సోమవారం ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ మరింత వివాదాస్ప దమవుతోంది. ఈ వ్యవహారంపై అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం జరిపిన సమాలోచనలు కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. క్షేత్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతను మంత్రి దృష్టికి తెచ్చేందుకు సంఘాల నేతలు ప్రయత్నించారు. విభజన పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్ని సంఘాలు అభిప్రాయపడ్డాయి. హడావుడిగా ఆప్షన్లు ఇవ్వమనడం సరికాదంటూ, స్థానికతకు ప్రాధాన్యత లేకుండా, సీనియారిటీకే పెద్దపీట వేయడాన్ని సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. యూటీఎఫ్, పీఆర్‌టీయూ, ఎస్టీయూ సహా 12 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంత్రి సబిత విడివిడిగా సంప్రదింపులు జరిపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సంఘాలు ఇచ్చిన లిఖిత పూర్వక అభ్యంతరాలను మంత్రి పరిశీలించారు.
జూనియర్లకు అన్యాయం
స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ పోస్టులు జిల్లా క్యాడర్‌గా ఉండటం వల్ల ఉపాధ్యాయులకు స్థాన చలనం తప్పడం లేదని, స్థానికతకు ప్రాధాన్యం లేకపోవడం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకున్న జూనియర్లకు అన్యాయం జరుగుతుందని యూటీఎఫ్ ప్రతినిధులు కె.జంగయ్య, చావా రవి మంత్రికి తెలిపారు. కొత్త జిల్లాల్లో 80 శాతం పోస్టులు స్థానికులకే ఇవ్వాలన్నారు. మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలను దామాషా పద్ధతిలో కేటాయించాలని సూచించారు. వితంతువులు, మహిళలను ప్రత్యేక కేటగిరీలో చేర్చాలన్నారు.
ఒక్కరోజులో ఆప్షన్ల ముగింపా?
కేవలం ఒక్క రోజులోనే అప్షన్లు ముగించడం అన్యా యమని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. స్థానికతను వదిలేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. క్యాడర్ విభజన ఉత్తర్వులే అమలు కాకపోతే కొత్త జిల్లాలకు ఉపా ధ్యాయుల కేటాయింపు ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. విభజనకు ముందే వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు న్యాయం చేయాలన్నారు.
ఉత్తర్వులు సవరించండి
టీచర్ల కేటాయింపు ఉత్తర్వులను సవరించాలని పీఆర్‌టీయూ అధ్యక్షుడు పింగిలి సిరిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు కోరారు. సీనియర్ల ఐచ్ఛికాన్ని పరిశీలిస్తూనే, జూనియర్లకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
ప్రధాన డిమాండ్‌కు లభించని పరిష్కారం
విద్యాశాఖ హడావుడిగా ఆప్షన్ల తంతు ముగించిందన్న విమర్శలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం సంఘం నేతలు తెలిపారు. ఆప్షన్ల ఎంపికకు మరికొంత గడువు ఇస్తామని భరోసా ఇచ్చినట్టు చెప్పారు. అయితే స్థానికతపై మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే విధమైన మార్గదర్శకాలు ఇవ్వడం వల్ల, దీనిపై నిర్ణయం తన చేతుల్లో ఉండదనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేసినట్లు చెప్పారు. స్థానికతను పరిగణలోనికి తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌కు చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ఆందోళన ఉధృతం
ఉద్యోగుల విభజన అంశంపై ఉపాధ్యాయ వర్గాలో ఆందోళన పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద పలు సంఘాల నేతలు, జూనియర్ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలను టీచర్లు నిలదీస్తున్నారు. సంఘాల నేతలు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉండటం వల్లే సీనియారిటీ అంశాన్ని సమర్థిస్తున్నారని జూనియర్ ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులకు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలతో లేఖలు వస్తున్నాయి. ఆప్షన్ల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని టీచర్లు ఆరోపిస్తున్నారు. కొందరు నకిలీ సర్టిఫికెట్లతో తప్పుదారి పట్టిస్తున్నారని వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కార్తికేయ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment