నేటితో ముగియనున్న ఎంసెట్ కౌన్సెలింగ్
నేడు 1,20,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు పరిశీలన
గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ర్యాంకులు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగియనుంది. శుక్రవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధిలో 1,504 మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాలలను ఎంచుకునేందుకు 134 మంది విద్యార్థులు హాజరయ్యారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 363 మంది, వెబ్ కౌన్సెలింగ్‌కు 33 మంది, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 343 మంది, వెబ్ కౌన్సెలింగ్‌కు 35 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 306 మంది, వెబ్ కౌన్సెలింగ్‌కు 24 మంది, ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలనకు 492 మంది, వెబ్ కౌన్సెలింగ్‌కు 42 మంది హాజరయ్యారు.
నేటి కౌన్సెలింగ్
శనివారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 1,20,001 ర్యాంకు నుంచి 1,22,500 వరకు, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1,22,501 ర్యాంకు నుంచి 1,25,500 వరకు, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 1,25,501 ర్యాంకు నుంచి 1,27,500 వరకు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 1,27,501 ర్యాంకు నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి. 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు శని, ఆదివారాల్లో కళాశాలల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది.