Channel V
-
ఆమెకు ఒక్క ఎపిసోడ్ కే రూ.1.25 కోట్లు!
భారతీయ బుల్లితెరలపై ప్రసారాలు మొదలైనప్పటి రియాలిటీ షోలలో సినీనటులదే హవా అని తెలిసిందే. హీరోల విషయం పక్కనపెడితే రియాలిటీ షోల్లో నటీమణుల ఎంపిక విధానం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. వివిధ భాషల్లో రియాలిటీ షోలు చేస్తోన్న హీరోలు ఒకేసారి వెండితెర, బుల్లితెరలపై అభిమానుల్ని కనువిందు చేస్తున్నారు. అదే మహిళల దగ్గరికి వచ్చేసరికిమాత్రం ట్రెండిగ్ హీరోయిన్లను కాదనుకుని మాజీ హీరోయిన్లకు పట్టం కడుతుంటారు షో నిర్వాహకులు. మాధురీ దీక్షిత్, శిల్పా శెట్టి, సోనాలి బింద్రే, కాజల్ సోదరి తనీషా, ఇషా డియోల్, తెలుగులో సదా, రోజా, తమిళంలో కుష్భూ లాంటివాళ్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న లేదా వ్యవహరించిన రియాలిటీ షోలు ఎంత హిట్ అయ్యాయో తెలిసింది. ఒకానొక దశలో మాధురీ, శిల్పాలకు ఒక్కో ఎపిసోడ్ కు గానూ కోటి రూపాయాల పారితోషికం లభించేంది. ఇప్పుడా రికార్డును మరో వెటరన్ హీరోయిన రవీనా టాండన్ బద్దలుకొట్టబోతోంది. ఒక్క ఎపిసోడ్ కు రూ.1.25 కోట్లు.. బాలీవుడ్ నటీనటుల పరంగా బుల్లితెర చరిత్రలోనే అత్యధిక పారితోషికం ఇది! ఈ రికార్డు పారితోషికం అందుకోబోతోంది మరెవరోకాదు.. వెటరన్ హీరోయిన్ రవీనా టాండన్. చానెల్ 'వి' రూపొందిస్తోన్న 'షైన్ ఆఫ్ ఇండియా' రియాలిటీ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ షోకు మరో నటి ఫర్నాజ్ షెట్టి యాంకరింగ్ చేస్తారు. రవీనా గతంలోనూ 'సాహిబ్ బీవీ గులాం', 'ఛోటే మియా', కామెడీకా మహా ముఖాబ్లా', సింప్లీ బాతే విత్ రవీనా' లాంటి రియాలిటీ షోల్లో ప్రేక్షకులను మెప్పించారు. -
‘విత్ యూ’ యాప్‌కు కరీనా ప్రచారం
మహిళల భద్రత కోసం చానెల్ ‘వి’ చేస్తున్న ప్రయత్నాలకు సాయం చేయడానికి బాలీవుడ్ హాట్‌బ్యూటీ కరీనాకపూర్ ఖాన్ ముందుకు వచ్చింది. ముంబై నగరం మహిళలకు ఎంతమాత్రమూ సురక్షితం కాదని కూడా బెబో చెప్పింది. ఆపదలో ఉన్న మహిళలు తమవారికి సందేశం పంపించడానికి ఉపయోగపడేందుకు చానెల్ వి ‘విత్యూ’ పేరుతో ఒక ఆప్‌ను తయారు చేసింది. దీని గురించి ప్రచారం చేసేందుకు కరీనా అంగీకరించింది. ఈ ఆప్ బటన్‌ను నొక్కగానే బాధితురాలి సంరక్షకులు లేదా కుటుంబ సభ్యులకు ఫోన్లకు వెంటనే సమాచారం చేరుతుంది. ‘నాకు ఈ ఆప్ గురించి చెప్పగానే దీనిపై ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. ముంబై వంటి నగరాల్లో నేరాలరేటు విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి మహిళలకు తగిన భద్రత ఎంతైనా అవసరం. నటులకు భారీగా ప్రజాదరణ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటి గురించి ప్రచారం చేయడానికి వాళ్లు ముందుకు రావాలి’ అని కరీనా వివరించింది. ఈ విషయంలో భర్త సైఫ్అలీఖాన్ కూడా తనకు సహకరిస్తున్నడని చెప్పింది. ‘సైఫ్‌తోపాటు మా అమ్మ కూడా నేను ఈ పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. ఇందులో తానూ పాల్గొని ఉంటే బాగుండేదని సైఫ్ అన్నాడు’ అని వివరించిన కరీనా ముంబై శక్తిమిల్లు ప్రాంతంలో మహిళా జర్నలిస్టు అత్యాచారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ పక్కింట్లోనే ఉండే ఓ విదేశీయురాలిపైనా ఇటీవల అత్యాచారం జరిగిందని, మనం నివసించే నగరంలోనే ఇలాంటివి జరుగుతున్నాయని తలుచుకుంటేనే భయంగా ఉందని తెలిపింది. ముంబైలో తరచూ లైంగిక నేరాలు జరుగుతుండడంతో రాత్రివేళ తాను షూటింగులకు వెళ్లినప్పుడు అమ్మ కూడా గాబరా పడుతోందని వివరించింది. ప్రతి మనిషి ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలని, చదువుతోనే మంచి మనుషులుగా మారుతామని చెప్పింది.