ప్రపంచ కప్ గెలుస్తాం!
సాక్షి, హైదరాబాద్: ఆరడుగులకు పైగా ఎత్తు...చక్కటి వేగం...బంతిని స్వింగ్ చేయగల నైపుణ్యం...ఒక అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగేందుకు కావాల్సిన అన్ని లక్షణాలు చామ వ్రజేంద్ర (సీవీ) మిలింద్‌లో ఉన్నాయి. ఈ హైదరాబాద్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ గత కొంత కాలంగా భారత అండర్-19 జట్టు వరుస విజయాలలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఇటీవల ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మిలింద్, వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ఇటీవల తన ప్రదర్శనపై అతను ‘సాక్షి’తో మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే...
ఆసియా కప్ గెలుపు: సీనియర్లు గెలవలేని చోట షార్జాలో మేం పాక్‌ను ఓడించి టైటిల్ నెగ్గడం అమితానందాన్నిచ్చింది. లీగ్‌లో పాక్ చేతిలో స్వల్ప తేడాతో ఓడినా ఫైనల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగాం.
మేం భారీ స్కోరు చేయడంతోనే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. మ్యాచ్‌లో తొలి వికెట్ తీసి శుభారంభం అందించగలిగాను. విజయంతో పాటు త్వరలో ఇక్కడే వరల్డ్ కప్ ఆడనున్న నేపథ్యంలో మైదానాలు, పిచ్‌లపై కూడా మంచి అవగాహన ఏర్పడింది.
అండర్-19 కెరీర్: చాలా బాగుంది. హైదరాబాద్‌లో స్కూల్ క్రికెట్, లీగ్ మ్యాచ్‌లతో పాటు అండర్-19 వరకు నిలకడగా ఆడాను. అదే నాకు వరుస అవకాశాలు తెచ్చి పెట్టింది. ఆస్ట్రేలియా పర్యటన, శ్రీలంకతో టెస్టులు, వైజాగ్ టోర్నీ...ఇలా నా కెరీర్ బాగా సాగుతోంది.
రాబోయే ప్రపంచకప్: ఇతర జట్లతో పోలిస్తే భారత్ పటిష్టంగా ఉంది. ఆడిన గత ఎనిమిది వన్డే టోర్నీల్లోనూ భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ సంఖ్య తొమ్మిదికి చేరుతుందని నమ్ముతున్నా. ఆసియా కప్ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. యూఏఈలో ఎక్కువగా బ్యాటింగ్ వికెట్లే ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే పేసర్లకు ఏ మాత్రం అనుకూలించకపోయినా జట్టుపరంగా చూస్తే మనకు మంచి ఫలితం దక్కవచ్చు. ఏమైనా లోపాలు ఉంటే ఈ నెల 20నుంచి జరిగే ప్రత్యేక శిక్షణా శిబిరంలో సరిదిద్దుకోవచ్చు. టైటిల్‌ను నిలబెట్టుకోగల సత్తా మన జట్టులో ఉంది.
ఐపీఎల్: అండర్-19 క్రికెటర్‌గా ఇప్పుడు నాకు కొంత గుర్తింపు దక్కింది. దాని ఫలితంగా ఈ ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే అదృష్టవంతుడినే!