయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 17వ తేదీ వరకు దుకాణాలను మూసివేత కొనసాగించనున్నట్లు తెలిపారు.