వైఎస్సార్సీపీని వీడి బాగుపడిన వాళ్లెవరూ లేరు: అంబటి
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, కానీ సీఎం చంద్రబాబు ఆ క్రెడిట్ తనదే అన్నట్లు ప్రసంగాలు ఇస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవంపై చంద్రబాబు మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. కడుపు తరుక్కుపోతోందంటూ మాట్లాడుతున్నారు. ఆ మాటలు చూస్తుంటే.. ‘చంద్రబాబు నాకన్నా మహానటుడు’ అని ఎన్టీఆర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ హయాంలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయి. ఇప్పుడు ప్రాజెక్టు ఫేజ్-1కు నిధులు వచ్చాయి. .. నిధుల కోసం జగన్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. జల్‌శక్తి మంత్రితో పలుమార్లు భేటీ అయ్యారు. నాడు కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో పెట్టకుండా ఎన్డీయేలో భాగమైన బాబు అడ్డుకున్నారు. రూ.12,157 కోట్ల నిధుల విడుదలలో జగన్ కృషి ఉంది... తాను చేసిన తప్పులన్నీ జగన్‌పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పనులు ఒకేసారి మొదలుపెట్టడమే పోలవరానికి పట్టిన శని. 2016లో పోలవరం కడతామని చంద్రబాబే కేంద్రాన్ని ఒప్పించారు. కమీషన్ల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారు. 2013-14లో ఉన్న రేట్ల ప్రకారం పూర్తి చేస్తామని ఒప్పుకున్నారు. ఎవరి కోసం నాటి రేట్లకు ప్రాజెక్టు నిర్మాణం ఒప్పుకున్నారు?. చంద్రబాబు అబద్ధాలను మేధావులు, ప్రజలు గుర్తించాలి. ప్రతీ సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు ఏం చేశారు?. 2018లోనే వచ్చిన వరదలతోనే డయాఫ్రం వాల్ దెబ్బతింది. చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా.. ఏనాడూ జీవనాడి అయిన పోలవరం గురించి ఏనాడూ ఆలోచించలేదు. పోలవరం గురించి వైఎస్సార్ కలలు గన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో పని చేశాం. 50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా నిర్మాణాలు చేశాం. కానీ, అసత్యాలతో చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని అంబటి అన్నారు. వలసలపై అంబటి రియాక్షన్..వలసలపై టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అంబటి స్పందించారు. మోపిదేవి జగన్ కు సన్నిహితుడు. ఆయన ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు తర్వాత రాజ్యసభకు పంపారు. ఆయన పార్టీని వీడతారని అనుకోవటం లేదు. మోపిదేవి పార్టీ మారతారని నేను అనుకోవటం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్న వెనుక్కు తీసుకోవాలని నేను చెప్తున్నా. ఎదుటివాడి దొడ్లో ఉన్న వ్యక్తుల్ని ఎత్తుకు పోవటమే చంద్రబాబు రాజకీయం. పక్కపార్టీలో వారిని ఆశచూపించో, మభ్య పెట్టో తీసుకెళ్లడం చంద్రబాబుకి బాగా తెలుసు. అధికార పార్టీలో చేరడం ద్వారా వారి క్యారెక్టర్ కోల్పోవడమే. 2014లో ఓడినప్పుడు కూడా కొందరు పార్టీ మారారు?. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారు?. క్యారెక్టర్ పొగొట్టుకున్నారు. కానీ ఎవరూ బాగుపడలేదు. చంద్రబాబు రాజకీయ జీవితం అందరికి తెలిసిందే. అధికారం శాశ్వతం కాదు. పార్టీలు మారడం మంచి పద్దతి కాదు అని అంబటి అన్నారు.