ప్రాదేశిక జలాల పరిధిలో రాష్ట్రాలకే హక్కు
సీజీఎస్టీలో నిబంధన: యనమల
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల ప్రాదేశిక జలాల పరిధిలో జరిగే వస్తు సేవల లావాదేవీలపై పన్ను పరిధిని రాష్ట్రాలకు కట్టబెడుతూ సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) చట్టంలో తగిన నిబంధన పొందుపరిచినట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శనివారం ఇక్కడ జరిగిన 11వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్న అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రాల ప్రాదేశిక జలాల పరిధిలో జరిగే వస్తు సేవల లావాదేవీలకు సంబంధించి పన్ను పరిధిని రాష్ట్రాలకే కట్టబెట్టాలని యనమల ఇదివరకే జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్కు లేఖ రాశారు. ఈ విన్నపాన్ని అంగీకరిస్తూ ముసాయిదాలో తగిన నిబంధన రూపొందించిందని యనమల తెలిపారు.