వీజీటీఎం అభివృద్ధి పనులు ఆగలేదు
విజయవాడ సెంట్రల్: వీజీటీఎం ఉడా చేపట్టిన అభివృద్ధి పనులు ఆగలేదని చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వీజీటీఎం- ఉడా పాలకవర్గ సమావేశం శనివారం నగరంలోని కార్యాలయంలో జరిగింది. అనంతరం చైర్మన్ తన చాంబరులో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినందువల్లే ఉడా పరిధిలో లే అవుట్లకు అనుమతులు నిలిపివేసినట్లు చెప్పారు. బిల్డింగ్ ప్లాన్లు యథావిధిగా మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉడా రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి తమకు అందలేదన్నారు. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న ప్రాంతాల్లోనే ఇన్నర్‌రింగ్ రోడ్డు పనులు ఆగినట్లు వివరించారు.
అన్ని ఊహాగానాలే.. ఉడా రద్దవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇదే చివరి పాలకవర్గ సమావేశమని ముమ్మరంగా ప్రచారం సాగింది. ఉడా ఉంటుందో.. రద్దవుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం కొందరు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్‌ను కలిసి తమగోడు వెళ్లబోసుకుంటున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది చివరి సమావేశం అనుకోవడం ఊహాజనితమేనని పేర్కొన్నారు.
గుంటూరు-అమరావతి-ఉంగుటూరుల మీదుగా కంభంపాడు వరకు రూ.3.50 కోట్లతో రోడ్డు నిర్మించాలని తీర్మానించారు. ఇందులో కోటి రూపాయలు మాత్రమే ఉడా భరిస్తోంది. మిగిలిన సొమ్మును వేరే ఏజెన్సీల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
ఉడాలో పనిచేస్తున్న, రిటైర్ అయిన ఉద్యోగులు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందకపోతే 350 గజాల ఇంటి స్థలాన్ని మార్కెట్ ధర ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు.
350 గజాల కంటే అధికంగా స్థలాలు పొందిన 9 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని తీర్మానించారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు 16.0 కి.మీ నుంచి 17.కి.మీ వరకు ఫోర్‌లైన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు రూ.95 లక్షలు కేటాయించారు.