కోట్లు కురిపిస్తున్న మట్టి!
పటాన్చెరు : చంద్ర మండలంపై భూములు అమ్మకానికి ఉన్నాయని నెట్లో కొందరు దళారులు అమ్మకానికి పెట్టగా క్రయ విక్రయాలు జరిగాయని కూడా విన్నాం. కొనే వాళ్లుంటే అమ్మేందుకు ఏదైనా దొరుకుతుందని చెప్పేందుకు తాజా ఉదాహరణ ఇది. పటాన్చెరు మండలంలో ముత్తంగి చెరువులో మట్టిని గ్రామ పెద్దలు అమ్మకానికి పెట్టారు. ఎకరం విస్తీర్ణంలో మట్టిని తవ్వేందుకు రూ. 6 లక్షలుగా నిర్ణయించారు. ఇలా కొనుగోలు చేసిన వారు మట్టిని బుధ, గురువారాల్లో రాత్రిళ్లు మట్టిని గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్లుగా.. చప్పుడు చేయకుండా ఉండిపోయారు.
వివరాలిలా ఉన్నాయి..
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించ బోతున్న ‘మిషన్ కాకతీయ’ కింద నిధులు కాజేసేందుకు పెద్దలు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే పటాన్చెరు మండలం ముత్తంగి వెనుక గల చెరువు మట్టితో కోట్లాది రూపాయల సంపాదనకు ఎత్తు వేశారు. అనుకున్నదే తడువుగా.. చెరువు మట్టి క్రయవిక్రయాలకు సంబంధించి రెవెన్యూ అధికారి నుంచి అన్ని స్థాయిల్లో అధికారులను మచ్చిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తం వ్యవస్థను సిద్ధం చేసుకుని చెరువు మట్టిని ముత్తంగి నుంచి మేడ్చల్‌కు బుధవారం, గురువారం రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా వందలాది లోడ్ల మట్టిని తరలించారు. స్థానికుల వత్తిళ్ల మేరకు శుక్రవారం రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి మట్టి తరలింపును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి వివరణ కోరగా.. మట్టి తరలింపు విషయం తమ దృష్టికి రాలేదని కాని ఇక నుంచి మట్టి తవ్వకాలను అడ్డుకుంటామన్నారు.
గ్రామంలో సభ : మట్టి తవ్వకాలపై ముత్తంగిలోని గ్రామ పెద్దలంతా కూర్చొని వెనుక చెరువును అమ్ముకున్నారని గ్రామంలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. శుక్రవారం స్థానికులు కొందరు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని కొందరు పార్టీలకు అతీతంగా కలిసిపోయి చెరువు అమ్మకానికి పెట్టారని, ఎకరా భూమి రూ. ఆరు లక్షలకు విక్రయానికి పెట్టారని మొత్తం 15 ఎకరాల భూమిని తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చారని చెప్పారు. గ్రామ సేవకులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. అయితే మిషన్ కాకతీయ కింద ఈ చెరువు తవ్వకాలకు మరో విధంగా నిధులు కాజేసేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారని గ్రామంలో పుకార్లు పుట్టాయి.