chalo secretariat
-
కోల్‌కతాలో యుద్ధ వాతావరణం
కోల్‌కతా/హౌరా: బీజేపీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం సందర్భంగా గురువారం కోల్‌కతా, హౌరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఘర్షణల్లో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కోల్‌కతా, హౌరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్లపై ఎక్కడ చూసినా.. కాల్చిన టైర్లు, రువ్విన రాళ్లు కనిపించాయి. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా, వేలాది కార్యకర్తలు మధ్నాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సచివాలయం వైపునకు వెళ్లడం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ మార్చ్ ప్రారంభించారు. వారిని మాలిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కార్యకర్త నుంచి బుల్లెట్లతో ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తమపై నాటు బాంబులు వేశారని పోలీసులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు నేతృత్వంలో సాగిన మార్చ్‌ను సాంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడా ఘర్షణ జరిగింది. పోలీసులతో ఘర్షణల్లో బీజేపీ నేత రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో గాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్ఘీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌ల నేతృత్వంలో సాగిన చలో సెక్రటేరియట్ మార్చ్‌ను కోల్‌కతాలోని హాస్టింగ్స్–ఖిద్దర్‌పోర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు తమపై దాడి చేశారని విజయ్‌వర్ఘీయ ఆరోపించారు. దాదాపు వంద మందికి పైగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం తలపెట్టిన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమత సర్కారును సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మమత బెనర్జీ అవినీతిమయ, హింసాత్మక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారన్నారు. మమత పాలనకు బీజేపీ అంతం పలకడం ఖాయమన్నారు. ‘మమత తన సచివాలయాన్ని మూసివేసుకునేలా ధీరులైన మా బీజేవైఎం కార్యకర్తలు పోరాడారు. ఆమె ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారనేందుకు ఇదే ఉదాహరణ’ అని నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే విషయంలో మాత్రం గత వామపక్ష ప్రభుత్వం కన్నా మమత సర్కారు మెరుగ్గా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త -
టీడీపీకి 2019లో అగ్రిగోల్డ్ బాధితుల దెబ్బ..
సాక్షి, గుంటూరు : టీడీపీకి 2019 ఎన్నికల్లో అగ్రిగోల్డ్ బాధితుల దెబ్బ తగులుతుందని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్వాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఆ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల(మే) 30, 31 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మఘోష పాదయాత్ర ఉంటుందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం నేటికి సమావేశం కాలేదు. ఎన్నో ఆశలతో బాధితులు ఎదురుచూస్తున్నారు. కానీ అగ్రిగోల్డ్ సమస్యలపై పాలకుల్లో ఏ విధమైన చలనం లేదని విమర్శించారు. అందుకు నిరసనగా గుంటూరు నుంచి వెలగపూడి వరకు ‘ఛలో సెక్రటేరియట్’ కు పిలుపునిచ్చామన్నారు. పోలీసులకు పని లేకుండా శాంతియుతంగా ఈ నిరసన పాదయాత్ర చేపడతాం. 20 లక్షల అగ్రిగోల్డ్ బాధితులపై టీడీపీ మహానాడులో తీర్మానం చేయాలని కోరారు. అంతేకాక బాధితుల ఆర్తనాదాలను గమనించి తక్షణమే రూ. 3,965 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులు ఆత్మహత్యలకు పాల్పడకుండా మా అసోసియేషన్ ఎంతో కృషి చేస్తోందని ముప్వాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. -
పోరుబాట
కదం తొక్కిన ఉద్యోగులు ⇒ చలో సచివాలయంతో ముందుకు ⇒ అడ్డుకున్న పోలీసులు ⇒ పలుచోట్ల అరెస్టులు ⇒ గంటల తరబడి బైఠాయింపు ⇒ బుజ్జగింపులు ⇒ పరిష్కరించుకుంటే పోరు ఉధృతం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉద్యోగులు,ఉపాధ్యాయులు శనివారం కదం తొక్కారు. చలో సచివాలయం నినాదంతో రాజధాని వైపుగా పోటెత్తారు. చేపాక్కం అతిథి గృహాల వద్ద ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బుజ్జగింపులతో ఉద్యోగుల్ని దారికి తెచ్చుకున్నారు. డిమాండ్లను పరిష్కరించుకుంటే, మహా పోరుతో ముందుకు సాగాల్సి ఉంటుందని ఈసందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాక్షి, చెన్నై: ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చెన్నై నగరం పోటెత్తింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకమై రాష్ట్రం నలుమూలల నుంచి సచివాలయం ముట్టడి తరలివచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న యాభై శాఖల్లో వందకు పైగా విభాగాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ముప్ఫై నుంచి యాభై లక్షల మంది వరకు నిరంతర, తాత్కాలిక, ఒప్పంద, కాంట్రాక్టు ఉద్యోగ, కార్మికులుగా పనిచేస్తున్నారు. అలాగే, ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఎక్కువే. తరచూ తమ డిమాండ్లను పరిష్కరించాలని నినదిస్తూ ఆయా విభాగాల పరిధిలోని సంఘాలు గత కొంతకాలంగా గళం విప్పుతూ వస్తున్నాయి. ఆందోళనలు సాగించినా, చర్చలతో పాలకులు కాలయాపన చేశారు. ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిన ఉద్యోగ సంఘాలు ఇటీవల ఏకమయ్యాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ జాక్టో.. జియోగా ఆవిర్భవించాయి. డిమాండ్ల సాధన లక్ష్యంగా ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధం అయ్యాయి. దశల వారీగా గత నెల రోజుల పాటుగా ఆందోళనలు సాగిస్తూ రాగా, ప్రస్తుతం తమలోని ఆక్రోశాన్ని వెల్లగక్కే రీతిలో శనివారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెన్నైకి పోటెత్తారు. కదం తొక్కిన ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, అలవెన్స్‌లు, ఎనిమిదో వేతన కమిషన్ అమలు, పాత పెన్షన్ విధానం తదితర అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర రాజ«ధాని చెన్నై వైపుగా పోటెత్తారు. ఉద్యోగ సంఘాలు చలో సచివాలయంకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నై వైపుగా వచ్చే రహదారుల్లో ముందస్తు అరెస్టులకు సిద్ధం అయ్యారు. రైల్వే స్టేషన్లలోనూ నిఘా పెంచారు. తిరునల్వేలి, మదురై, తిరుచ్చి, సేలం, కోయంబత్తూరుల నుంచి చెన్నై వైపుగా రైళ్లల్లో వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా, వేలాదిమంది పోలీసు వలయాన్ని ఛేదిస్తూ చేపాక్కం అతిథి గృహాల వద్దకు ఉదయాన్నే దూసుకొచ్చారు. పది గంటల సమయంలో వేలాదిమంది ఏకం కావడంతో పోలీసులకు ముచ్చెమటలు తప్పలేదు. ఎవరినీ అరెస్టు చేయకుండా, ముందుస్తు ఏర్పాట్లుచేశారు. సచివాలయం వైపుగా వెళ్లే అన్ని దారుల్ని మూసివేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు చేపాక్కం అతిథి గృహాల వద్ద గంటల తరబడి బైటాయిం చారు. ప్లకార్డులు చేత బట్టి, తమ డిమాండ్లను నినదిస్తూ హోరెత్తారు. బుజ్జగింపు చివరకు ఆందోళనకారుల్ని బుజ్జగించేందుకు పోలీ సులు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు దిగి వచ్చిన ఆందోళనకారులు, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఆందోళన విరమించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి దిగి రాని పక్షంలో ఎక్కడికక్కడ పాలన స్తంభింపచేస్తామన్నారు. నెల గడువు ఇస్తున్నామని, అప్పటికీ స్పందన లేని పక్షంలో సెప్టెంబరులో సమ్మె తప్పదన్నారు. ఇక, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం మీద చిత్తశుద్ధితో ఇకనైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన నిమిత్తం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి రావడంతో ఆదివారం జరగనున్న టీఎన్పీఎస్సీ గ్రూప్–2ఏ పరీక్షల ఏర్పాట్లపై అధికార వర్గాలు కుస్తీలు పట్టాల్సి వచ్చింది.