సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో ఓ ఉన్నతాధికారి అవినీతి బాగోతం బట్టబయలైంది. ఉపాధ్యాయులు, కింది స్థాయి ఉద్యోగులపై చర్యల పేరిట వసూళ్లకు పాల్పడుతున్న ఓ డీఈఓ దందా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులు, సిబ్బంది చేసే చిన్న తప్పిదాలకే కన్నెర్రజేస్తూ నోటీసులివ్వడం.. ఆ తర్వాత తన అనుచరులతో బేరసారాలు జరిపి సదరు ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం.. చివరకు చర్యలు తూచ్ అంటూ తను జారీ చేసిన నోటీసులను రద్దు చేయడం నిత్యకృత్యంగా మారింది. ఇలా అధికారాన్ని అడ్డగోలు చర్యలకు ఉపయోగించిన ఉన్నతాధికారిపై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
హెచ్‌ఎం నుంచి వాచ్‌మన్ వరకు..
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్‌పై అత్యధికంగా చిల్లర వసూళ్లకు సంబంధించిన ఫిర్యాదులే వచ్చినట్లు తెలుస్తోంది. ఆకస్మిక తనిఖీల పేరిట పాఠశాలలను సందర్శించడం.. అక్కడ ఆలస్యంగా వచ్చిన టీచర్లకు నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరడం జరిగేది. తనిఖీ అనంతరం నోటీసులు తీసుకున్న ఉద్యోగులు సిబ్బందితో డీఈఓ అనునయులు బేరసారాలకు దిగడం... నిర్దేశిత మొత్తాన్ని డీఈఓకు ముట్టజెప్తూ నోటీసులను రద్దు చేయించడం ఒక తంతులా జరిగేది. హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మొదలు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, నైట్ వాచ్‌మన్... ఇలా ఎవర్నీ వదలకుండా అందిన కాడికి దండుకోవడంతో వేసారిన బాధితులు ఏకంగా ప్రభుత్వానికే ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో దాదాపు 40 ఫిర్యాదులు ప్రభుత్వానికి అందడంతో వాటిని తీవ్రంగా పరిగణిస్తూ ప్రభుత్వం అభియోగాల చిట్టా తయారు చేసింది. ఇందులో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.5 వేలు మొదలు రూ.20 వేల వరకు ఉద్యోగి స్థాయిని బట్టి వసూలు చేసినట్లు తెలిసింది. ఇవేగాకుండా టీచర్ల సస్పెన్షన్, నచ్చిన ప్రాంతాల్లో పోస్టింగులివ్వడం, డిప్యుటేషన్లు, నిధుల దుర్వినియోగంలాంటి ఎన్నో ఘనకార్యాలు చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆయనపై పూర్తిస్థాయి విచారణకు పాఠశాల విద్యాశాఖ చర్యలు మొదలుపెట్టింది. విచారణ కోసం ప్రత్యేకాధికారిని నియమిస్తున్నట్లు తెలిసింది.
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు..
డీఈఓ నాంపల్లి రాజేశ్ వసూళ్లపర్వంపై విద్యాశాఖలో దుమారం రేగుతోంది. ఆయన వసూళ్ల ఘనకార్యాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీఈఓ రాజేశ్ అవినీతి కార్యకలాపాలపై అభియోగాల చిట్టా తయారు చేసిన ప్రభుత్వం వాటిని ప్రాథమికంగా ధ్రువీకరిస్తూనే ఉన్నత స్థాయి విచారణ జరపాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆదేశాలు జారీ చేశారు.
డైరెక్టరేట్‌కు బదిలీ...
ఉన్నతాధికారి రాజేశ్‌పై తీవ్ర అభియోగాలు వెల్లువెత్తడంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టి.విజయ్‌కుమార్ డీఈఓ పోస్టు నుంచి తప్పించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని ఆదర్శపాఠశాలల విభాగంలో ఉప సంచాలకుడిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఎన్వీ దుర్గాప్రసాద్‌ను నిజామాబాద్ డీఈఓగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు ఇచ్చారు.
వసూళ్ల డీఈఓకు చెక్!
Published Sat, Oct 13 2018 2:27 AM | Last Updated on Sat, Oct 13 2018 2:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment