Central Home Department orders
-
కరోనా కట్టడిపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్డౌన్, కంటైన్మెంట్ జోన్లను అమలు చేయడంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా పాజిటివిటీ రేటు వారానికి 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆసుపత్రుల్లో పడకలు 60 శాతానికి పైగా భర్తీ అయినప్పుడు ఈ పరిమితులను విధించాలని స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొన్న నిబంధనల ప్రకారం జిల్లా, నగర ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను ఇంటెన్సివ్, లోకల్, ఫోకస్డ్ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. లాక్ డౌన్ అనేది ఎప్పుడు, ఎక్కడ పెట్టాలన్న విషయాన్ని కరోనాతో ప్రభావితమైన జనాభా, భౌగోళిక వ్యాప్తి, ఆ ప్రదేశంలో ఉండే ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, మానవశక్తి , ఇతర వనరులను దృష్టిలో ఉంచుకొని, విశ్లేషణలను ఆధారంగా చేసుకోవాలని సూచించింది. ఈ ప్రాంతాలను "పెద్ద కంటైన్మెంట్ జోన్" పిలువవచ్చునని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడంపై విస్తృత మార్గదర్శకాలను ఇచ్చామని గుర్తుచేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కనీసం 14 రోజులపాటు ఆంక్షలు అమలు చేయాలని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లను గుర్తించిన తర్వాత కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసిన సూచనలు: నైట్ కర్ఫ్యూ - రాత్రిపూట అత్యవసర సేవలను మినహాయించి, మిగతా వాటిని పూర్తిగా బంద్ చేయాలి. నైట్ కర్ఫ్యూ సమయాన్ని స్థానికంగా ఉండే పరిపాలన అధికారులు నిర్ణయించాలి. ప్రజల కదలిక ఎక్కువగా ఉండే రాజకీయ, క్రీడ, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను పూర్తిగా నిషేధించాలి. ఇతర సమావేశాలు కూడా పూర్తిగా నిషేధం. ప్రజలు ఒకచోట ఉండకుండా చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చు. వివాహ వేడుకలకు కేవలం 50 మంది పాల్గొనేలా చూడాలి. అంత్యక్రియల్లో 20 మంది ఉండేలా చూడాలి. షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, జిమ్, స్పా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి. మతపరమైన ప్రదేశాలను కూడా మూసివేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో కేవలం అవసరమైన సేవలు మాత్రమే కొనసాగాలి. రైల్వేలు, మెట్రోలు, బస్సులు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణాలో వాటి సామర్థ్యంలో సగం వరకు మాత్రమే ప్రయాణించేలా చూసుకోవాలి. అంతర్రాష్ట్ర రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేవు. కార్యాలయాలు కేవలం సగం మంది సిబ్బందితో పనిచేసేలా చూసుకోవాలి. పారిశ్రామిక, శాస్త్రీయ సంస్థలు భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలను జరపవచ్చు. ఈ సంస్థల్లో పనిచేసేవారికి ఎప్పటికప్పుడు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలి. కరోనా తీవ్రతను జాగ్రత్తగా విశ్లేషించి రాష్ట్రాలే స్వంతంగా నిర్ణయించుకోవాలని కేంద్రం చెబుతోంది. కోవిడ్-19కు అంకితమైన ఆసుపత్రులకు సీనియర్ జిల్లా అధికారులను నియమించాలని, రోగులను సజావుగా మార్చడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను ఇచ్చింది. -
లాక్డౌన్లో మరిన్ని సడలింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గుర్తించిన కోవిడ్–19 హాట్స్పాట్లు, కట్టడి జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తూ ఈ నెల 15వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం మరికొన్ని సడలింపులను చేర్చింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు గుర్తించిన కంటైన్మెంట్ జోన్లకు ఈ సడలింపులు వర్తించవని తెలిపింది. హాట్స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లపై గతంలో ప్రకటించిన ఆంక్షలు మే 3వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్లు తెరవరాదనీ, మద్యం, సిగరెట్లు, గుట్కా అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి సడలింపులపై అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొంది. అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఈ–కామర్స్ సంస్థలకు సడలింపు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలు (పురపాలక సంఘాల వెలుపలి ప్రాంతాలు): గ్రామీణ ప్రాంతాల్లోని రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, మార్కెట్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ సడలింపు వర్తిస్తుంది. అయితే సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు మాత్రం ఇది వర్తించదు. అంటే షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లోని వాటికి వర్తించదు. అలాగే 50% మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మా స్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్‌కు సడలింపు వర్తిస్తుంది. ఇరుగుపొరుగున ఉన్న షాపులు, స్టాండ్ ఎలోన్ షాపులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో దుస్తులు, సెల్‌ఫోన్, హార్డువేర్, స్టేషనరీ దుకాణాలు తెరవచ్చు. అయితే, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని షాపులకు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని షాపులకు, సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు ఇది వర్తించదు. అలాగే 50 శాతం మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మాస్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. -
జవాన్లకు రోజూ యోగా
తప్పనిసరి చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: దేశంలో 10 లక్షల మందికి పైగా ఉన్న పారామిలటరీ జవాన్ల రోజువారీ భౌతిక వ్యాయామంలో యోగాను చేర్చాలని కేంద్ర సాయుధ పోలీసు దళాలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దేశ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఉన్నా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నా తప్పనిసరిగా యోగా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించింది. సాధారణంగా సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి కేంద్ర సాయుధ బలగాల జవాన్లు రోజువారీ భౌతిక వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వారు క్యాంపుల్లో ఉన్నా, సరిహద్దుల వద్ద విధుల్లో ఉన్నా కూడా వ్యాయామం చేయాల్సిందే. అయితే తాజాగా భౌతిక వ్యాయామాలతో పాటు యోగా చేయడానికి కూడా తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐడీబీపీ, ఎస్ఎస్బీ, ఎన్ఎస్జీ, అస్సాం రైఫిల్స్ తదితర బలగాలకు కేంద్ర హోంశాఖ సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిపై క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందికి సూచనలు జారీచేయాలని పేర్కొంటూ ఆయా దళాల డెరైక్టర్ జనరల్స్‌ను ఆదేశించింది. ‘భారతీయ పురాతన సాంప్రదాయమైన యోగాను రోజువారీ చర్యల్లో భాగంగా చేసుకుని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భద్రతా బలగాల రోజువారీ చర్యల్లో యోగాను చేర్చడం సముచితమైనది..’ అని సర్క్యులర్‌లో పేర్కొంది.