ఒక్కసారిగా స్నాప్‌చాట్ రేటింగ్స్ ఢమాల్
న్యూఢిల్లీ : భారత్, స్పెయిన్లపై స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ చేసిన సంచలన వ్యాఖ్యలు కంపెనీకి భారీగా దెబ్బకొడుతున్నాయి. ట్విట్టర్లో ఇప్పటికే ఈ కంపెనీపై పలు రకాలుగా కామెంట్లు వెల్లువెత్తుతుండగా.. చాలామంది తమ మొబైల్ నుంచి స్నాప్ చాట్ ను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు. అంతేకాక యాప్ స్టోర్‌లోనూ కంపెనీ రేటింగ్స్ కూడా భారీగా పడిపోతున్నట్టు తెలిసింది. యాప్ స్టోర్‌లో అంతకమునుపు 'ఫైవ్ స్టార్' రేటింగ్ ను సంపాదించుకున్న స్నాప్ చాట్ ఆ రేటింగ్ ను ఒక శాతానికి పడగొట్టుకుంది. యాప్ స్టోర్‌లోని యాప్ సమాచారం ప్రకారం ప్రస్తుత వెర్షన్కున్న కస్టమర్ రేటింగ్స్ ఆదివారం ఉదయానికి 'సింగిల్ స్టార్'(6099 రేటింగ్స్ ఆధారితంగా) నమోదైనట్టు తెలిసింది. మొత్తం వెర్షన్ల రేటింగ్ కూడా 'వన్ అండ్ ఆఫ్ స్టార్'(9527 రేటింగ్స్ ఆధారితంగా) మాత్రంగానే ఉన్నట్టు వెల్లడైంది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో మాత్రమే 'ఫోర్ స్టార్' దక్కించుకుంది.
తమ మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ ధనవంతులకే తప్ప పేదవాళ్లకి కాదని ఇవాన్ 2015 సెప్టెంబర్ లో వ్యాఖ్యానించినట్టు కంపెనీ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియాన్ చేసిన ఆరోపణలను వెరైటీ రిపోర్టు చేసింది. భారత్, స్పెయిన్ వంటి దేశాల్లో స్నాప్‌చాట్‌కు వృద్ధి అవకాశాలు ఉన్నాయని తాను చెప్పానని కానీ అప్పుడు ఇవాన్ స్పీగెల్ జోక్యం చేసుకుని 'స్నాప్‌చాట్ కేవలం సంపన్నులకు మాత్రమేనని, పేదదేశాలకు కాదని చెప్పి, తన మాటలను అడ్డుకున్నారని ఆంథోనీ ఆరోపించినట్లు వెరైటీ తన కథనంలో పేర్కొంది. ఇవాన్ స్పీగల్ కామెంట్లు బయటికి రాగానే, ఒక్కసారిగా స్నాప్ చాట్ పై యూజర్లు మండిపడుతున్నారు. పేద దేశాలు భారత్, స్పెయిన్ లు స్నాప్ చాట్ కంటే బెటర్ అని కొంతమంది యూజర్లు తన పోస్ట్ లో చెబుతున్నారు. స్నాప్ చాట్ అకౌంట్ ను అన్ఇన్స్టాల్ చేస్తూ.. యాప్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.
I was addicted to @Snapchat but I love my country more than this app. Let's see how you earn without Indians. @evanspiegel #boycottsnapchat
— Shreya Tewari (@SarcasticSheeya) April 16, 2017