Central Health and Family Welfare
-
భయపెడుతోన్న మహారాష్ట్ర.. లిస్ట్‌లో మరో 4 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసులు భారీగా తగ్గిపోగా.. తాజాగా వాటి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్ ప్రాంతంలో లాక్డౌన్ విధేంచేందుకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండగా.. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రల్లో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. ‘‘మహారాష్ట్ర పరిస్థితి చూస్తే.. మాకు ఆందోళనగా ఉంది. ఇది చాలా సీరియస్ అంశం’’ అన్నారు ‘‘మహారాష్ట్ర.. దేశ ప్రజలకు రెండు పాఠాలు నేర్పుతోంది. వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు. జాగ్రత్తలు పాటించడం మరవకూడదు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 1,89,226 యాక్టీవ్ కేసులు ఉండగా.. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా కేసులున్నాయి. అలానే యాక్టీవ్ కేసుల్లో టాప్ 10లో బెంగళూరు అర్బన్, పుణె, అమరావతి, జల్గావ్, నాసిక్, ఎర్నాకులం, ఔరంగబాద్, నాగ్‌పూర్, థానె, ముంబై ఉన్నాయి. ఈ జిల్లాలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు తగ్గుతోందని.. రికవరీల రేటు పెరుగతోందన్నారు రాజేష్ భూషణ్. ఇప్పటివరకు 2.56 కోట్ల మందికి పైగా టీకా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల వాటా 71 శాతం కాగా ప్రైవేటు ఆస్పత్రుల వాటా 28.77 శాతంగా ఉందన్నారు. చదవండి: ఒక్కరోజే 1,710 కేసులు.. మరోసారి లాక్డౌన్ -
కరోనా రికవరీలో ఏపీ మరింత ముందంజ
ఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 11,72,179 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం తన ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 4.5 కోట్లు దాటేసింది. అత్యధిక కరోనా పరీక్షల ద్వారా దేశంలో పాజిటివ్ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 30వ తేదీ వరకు రోజుకు పదుల సంఖ్యలో నిర్వహించిన పరీక్షలు.. ఏడు నెలల్లోనే రోజుకు 11లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు రోజూవారి నిర్వహిస్తున్న పరీక్షల ద్వారా దేశంలో పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గుతుందడడంతో పాటు మరణాల రేటు కూడా తగ్గడం సానుకూలాంశమని కేంద్రవైద్యారోగ్యశాఖ తెలిపింది. ఏపీ మరింత ముందంజ ఇక రాష్ట్రాల వారిగా చూసుకుంటే.. ప్రధానంగా ఐదు రాష్ట్రాలలో 62% కరోనా కేసులు నమోదవుతున్నాయి. వాటిలో మహారాష్ట్రలో 25%, ఏపీలో 12.64 శాతం, కర్ణాటకలో 11.58 శాతం, ఉత్తరప్రదేశ్ లో 7 శాతం, తమిళనాడులో ఆరు శాతం కేసులు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో 37 శాతం కేసులు ఉన్నాయి ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఏపీలో కరోనా యాక్టివ్ కేసులలో ప్రతిరోజు 13.7 శాతం తగ్గుతోంది. రోజువారీ కరోనా మరణాల్లో 4.5 శాతం తగ్గుదల ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఏపీలో ఆగస్టు 13-19 తేదీల మధ్య 1,12,714 కేసులు ఉంటే.. ఆగస్టు 20-26 తేదీల మధ్య 88,612 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 27- సెప్టెంబర్ 2 మధ్య 97, 272 కేసులు నమోదయ్యయి. కరోనాతో దేశంలో సంభవించిన మొత్తం మరణాలలో 6.12 శాతం ఏపీలో చోటుచేసుకున్నాయి. రోజూవారి కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నా.. రికవరీ రేటులో మాత్రం ముందంజలో ఉంది. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుదల 6.9 శాతంగా ఉండగా.. కరోనా మరణాల సంఖ్య 37.39 శాతంగా ఉంది. కరోనా పరీక్షలు పెరిగిన కొద్దీ, అదే స్థాయిలో రికవరీ రేటు పెరుగుతోంది .యాక్టీవ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య మూడు రెట్ల పైనే ఉంది. దేశంలో పాజిటివ్ రేటు 1.75శాతానికి పడిపోగా.. రికవరీ రేటు మాత్రం 77.09శాతంతో మరింత మెరుగైంది. ప్రస్తుతం దేశంలో 8లక్షల 15వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. ఈ మొత్తం 21.16శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు 3359 కరోనా కేసులు ఉంటే .. భారత్‌లో 2792 కేసులు ఉన్నాయి. అమెరికాలో ప్రతి మిలియన్ కు 18926 కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు 111 మంది చనిపోతుంటే .. భారత్‌లో మాత్రం 49 మందే చనిపోతున్నారు. (చదవండి :భారత్‌లో ఒక్కరోజే 83వేల కేసులు) కాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో రికార్డు స్థాయిలో 83,883 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 38,53,406కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1043మంది మృత్యువాతపడగా, మొత్తం 67,376మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 29,70,493 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.(చదవండి : విజృంభిస్తోన్న వైరస్.. సత్యేంద్ర జైన్ స్పందన) -
వైద్య విద్య ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్
ప్రైవేటు మెడికల్ యాజమాన్య సీట్ల ప్రత్యేక కౌన్సెలింగ్ రద్దు ⇒ నీట్ ఆధారంగా ఒకే ర్యాంకుృఒకే కౌన్సెలింగ్ విధానం ⇒ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశం ⇒ 2017-18 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలకు సూచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. 2017-18 నుంచి నిర్వహించే అన్ని వైద్య విద్య ప్రవేశాలకూ ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సహా అన్ని పీజీ వైద్య సీట్లను ఏకీకృత ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని పేర్కొంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు సహా ఏ వైద్య విద్యా సంస్థకూ ఉమ్మడి కౌన్సెలింగ్ నుంచి మినహాయింపు ఉండదని తెలిపింది. ఈ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2000, గ్రాడ్యు యేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-1997 చట్టా లకు సవరణలు తెస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సవరణల ఆధారంగానే ఉమ్మడి కౌన్సెలింగ్ కు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. 2016-17లో బిహార్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, యూపీలు వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి కౌన్సెలింగ్ విధానాన్ని తెలుసుకొని మిగతా రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించింది. అఖిల భారత కోటా పీజీ, యూజీ మెడికల్ సీట్లకు మాత్రం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌ను ఏప్రిల్ 4 నుంచి ప్రారంభించి మే చివరికల్లా అడ్మిషన్ల ప్రక్రియను ముగిస్తారు. ఉమ్మడి కౌన్సెలింగ్‌తో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజులెలా ఉన్నా ప్రతిభగల వారికే సీట్లు లభిస్తాయి. ఒకే ర్యాంకు... ఒకే కౌన్సెలింగ్ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడిక ల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కేంద్రం నీట్‌ను తప్పనిసరి చేయడంతో గతేడాది నీట్ ర్యాం కుల ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లకు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ప్రత్యేకంగా ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు యాజమాన్యాలే మరో కౌన్సెలింగ్ నిర్వహించుకున్నాయి. ఎన్ఆర్ఐ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్మేసుకున్నాయి. దీంతో నీట్ ర్యాంకులను ఆధారం చేసుకున్నా అనేకమంది డొనేషన్లు చెల్లించే బీ కేటగిరీ సీట్లల్లో చేరాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పడనుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50%, మైనారిటీ కాలేజీల్లోని 60% సీట్లను కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. ప్రైవేటులోని 35%, మైనారిటీలోని 25% సీట్లు బీ కేటగిరీ సీట్లుకాగా మిగిలినవి ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. దాదాపు 915 బీ కేటగిరీ సీట్లకూ ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఈ సీట్లన్నీ ప్రతిభ ఉన్నవారికే లభిస్తాయని అంటున్నారు. ఇక ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఎలా భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది. నీట్ ప్రకారం యాజమాన్య సీట్లన్న నిర్వచనమే ఉంది తప్ప బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా లేదన్న వాదనలూ ఉన్నాయి. ఈ సీట్లనూ నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తే అప్పుడు వాటినీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది.