గుండె జబ్బులకూ ఓజోన్ కారణం!
వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే ఓజోన్ వాయువు గుండె జబ్బులతో పాటు అనేక ఇతర వ్యాధులకు కారణమవుతున్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. చైనా ప్రజలపై జరిపిన పరిశోధన ద్వారా డ్యూక్, షింగువా, డ్యూక్ కున్షాన్, పెకింగ్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఓజోన్ వాయువు ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గతంలోనే తెలిసినా గుండె జబ్బులకు కారణమవుతుందన్న విషయం గుర్తించడం ఇదే తొలిసారి. చైనాలోని ఛాంగ్సా నగరంలో కొందరిపై ఏడాది పాటు ఈ ప్రయోగం జరిపారు.
ఇళ్లల్లో, బయట ఉన్న ఓజోన్, తదితర కాలుష్య కారక వాయువుల మోతాదులను గుర్తించడంతో పాటు నాలుగు విడతల్లో వీరి రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు స్పైరోమెట్రీ పరీక్షతో వారి ఊపిరిలో గుండె, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమయ్యే కారకాలను గుర్తించారు. కొంత కాలం తర్వాత వీరిలో రక్తంలోని ప్లేట్లెట్లు క్రియాశీలకంగా మారడంతో పాటు రక్తపోటు కూడా ఎక్కువైనట్లు తెలిసింది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపగల మోతాదు కంటే తక్కువ మోతాదు కూడా గుండెజబ్బులకు దారితీస్తున్నట్లు వెల్లడైంది.