ఉపాధ్యాయులకు నచ్చచెబుతున్న గ్రామస్తులు
బంట్వారం : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులే కుమ్ములాటకు దిగారు. ఈ ఘటన సోమవారం కోట్çపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల బదిలీపై వచ్చిన గోపాలకృష్ణ కోట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండాగా అదే పాఠశాలలో గత కొన్నేళ్లుగా హిందీ మాస్టర్ సంతోష్ విధులు నిర్వర్తిస్తున్నాడు.
గత కొన్ని రోజులుగా వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడడం లేదు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున విద్యార్థుల కోసం తయారు చేసుకున్న అల్ఫారం విషయంలో సంతోష్, గోపాలకృష్ణల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ తాజాగా సోమవారం పాఠశాల సమయంలో ఇద్దరు ఉపాధ్యాయలు ఘర్షణకు దిగారు. హిందీ మాస్టర్ సంతోష్ ప్రత్యేక గది వినియోగించుకోవడాన్ని హెచ్‌ఎం గోపాలకృష్ణ వ్యతిరేకించారు.
స్టాఫ్ రూంలోనే అందరితో పాటు కూర్చోవాలంటూ సంతోష్ వాడుకునే ప్రత్యేక గదికి తాళం వేయించారు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకు వచ్చింది. పాఠశాల సమయంలోనే ఇద్దరు మాస్టర్లు రచ్చకెక్కడంపై విద్యార్థులు ముక్కన వేలేసుకున్నారు. వీరి రగడ ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది. సమాచారం తెలుసుకున్న ఎంఈఓ చంద్రప్ప వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఈ విషయాన్ని డీఈఓ రేణుకాదేవి దృష్టికి తీసుకువెళ్తానని ఎంఈఓ చంద్రప్ప వారిని హెచ్చరించారు.
గ్రామస్తుల మండిపాటు..
హిందీ మాస్టర్ సంతోష్ వ్యవహరశైలిపై ఎస్‌ఎంసీ చైర్మన్ ఈశ్వర్, తదితరులు మండిపడ్డారు. ఉపాధ్యాయుల ఘర్షణ విషయం తెలియగానే వారు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఐదేళ్లుగా అక్కడే పని చేస్తున్న సంతోష్ వైఖరి బాగోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక గది వినియోగించాల్సిన అవసరమేంటని వారు సంతోష్‌ని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment