వైద్య విద్య ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ | Joint counseling to the Medical Education Admissions | Sakshi
Sakshi News home page

వైద్య విద్య ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌

Published Mon, Mar 13 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

వైద్య విద్య ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌

వైద్య విద్య ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌

ప్రైవేటు మెడికల్‌ యాజమాన్య సీట్ల ప్రత్యేక కౌన్సెలింగ్‌ రద్దు
నీట్‌ ఆధారంగా ఒకే ర్యాంకుృఒకే కౌన్సెలింగ్‌ విధానం
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశం
2017-18 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలకు సూచన


సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. 2017-18 నుంచి నిర్వహించే అన్ని వైద్య విద్య ప్రవేశాలకూ ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ సహా అన్ని పీజీ వైద్య సీట్లను ఏకీకృత ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలని పేర్కొంది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ వర్సిటీలు సహా ఏ వైద్య విద్యా సంస్థకూ ఉమ్మడి కౌన్సెలింగ్‌ నుంచి మినహాయింపు ఉండదని తెలిపింది.

ఈ మేరకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌-2000, గ్రాడ్యు యేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌-1997 చట్టా లకు సవరణలు తెస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సవరణల ఆధారంగానే ఉమ్మడి కౌన్సెలింగ్‌ కు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. 2016-17లో బిహార్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, యూపీలు వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి కౌన్సెలింగ్‌  విధానాన్ని తెలుసుకొని మిగతా రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించింది. అఖిల భారత కోటా పీజీ, యూజీ మెడికల్‌ సీట్లకు మాత్రం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌ను ఏప్రిల్‌ 4 నుంచి ప్రారంభించి మే చివరికల్లా అడ్మిషన్ల ప్రక్రియను ముగిస్తారు. ఉమ్మడి కౌన్సెలింగ్‌తో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఫీజులెలా ఉన్నా ప్రతిభగల వారికే సీట్లు లభిస్తాయి.

ఒకే ర్యాంకు... ఒకే కౌన్సెలింగ్‌
దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడిక ల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు కేంద్రం నీట్‌ను తప్పనిసరి చేయడంతో గతేడాది నీట్‌ ర్యాం కుల ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ జరిగింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సీట్లకు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లకు ప్రత్యేకంగా ప్రభుత్వం కౌన్సెలింగ్‌ నిర్వహించగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు యాజమాన్యాలే మరో కౌన్సెలింగ్‌ నిర్వహించుకున్నాయి. ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్మేసుకున్నాయి. దీంతో నీట్‌ ర్యాంకులను ఆధారం చేసుకున్నా అనేకమంది డొనేషన్లు చెల్లించే బీ కేటగిరీ సీట్లల్లో చేరాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్‌ పడనుంది.

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 50%, మైనారిటీ కాలేజీల్లోని 60% సీట్లను కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. ప్రైవేటులోని 35%, మైనారిటీలోని 25% సీట్లు బీ కేటగిరీ సీట్లుకాగా మిగిలినవి ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లున్నాయి. దాదాపు 915 బీ కేటగిరీ సీట్లకూ ఏకీకృత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే ఈ సీట్లన్నీ ప్రతిభ ఉన్నవారికే లభిస్తాయని అంటున్నారు. ఇక ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు ఎలా భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది. నీట్‌ ప్రకారం యాజమాన్య సీట్లన్న నిర్వచనమే ఉంది తప్ప బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా లేదన్న వాదనలూ ఉన్నాయి. ఈ సీట్లనూ నీట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తే అప్పుడు వాటినీ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement