పోరుబాట
కదం తొక్కిన ఉద్యోగులు
⇒ చలో సచివాలయంతో ముందుకు
⇒ అడ్డుకున్న పోలీసులు
⇒ పలుచోట్ల అరెస్టులు
⇒ గంటల తరబడి బైఠాయింపు
⇒ బుజ్జగింపులు
⇒ పరిష్కరించుకుంటే పోరు ఉధృతం
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉద్యోగులు,ఉపాధ్యాయులు శనివారం కదం తొక్కారు. చలో సచివాలయం నినాదంతో రాజధాని వైపుగా పోటెత్తారు. చేపాక్కం అతిథి గృహాల వద్ద ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బుజ్జగింపులతో ఉద్యోగుల్ని దారికి తెచ్చుకున్నారు. డిమాండ్లను పరిష్కరించుకుంటే, మహా పోరుతో ముందుకు సాగాల్సి ఉంటుందని ఈసందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సాక్షి, చెన్నై: ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చెన్నై నగరం పోటెత్తింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకమై రాష్ట్రం నలుమూలల నుంచి సచివాలయం ముట్టడి తరలివచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న యాభై శాఖల్లో వందకు పైగా విభాగాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ముప్ఫై నుంచి యాభై లక్షల మంది వరకు నిరంతర, తాత్కాలిక, ఒప్పంద, కాంట్రాక్టు ఉద్యోగ, కార్మికులుగా పనిచేస్తున్నారు. అలాగే, ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఎక్కువే. తరచూ తమ డిమాండ్లను పరిష్కరించాలని నినదిస్తూ ఆయా విభాగాల పరిధిలోని సంఘాలు గత కొంతకాలంగా గళం విప్పుతూ వస్తున్నాయి. ఆందోళనలు సాగించినా, చర్చలతో పాలకులు కాలయాపన చేశారు. ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిన ఉద్యోగ సంఘాలు ఇటీవల ఏకమయ్యాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ జాక్టో.. జియోగా ఆవిర్భవించాయి. డిమాండ్ల సాధన లక్ష్యంగా ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధం అయ్యాయి. దశల వారీగా గత నెల రోజుల పాటుగా ఆందోళనలు సాగిస్తూ రాగా, ప్రస్తుతం తమలోని ఆక్రోశాన్ని వెల్లగక్కే రీతిలో శనివారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెన్నైకి పోటెత్తారు.
కదం తొక్కిన ఉద్యోగులు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, అలవెన్స్‌లు, ఎనిమిదో వేతన కమిషన్ అమలు, పాత పెన్షన్ విధానం తదితర అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర రాజ«ధాని చెన్నై వైపుగా పోటెత్తారు. ఉద్యోగ సంఘాలు చలో సచివాలయంకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నై వైపుగా వచ్చే రహదారుల్లో ముందస్తు అరెస్టులకు సిద్ధం అయ్యారు. రైల్వే స్టేషన్లలోనూ నిఘా పెంచారు. తిరునల్వేలి, మదురై, తిరుచ్చి, సేలం, కోయంబత్తూరుల నుంచి చెన్నై వైపుగా రైళ్లల్లో వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా, వేలాదిమంది పోలీసు వలయాన్ని ఛేదిస్తూ చేపాక్కం అతిథి గృహాల వద్దకు ఉదయాన్నే దూసుకొచ్చారు. పది గంటల సమయంలో వేలాదిమంది ఏకం కావడంతో పోలీసులకు ముచ్చెమటలు తప్పలేదు. ఎవరినీ అరెస్టు చేయకుండా, ముందుస్తు ఏర్పాట్లుచేశారు. సచివాలయం వైపుగా వెళ్లే అన్ని దారుల్ని మూసివేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు చేపాక్కం అతిథి గృహాల వద్ద గంటల తరబడి బైటాయిం చారు. ప్లకార్డులు చేత బట్టి, తమ డిమాండ్లను నినదిస్తూ హోరెత్తారు.
బుజ్జగింపు
చివరకు ఆందోళనకారుల్ని బుజ్జగించేందుకు పోలీ సులు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు దిగి వచ్చిన ఆందోళనకారులు, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఆందోళన విరమించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి దిగి రాని పక్షంలో ఎక్కడికక్కడ పాలన స్తంభింపచేస్తామన్నారు. నెల గడువు ఇస్తున్నామని, అప్పటికీ స్పందన లేని పక్షంలో సెప్టెంబరులో సమ్మె తప్పదన్నారు. ఇక, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం మీద చిత్తశుద్ధితో ఇకనైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన నిమిత్తం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి రావడంతో ఆదివారం జరగనున్న టీఎన్‌పీఎస్సీ గ్రూప్–2ఏ పరీక్షల ఏర్పాట్లపై అధికార వర్గాలు కుస్తీలు పట్టాల్సి వచ్చింది.