chain snatchers arrested
-
Chain Snatcher: చెరువులో దూకినా దొరికేశాడు..
బుక్కరాయసముద్రం(అనంతపురం జిల్లా): మండలంలోని రేకులకుంటలో గురువారం ఓ చైన్‌స్నాచర్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని పుట్లూరు మండలానికి చెందిన పరమేశ్వరెడ్డిగా గుర్తించారు. వివరాలు.. గురువారం ఉదయం పుట్లూరు నుంచి అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న పరమేశ్వరరెడ్డి.. రేకులకుంటలో వీరనారాయణమ్మ అనే మహిళ ఇంటి వద్ద ఆపి తాగునీరు అడిగాడు. ఆమె నీళ్లు అందిస్తుండగా మెడలోని బంగారు గొలుసు లాక్కొని ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లిపోయాడు. చదవండి: ఆనందంగా గడిపి.. కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక.. బాధితురాలి కేకలతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే బీకేఎస్ సీఐ సాయిప్రసాద్‌కు సమాచారం అందించడంతో సెట్ ద్వారా ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. అప్పటికే కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు చేపట్టిన బందోబస్తుకు వెళ్లిన సిబ్బంది.. వెంటనే చెరువు కట్ట గోశాల వద్ద బ్యారికేడ్లను అడ్డుగా ఉంచి తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసుల చర్యలను గమనించిన పరమేశ్వరరెడ్డి ద్విచక్ర వాహనాన్ని వదిలి చెరువులోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన పోలీసులు వెంబడించి నిందితుడిని అదుపులోకి 3.50 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చోరీకి యత్నించి.. పట్టుబడి!
సాక్షి, బోధన్(నిజామాబాద్) : రెండు చోట్ల చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి పారిపోతుండగా, స్థానికులు వెంటబడడంతో ఒక దొంగ నాటకీయంగా చిక్కాడు. మరొకడు తప్పించుకుని పరారయ్యాడు. అసలేం జరిగిందంటే.. బోధన్‌లోని నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన సావిత్రి మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఎదుట నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సావిత్రి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో దొంగల చేతికి ఒక పుస్తే, రెండు గుండ్లు మాత్రమే చిక్కాయి. దీంతో దొంగలు బైక్‌పై వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోధన్‌లో చోరీకి యత్నించి విఫలమైన దొంగలు ఎడపల్లిలో స్నాచింగ్ చేయాలని భావించారు. మాజీ సర్పంచ్ జనగం పుష్ప మిగులు అన్నాన్ని బయటకు పారేసి ఇంట్లోకి వెళ్తుండగా, దొంగలు ఆమె మెడలోని గొలుసును లాక్కొని నిజామాబాద్ వైపు పరారయ్యారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న యువకులు, ప్రజాప్రతినిధులు పోగయ్యారు. దొంగలను పట్టుకునేందుకు కార్లు, బైకులపై బయల్దేరారు. ఈ క్రమంలో జానకంపేట, నెహ్రూనగర్ ఎంపీటీసీ ఇమ్రాన్‌ఖాన్‌కు ఫోన్ చేసి, బైక్‌పై వస్తున్న వారిని అడ్డుకోవాలని కోరారు. దీంతో ఆయన కొంత మందిని జమ చేసి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. వారిని గమనించిన దొంగలు తమ బైక్‌ను బోధన్ వైపు మళ్లించారు. అయితే, అప్పటికే ఎడపల్లి నుంచి వస్తున్న నేతలు ఎల్లయ్య యాదవ్, సుభాష్ అలీసాగర్ ఎత్తిపోతల పథకం వద్ద రోడ్డుపై కారును అడ్డంగా పెట్టగా, దొంగలు కారును ఢీకొని కింది పడిపోయారు. దొంగలను పట్టుకునేందుకు యత్నించగా ఒకరు చిక్కగా, మరొకరు పరారయ్యారు. ఎడపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని దొంగతో పాటు బైక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడ్ని బోధన్ ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెండు చోట్ల కేసులు నమోదు చేసినట్లు బోధన్ టౌన్, రూరల్ సీఐలు రాకేశ్, షాకీర్ తెలిపారు. -
వృద్ధురాళ్లే టార్గెట్..
సాక్షి, అల్వాల్: ఒంటరిగా ఉన్న వృద్ధురాళ్లనే టార్గెట్ చేసుకొని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న గొలుసు దొంగను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బాలనగర్ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి శృతినగర్‌కు చెందిన చేర్యాల రాజ్‌మనోహర్ ర్యాపిడో బైక్ రెంట్ ఆర్గనైజేషన్‌లో బైక్ అద్దెకు నడుపుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. గత నెల 26న అల్వాల్ పరిధిలోని వెంకటరమరణ కాలనీకి చెందిన వెంకటమ్మ అనే మహిళ రోడ్డుపై నిలబడి ఉండగా బైక్‌పై వచ్చిన రాజ్‌మనోహర్ ఆమెను చిరునామా అడిగినట్లు నటించి బం గారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి 6 బంగారు నగలు, బైక్, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 7న మల్కాజిగిరిలోనూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. యూ ట్యూబ్‌లో చూసి.... దొంగతనాలు చేయడం నిందితుడు యూ ట్యూబ్ ద్వారా నేర్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్ చేసుకునే ఇతను పోలీసులు, సీసీ కెమెరాలకు బైక్ నంబర్ ప్లేట్‌ను ఓ వైపునకు వంచేవాడు. హెల్మెట్ ధరించడంతో ముఖం కనిపించకుండా జాగ్రత్త తీసుకునేవాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ నర్సింగరావు, సీఐలు పులి యాదగిరి, రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, డిఐ. శంకర్, ఎస్ఐ. నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా..
ఆ యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. డబ్బు సులభంగా సంపాదించేందుకు చోరీలకు అలవాటు పడ్డారు. చైన్ స్నాచింగ్‌లు మొదలుపెట్టారు. ఒంటరిగా వెళుతున్న వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఆ చోరుల వివరాలను మంగళవారం రాజమహేంద్రవరం తూర్పు మండలం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ వై.వి.రమణకుమార్, తూర్పు మండలం డీఎస్పీ వి.వి.రమణ కుమార్ వెల్లడించారు. రెండున్నర నెలలుగా రాజా నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో చైన్ స్నాచింగ్స్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన కాకరబాల సుబ్రహ్మణ్యం(అలియాస్ బాబి) రావి వెంకటేష్ (వెంకీ), జక్కంపూడి వెంకటేష్ , ధవళేశ్వరం గ్రామానికి చెందిన సాంబారి క్రాంతి కుమార్‌లు స్నేహితులు. వీరు ఆటో డ్రైవర్‌గా, లారీ డ్రైవర్‌గా, కూలిపనులు చేసుకుని జీవిస్తుంటారు. వ్యసనాలకు బానిసలైన ఈ యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం చైన్ స్నాచింగ్‌లకు దిగారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలే లక్ష్యంగా వీరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. కాకరాల బాల సుబ్రమ్మణ్యం, మరో యువకుడు మోటారు సైకిల్‌పై మహిళలను వెంబడించి, నిర్జీవ ప్రదేశంలో వారి మెడలోని బంగారు గొలుసులను తెంచుకుని పారిపోయేవారు. వాటిని మల్లయ్య పేటకు చెందిన(రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులో బంగారు నగలు తయారీ చేసే వ్యక్తి) పాలతీర్ధపు మహేష్ అనే వ్యక్తికి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారని పోలీసులు తెలిపారు. పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చోరీలు నిందితులు ప్రతి చోరీ పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చేస్తుండేవారని అడిషనల్ ఎస్పీ వివరించారు. నిందితులు తొలిసారిగా ఈ ఏడాది మే 3న కొంతమూరులో చైన్ స్నాచింగ్ చేశారని తెలిపారు. అనంతరం మే 29న కొంతమూరు గ్రామంలో, జూన్ 6న మరో చైన్ స్నానింగ్ చేశారని తెలిపారు. జూన్ 24వ తేదీన మరో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఒకే ప్రాంతంలో చోరీలు చేస్తుండడంతో పోలీసుల నిఘా పెంచారు. దీంతో వారు చోరీ చేసే ప్రాంతాన్ని మార్చుకున్నారని తెలిపారు. ఐదో సారి జూలై నాలుగో తేదీన బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్లో చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యారని తెలిపారు ఈనెల 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొంతమూరు అవుట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటారు సైకిల్‌పై కాకర బాలసుబ్రహ్మణ్యం, రావి వెంకటేష్ పోలీసుల ను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా చైన్ స్నాచింగ్ చేస్తున్న మిగిలిన వారి పేర్లు జక్కంపూడి వెంకటేష్, సాంబారీ క్రాంతి కుమార్ పేర్లు వెల్లడించారని తెలిపారు. వీరితో పాటు చోరీ చేసిన నగలు కొనుగోలు చేసిన పాలతీర్ధపు మహేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అన్నారు. అలాగే చోరీలు చేయడానికి ఉపయోగించే రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో క్రైం పార్టీ పోలీస్ కానిస్టేబుళ్లు కె.సురేష్, డి.విజయ కుమార్, స్టేషన్ క్రైం పోలీసు కానిస్టేబుళ్లు బీఎన్ఎస్ ప్రసాద్, కె. కళ్యాణరావు, ఎం.ప్రసాద్ సహకరించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు ఎం.వి.సుభాష్, నాగబాబు పాల్గొన్నారు. -
ఏడుతో ఆపి ఆరు ‘అవతారాలు’...
సాక్షి, సిటీబ్యూరో: చిన్న వయస్సులోనే కుటుంబ భారం మీద పడటంతో ఏడో తరగతితోనే చదువుకు స్వస్థి చెప్పిన అతగాడు బతకుతెరువు కోసం అనేక పనులు చేశాడు. ఇలా కష్టం పడటం ఇష్టం లేక మరో ఇద్దరితో కలిసి స్నాచింగ్స్ చేయడం మొదలెట్టాడు. జైలుకు వెళ్లినా బుద్ధిమారకుండా మరోసారి పంజా విసిరి సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ఈ పంథాలో రెచ్చిపోతూ కాలినడకన వచ్చి ఉప్పర్‌బస్తీలో స్నాచింగ్‌కు పాల్పడిన మహ్మద్ ఇమ్రాన్‌ను కటకటాల్లోకి పంపినట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ శుక్రవారం వెల్లడించారు. ఏడుతో ఆపి ఆరు ‘అవతారాలు’... గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఏడో తరగతి చదువుతుండగా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో అక్కడితో చదువుకు స్వస్థి చెప్పిన అతను కుటుంబ పోషణ కోసం కూలీగా మారాడు. అంతటితో ఆగిపోకుండా ఒక్కోటి నేర్చుకుంటూ కార్పెంటర్, ప్లంబర్, ఆటోమొబైల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్‌గానూ పని చేశాడు. చివరకు ఎయిర్ కండిషనర్ల మెకానిజం నేర్చుకున్న ఇమ్రాన్ ఏసీ టెక్నీషియన్‌గా స్థిరపడ్డాడు. ఇంత వరకు బాగానే ఉన్నా... అలా వచ్చే సంపాదనతో సంతృప్తి చెందకపోవడమే అసలు సమస్యకు కారణమైంది. ఆ ఇద్దరితో కలవడంతో... అసలే తన సంపాదన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇమ్రాన్‌కు గోల్కొండ ప్రాంతానికే చెందిన నేరగాళ్లు అఫ్రోజ్, జఫ్ఫార్, ఇర్ఫాన్లతో పరిచయం ఏర్పడింది. వీరి ప్రోద్భలంతో స్నాచర్‌గా మారిన అతను 2014లో వనస్థలిపురం ఠాణా పరిధిలో రెండు స్నాచింగ్స్ చేశాడు. అదే ఏడాది అక్టోబర్‌లో పోలీసులకు చిక్కిన ఇతను 2017 ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆపై కొన్నాళ్లు తన ఏసీ టెక్నీషియన్ పని కొనసాగించాడు. చేతినిండా పని లేకపోవడంతో ఆ ఆదాయం కుటుంబపోషణకు సరిపోలేదు. దీంతో మళ్లీ పాతబాటే పట్టాలని నిర్ణయించుకున్నాడు. పక్కాగా రెక్కీ.. ఆపై పరిచయం... రెయిన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలోని యాకత్‌పురలో అనేకచోట్ల ఇమ్రాన్ రెక్కీ చేశాడు. చివరకు ఉప్పర్‌బస్తీలో ఉండే ఓ వృద్ధురాలిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో ఆమె ఒక్కరే ప్రతిరోజూ ఒంటరిగా ఇంటి బయట కూర్చుంటూ ఉండటం, జనసంచారం తక్కువగా ఉండటం ఇతడికి కలిసి వచ్చాయి. రెండు రోజుల పాటు అటుగా వెళ్లిన ఇమ్రాన్ ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నాడు. తనపై ఆమెకు పూర్తి నమ్మకం వచ్చిందని తెలిసిన తర్వాత అసలు ప్లాన్ అమలు చేశాడు. ఆ రోడ్డుపై ద్విచక్ర వాహనం తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో కాలినడకనే వెళ్లి ఆమె మెడలో ఉన్న 12 తులాల బంగారం గొలుసు లాక్కుపోయాడు. 15 కిమీ సాగిన ‘దర్యాప్తు’... కొంతదూరం పారిపోయిన ఇమ్రాన్ తనను ఎవరూ గుర్తించకుండా ఉండటానికి దుస్తులు కూడా మార్చుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో రెయిన్‌బజార్ ఠాణాలో కేసు నమోదైంది. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్‌వర్మ, ఎన్.శ్రీశైలం, మహ్మద్ తఖ్రుద్దీన్, వి.నరేందర్ తమ బృందాలతో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలి నుంచి 15 కిమీ వరకు ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను అధ్యయనం చేశారు. అలా లభించిన క్లూ ఆధారంగా ఇమ్రాన్‌ను నిందితుడిగా గుర్తించి శుక్రవారం పహాడీషరీఫ్‌లోని సోదరుడి ఇంట్లో పట్టుకున్నారు. ఇతడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు. -
చైన్ స్నాచర్లను పట్టించిన ‘గూగుల్ పే’
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ నగర్ పరిధిలో కలకలం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కేసును నగర పోలీసులు చేధించారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మోను వాల్మీకి, చింతమల్ల ప్రణీత్ చౌదరి, చొకాలు ఉన్నారు. ఈ సందర్బంగా నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. గత నెలలో కలకలం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కేసును సీరియస్ పరిగణించామని.. ఈస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ల పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారని వివరించారు. ప్రణీత్ చౌదరి గూగుల్ పే ద్వారా నగదు లావాదేవీలు జరపడంతో వారిని అరెస్టు చేయడం సులువైందన్నారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. 21 వేల వాహనాలను తనిఖీ చేశాం ‘గత నెల 26, 27 తేదీల్లో 11 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రత్యేక టీంను రంగంలోకి దింపి నిందుతులను పట్టుకున్నాం. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 21 వేల వాహనాలను తనిఖీ చేశాం. వాహనాల తనిఖీల్లో 1600 వాహనాలను సీజ్ చేశాం. 600 సీసీ పుటేజ్‌లు, వందల సంఖ్యలో లాడ్జ్‌లలో తనిఖీలు చేశాం. పట్టుబడ్డ వారిలో కీలక వ్యక్తి చింతల ప్రణీత్ చౌదరి. రెండేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. మరో కీలక వ్యక్తి చొకా. ఇతడూ నేర చరిత్ర కలిగినవాడే. ’అంటూ అంజనీ కుమార్ పలు విషయాలను వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. అంతరాష్ట్ర స్నాచర్లు పక్షం క్రితం రెండు రోజుల్లో హల్చల్ చేశారు. 11 స్నాచింగ్స్ చేయడంతో పాటు మరో యత్నానికీ పాల్పడ్డారు. మొదటి రోజు ఉదయం మలక్‌పేటలో బైక్ (టీఎస్ 08 ఈపీ 4005) అద్దెకు తీసుకున్న వీరు అదే రోజు సాయంత్రం గంట వ్యవధిలో మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఐదు చోట్ల పంజా విసిరారు. అక్కడి నుంచి నల్లగొండ చౌరస్తా మీదుగా మలక్‌పేట వరకు వచ్చిన వీరు మళ్లీ వెనక్కు వెళ్లి చైతన్యపురి ప్రాంతంలో అదృశ్యమయ్యారు. ఆ రాత్రి ఓ లాడ్జిలో తలదాచుకున్న ఈ ద్వయం గురువారం ఉదయం నాగోల్‌లో ఓ స్నాచింగ్‌కు యత్నించింది. ఆపై 7 గంటలకు చైతన్యపురిలో మొదలెట్టి 40 నిమిషాల్లో వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో నాలుగు స్నాచింగ్స్ చేసింది. హయత్‌నగర్ నుంచి తిరిగి ఎల్బీనగర్ మీదుగా సాగర్ రోడ్డు వరకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. -
మహిళా ప్రయాణికుల్లా నటించి..
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ నగర్, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఆర్టీసి బస్సులలో ప్రయాణిస్తూ నగలను అపహరిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాణికుల మాదిరిగా నటిస్తూ మహిళల నుంచి బంగారు గొలుసులను కొట్టేస్తున్న జ్యోతి, దివ్య, యాదమ్మ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 26 తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని తెలిపారు. వీరిపై ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 10 కేసులు, వనస్ధలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉన్నాయని వివరించారు. మంగళవారం వారిని రిమాండ్‌కు తరలించారు. -
ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్ట్
హైదరాబాద్: ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బీహెచ్ఈఎల్లో నివాసం ఉండే పనుగొండ వీణ తన కుమార్తెను తీసుకుని ఈ నెల 4వ తేదీన రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం బీరంగూడ చెక్‌పోస్ట్ కమాన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ ముగ్గురూ పటాన్చెరు మండలం కర్దనూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. బీహెచ్ఈఎల్లో చైన్‌స్నాచింగ్ చేసినట్లు నిందితులు అంగీకరించారు. వారి నుంచి మూడు తులాల బంగారు గొలుసుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కె.భుజంగరావు తెలిపారు.