దేవగుడి సోదరులకు మాతృవియోగం
ఆసుపత్రిలో భౌతిక కాయాన్ని సందర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్: దేవగుడి సోదరులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిల మాతృమూర్తి సి.వెంకటసుబ్బమ్మ (77) మంగళవారం హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆమె కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. శ్వాసకోస సంబంధ వ్యాధి వల్ల ఆమె మూత్ర పిండాల పనితీరు కూడా క్షీణించింది. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచారు.
మరణ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి 10.45 గంటల ప్రాంతంలో స్టార్ ఆసుపత్రికి వెళ్లి వెంకటసుబ్బమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి తన సంతాపాన్ని తెలిపారు. అక్కడే ఉన్న ఆది, నారాయణరెడ్డిలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జగన్ వెంట వచ్చి వెంకటసుబ్బమ్మ భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఉన్నారు.